Kavitha: బీఆర్ఎస్, కవిత మధ్య పెరుగుతున్న దూరం.. సస్పెన్షన్‌కు రంగం సిద్ధం?
తండ్రిని పల్లెత్తు మాట అనుకుండానే కారు నేతలను మాత్రం కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kavitha: బీఆర్ఎస్ కు, కవితకు మధ్య దూరం పెరుగుతోంది. కొంత కాలంగా బీఆర్ఎస్ నేతలను ఇన్ డైరెక్ట్ గా అటాక్ చేస్తున్న కవిత ఇప్పుడు డైరెక్ట్ అటాక్ కు దిగారు. గులాబీ అధినేత, తన తండ్రి కేసీఆర్ కి కవిత రాసిన లేఖ లీక్ తో కారులో కలకలం మొదలైంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభలోని ప్లస్, మైనస్ పాయింట్లతో కవిత కేసీఆర్ కు లేఖ రాయటం, అది కాస్తా లీకై మీడియాలో సంచలనంగా మారింది. ఇదే సమయంలో కవిత అమెరికాలో ఉండటంతో దీనిపై క్లారిటీకి కాస్త సమయం పట్టింది. ఆ లేఖ కరెక్టా కాదా అనే ప్రచారం కూడా జరిగింది.
అయితే కవిత అమెరికా నుంచి రిటర్న్ వస్తూనే శంషాబాద్ ఎయిర్ పోర్టులో లేఖపై క్లారిటీ ఇచ్చారు. అది తాను రాసిన లెటరే అంటూ బాంబు పేల్చారు. కారులో కుటుంబ కలహాలు పీక్స్ కు చేరాయని అంతకుముందు నుంచి వస్తున్న ఊహాగానాలకు కవిత వ్యాఖ్యలు ఊతమిచ్చినట్లైంది. అప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతీసారి బీఆర్ఎస్ నేతలపై మండిపడుతూనే ఉన్నారు కవిత. తండ్రిని పల్లెత్తు మాట అనుకుండానే కారు నేతలను మాత్రం కార్నర్ చేస్తున్నారు. కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అప్పటి నుంచి ఆ దెయ్యాలు ఎవరు అంటూ కవితకు ప్రశ్నలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే, సమయం వచ్చినప్పుడు బయటపెడతానంటూ ఆమె దాటవేస్తూ వచ్చారు. కొంతకాలంగా పార్టీకి అంటీముట్టన్నట్లు వ్యవహరిస్తున్నారు కవిత. తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేసి బీఆర్ఎస్ కు దాదాపుగా దూరమయ్యారు. జిల్లాలన్నీ చుట్టేస్తూ జాగృతి నేతలను యాక్టివ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ కు దూరంగా ఉండటానికి కారణాలను కూడా గతంలోనే షేర్ చేసుకున్నారు. కేసీఆర్ చెప్పటం వల్లే తెలంగాణ జాగృతిని స్లో డౌన్ చేశామని, కానీ లిక్కర్ స్కామ్ లో తనను జైల్లో వేసినప్పుడు బీఆర్ఎస్ నేతలు సరిగా స్పందించలేదని, ఊహించిన స్థాయిలో గులాబీ పార్టీ ఆందోళనలు నిర్వహించలేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతుందనే ఇండికేషన్స్ ఇచ్చి పొలిటికల్ హీట్ రాజేశారు కవిత.
తనను జైలు నుంచి విడుదల చేసేందుకు బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేసే ప్రతిపాదన కూడా జరిగిందని, కానీ, తాను పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానంటూ ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దాని చుట్టూనే రాజకీయ రగడ రాజుకుంటోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు ఇది ఆయుధంగా మారింది. అయితే కవితపై బీఆర్ఎస్ నాయకులు ఎవరూ బహిరంగ విమర్శలు చేయలేదు.
కానీ, 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నాయకుడు జగదీశ్ రెడ్డి కవిత అంశంపై స్పందించారు. కవిత పార్టీలో ఉంటే ఎమ్మెల్సీగా ఉంటారు లేదంటే ఆ గౌరవం కూడా ఉండదు అంటూ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశారాయన. జాగృతి పేరుతోనే కార్యక్రమాలు చేస్తున్నారు, అది కొత్తగా పెట్టిన సంస్థ ఏమీ కాదన్నారు. ప్రస్తుతం ఆమె పార్టీలో ఉన్నట్లుగా భావిస్తున్నామన్నారు.
ఈ కామెంట్స్ పై కవిత తీవ్రంగా స్పందించారు. పేరు తీసుకోకుండానే జగదీశ్ రెడ్డిని తీసిపారేశారు. లిల్లీపుట్ నాయకుడు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా నల్గొండలో గెలిచారంటూ సెటైర్లు వేశారు. అదే సమయంలో జగదీశ్ రెడ్డికి అసలు ఉద్యమ ప్రస్థానం ఎక్కడిది అంటూ మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే జగదీశ్ రెడ్డి ఎక్కడ ఉండే వారిని ప్రశ్నించారు.
కవిత వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు జగదీశ్ రెడ్డి. లిల్లీపుట్ అన్న కామెంట్ కి పరోక్షంగా కేసీఆర్ శత్రువులు వాడిన భాషనే కవిత వాడారని అన్నారు. కేసీఆర్ శత్రువుల మాటలను కవిత వల్లె వేశారని తన సానుభూతి తెలియజేశారు. తన ఉద్యమ ప్రస్థానం గురించి కవితకున్న అవగాహనకి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు. డైరెక్ట్ కామెంట్స్ కూడా చేశారు. ఇలా కవిత, జగదీశ్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇప్పుడీ వ్యవహారం ఎటు దారితీస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.