రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ

  • Published By: bheemraj ,Published On : December 13, 2020 / 02:37 PM IST
రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం పంపిణీ

Updated On : December 13, 2020 / 3:10 PM IST

plastic rice in ration goods : మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం వేంపల్లిలో ప్లాస్టిక్‌ బియ్యం కలకలం రేపింది. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దుకాణంలో పలువురికి రేషన్‌బియ్యం సరఫరా చేయగా ప్లాస్టిక్‌ బియ్యం ఉన్నట్లు తెలుసుకొని ఆందోళన చేపట్టారు. ప్లాస్టిక్‌ బియ్యం విషయంపై తహసీల్దార్‌ జమీర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయన ఘటన స్థలాన్ని చేరుకుని బియ్యాన్ని పరిశీలించారు. అధికారుల ముందే ప్లాస్టిక్‌ బియ్యాన్ని గ్రామస్థులు కాల్చారు. దీంతో బియ్యం నల్లబడి ఒకదానికొకటి అతుక్కుపోయినట్లు గుర్తించారు. రేషన్‌ దుకాణంలోని 138 బస్తాల్లో ప్లాస్టిక్‌ బియ్యం ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే వాటిని సీజ్‌ చేశారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు తాత్కాలికంగా రేషన్‌ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు.

బియ్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తామని, రుజువైతే దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే కల్తీ బియ్యం పంపిణీ చేస్తున్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులు, రేషన్‌దుకాణం డీలర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.