హైదరాబాద్ లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు

double decker minister ktr : హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు రోడ్డెక్కుతాయా ? 20 ఏళ్ల క్రితం కనుమరుగైన ఈ బస్సులు మళ్లీ నగర ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయా?.. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు తీసుకొచ్చేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోందా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ట్వీట్‌తో… ఇప్పుడు ఇదే ఇంట్రెస్టింగ్ టాఫిక్‌కు తెరలేపింది. సిటీలో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశాలను పరిశీలించాలంటూ… రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ కోరడంతో.. భాగ్యనగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల చర్చ మొదలైంది.
50 ఏళ్ల క్రితం :-
దాదాపు 50 ఏళ్ల క్రితం… హైదరాబాద్ ఇప్పడిలా ఉండేది కాదు… హైదరాబాద్ అంటే.. చార్మినార్, ద్రాక్షపళ్లు, బిర్లా మందిర్ గుర్తుకొచ్చేవి. అంతేకాదు.. హైదరాబాద్‌కు చార్మినార్ తర్వాత అంతటి గుర్తింపు డబుల్ డెక్కర్ బస్సులకు ఉండేది. ఈ బస్సుల గురించి అప్పటి జనం ప్రత్యేకంగా చెప్పుకునేవారు. హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రతి ఒక్కరూ డబుల్ డెక్కర్ బస్సులను ఎక్కడం ఒక పనిగా పెట్టుకునేవారు. ఈ బస్సుల్లో ప్రయాణిస్తూ చారిత్రక కట్టడాలను వీక్షించేవారు.
విలక్షణతకు బస్సులు నిదర్శనం :-
హైదరాబాద్ విలక్షణతకు ఈ బస్సులు నిదర్శనంగా కనిపించేవి.
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ ప్రయాణం.. ఇప్పటి జనాలకైతే తెలీదు.. 20 ఏళ్లు వెనక్కి వెళ్తే… సిటీ రోడ్లపై ఈ బస్సులు చాలానే కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణిస్తూ… హైదరాబాద్ సిటీ అందల్ని చూస్తూ వెళ్తుంటే… కలిగే అనుభూతే వేరు. ఈ అనుభూతిని ఆస్వాదించిన వారు ఇప్పటికీ సిటీలో చాలా మందే ఉన్నారు. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్ వరకు ఆ బస్సులు తిరిగేవి.
టూరిస్టుల ఆసక్తి :-
భాగ్యనగరంలోని అనేక చారిత్రక కట్టడాలను ఈ బస్సులు చుట్టేసేవి. దీంతో వీటిల్లో ప్రయాణించేందుకు టూరిస్ట్‌లు ఆసక్తి కనబర్చే వారు. నిజాం కాలంలోనే డబుల్ డెక్కర్ కాన్సెస్ట్ మొదలయ్యింది. భాగ్యనగరంలో ఆ కాలంలోనే డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టేవి. అప్పటి నుంచి 2002 వరకు ఈ బస్సులు నగర రోడ్లపై పరుగులు పెట్టాయి. ఆ తర్వాత ఏమైందో కానీ కనుమరుగయ్యాయి. విదేశాల్లో తప్పితే మనదేశంలో డబుల్ డెక్కర్ కాన్సెప్ట్ కనుమరుగైంది. ఈ తరం జనానికి బస్సుల గురించి పెద్దగా తెలియదు.
డబుల్ డెక్కర్ బస్సులు, వాటి విశిష్టత,
హైదరాబాద్ లో మళ్లీ చూడొచ్చా :-
అందులో ప్రయాణిస్తే కలిగే థ్రిల్ గురించి చదివిన షాకీర్ హుస్సేన్ అనే ఓ నెటిజన్ … మళ్లీ వాటిని హైదరాబాద్‌లో చూడొచ్చా అంటూ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. ఎన్నో చారిత్రక ప్రాంతాల మీదుగా ఈ బస్సు వెళ్లేదని.. దీనిని టూరిస్టు సిటీ గైడ్ బస్సుగా గానీ.. పబ్లిక్ బస్సుగా గానీ ఉపయోగిస్తే బావుంటుందంటూ సూచించారు. జూపార్క్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్తున్న 7జెడ్ డబుల్ డెక్కర్ బస్సు ఫొటోను ట్విట్టర్ లో కేటీఆర్ కు ట్యాగ్ చేశారు.
ఈ ట్యాగ్‌కు మినిస్టర్ కేటీఆర్ వెంటనే స్పందించారు.
కేటీఆర్ జ్ఞాపకాలు :-
డబుల్ డెక్కర్ బస్సులతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను అబిడ్స్ సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో చదువుకునే రోజుల్లో డబుల్ డెక్కర్‌లో వెళ్లిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఆ స్కూల్‌కు వెళ్లే దారిలో చాలా డబుల్ డెక్కర్‌లు కనిపించేవని… అయితే.. ఇప్పుడు ఆ బస్సులు ఎందుకు పూర్తిగా ఆపేశారో తనకు తెలియదని రిప్లై ఇచ్చారు. హైదారాబాద్ రోడ్లపైకి మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా అని రవాణా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా కేటీఆర్ సూచించారు.
మంత్రి పువ్వాడ స్పందన:-
మునిసిపల్ శాఖ మంత్రి ట్వీట్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. డబల్ డెక్కర్లను రోడ్లపైకి మళ్లీ తెచ్చేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై టీఎస్ ఆర్టీసీ ఎండీతో మాట్లాడతానని కేటీఆర్‌కు రిప్లై ఇచ్చారు. మొత్తంగా.. ఓ నెటిజన్ చేసిన ట్వీట్ ఇద్దరు మంత్రుల మధ్య చర్చకు దారితీసింది. అలాగే… త్వరలో హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతాయనే అంచనాకి అది ఊపిరి పోస్తోంది.
హైదరాబాద్ కు పేరు :-
హైదరాబాద్‌కు వరల్డ్ బెస్ట్ సిటీస్‌లో ఒకటిగా పేరుంది. అలాంటి నగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు భాగ్యనగరంలో పాత జ్ఞాపకాలను సాక్షాత్కరింపచేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. మరోవైపు హైదరాబాద్ మహానగరంలోని పర్యాటక ప్రాంతాలను వరల్డ్ క్లాస్ రేంజ్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇందులో భాగంగానే కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతోంది.
టూరిస్టు స్పాట్ లుగా :-
ప్రధాన కూడళ్లను గ్రీనరీతోపాటు.. వాటి విశిష్టతలు తెలుపుతూ సరికొత్త ధీమ్‌లతో ముందుకెళ్తోంది. అంతేకాదు… చారిత్రక ప్రాంతాలుగా పేరొందని వాటిని టూరిస్ట్ స్పాట్‌లుగా తీర్చిదిద్దుతోంది. టూరిస్ట్ ప్రాంతాల సందర్శనకు డబుల్ డెక్కర్ బస్సులు నడిపతే మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ బస్సులు హైదరాబాద్‌లో అందుబాటులోకి వస్తే… నగరానికి సరికొత్త శోభ తీసుకొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.