Raghunandan Rao: రఘునందన్‌రావు దుబ్బాక వదిలేసి మరో నియోజకవర్గానికి మారతారా?

దుబ్బాక బదులుగా పటాన్‌చెరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పటాన్ చెరు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు.

Raghunandan Rao: రఘునందన్‌రావు దుబ్బాక వదిలేసి మరో నియోజకవర్గానికి మారతారా?

dubbaka mla raghunandan rao

Updated On : July 28, 2023 / 12:32 PM IST

Dubbaka MLA Raghunandan Rao : బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయారు. నియోజకవర్గంలో తప్పితే ఎక్కడా పెద్దగా కనబడటంలేదు. అసెంబ్లీలో శాసనసభాపక్ష నేత పదవి ఆశించిన రఘునందన్ కు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు మింగుడు పడటం లేదట. తాను దుబ్బాకలో గెలిచాకే బీజేపీ పుంజుకుందని బలంగా నమ్మే రఘునందన్.. తనకు మాత్రం బీజేపీలో సరైన స్థానం ఇవ్వడం లేదని గుర్రుగా ఉన్నారనే టాక్ విన్పిస్తోంది. రఘునందన్ మౌనం తుఫాను ముందు ప్రశాంతతకు సంకేతమా? రఘునందన్ భవిష్యత్ వ్యూహాలేంటి?

తెలంగాణ బీజేపీ రాజకీయాల్లో ఎప్పుడూ దూకుడుగా ఉండే లీడర్లలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఒకరు. అయితే ఈ మధ్య ఆయన ఎక్కడా కనిపించడం లేదు. తన గళాన్ని ఎక్కడా వినిపించడం లేదు. పార్టీలో గుర్తింపు లేదని ఢిల్లీ వెళ్లి.. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఏదో ఒక పదవి ఇవ్వాలని కోరిన రఘునందన్ ఇంకా అసంతృప్తితోనే ఉన్నారా? లేక అధిష్టానంపై అలక వహించారా? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ (Bandi Sanjay) ఉన్నప్పుడు ఆయనతో రఘునందన్ అంటీముట్టనట్లే వ్యవహరించేవారు. అయితే కొత్తగా కిషన్‌రెడ్డి (Kishan Reddy) అధ్యక్షుడు అయ్యాక మళ్లీ యాక్టివేట్ అవుతారనే అంతా భావించారు. ఒకట్రెండు సందర్భాల్లో కిషన్ రెడ్డి వెంట కనిపించారు. అయినప్పటికీ గతంలో చూపిన దూకుడు మాత్రం చూపడం లేదు. దీంతో రఘునందన్ ఇలా ఎందుకు సైలెంట్ అయిపోయారనే చర్చ బీజేపీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.

దుబ్బాక ఎమ్మెల్యేగా సంచలన విజయం సాధించిన రఘునందన్‌కు తొలి నుంచి.. అక్కడి క్యాడర్‌తో గ్యాప్ ఉంది. మొదటి నుండి బీజేపీలో ఉన్న నేతలకు, రఘునందన్ కు మధ్య గ్యాప్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ మధ్యే రఘునందన్ కు తప్పా అంటూ దుబ్బాకలో కూడా పాతకాపులంతా కొత్త అస్త్రానికి పదును పెడుతున్నారు. అటు రఘునందన్ సైతం శాసనసభాపక్ష నేత పదవి సైతం ఇవ్వకపోవడంపై కినుక వహిస్తున్నారు. మరోవైపు దుబ్బాక బదులుగా పటాన్‌చెరు (patancheru constituency) నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఫోకస్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా పటాన్ చెరు కేంద్రంగానే రఘునందన్ రాజకీయాలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో రఘునందన్ కు సొంత వర్గం కూడా ఉంది. దేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లు నివసించే మిని ఇండియా లాంటి పటాన్ చెరు నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలువచ్చన్న లెక్కలు కూడా రఘునందన్ వేసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

Also Read: కేసీఆర్‌తో టచ్ లో కాంగ్రెస్ కీలక నేతలు.. నల్లగొండపై ఫోకస్ పెట్టిన గులాబీ బాస్

ఇందులో ఎంతవరకు నిజముందో ఏ ఒక్కరికీ తెలియడం లేదు. రఘునందన్ దుబ్బాక వదిలేసి మరో నియోజకవర్గానికి మారతారా? లేదా? తేడా వస్తే పార్టీకే గుడ్ బై చెప్తారా అన్న గుసగుసలు గట్టిగానే విన్పిస్తున్నాయి. ఒకవేళ మారితే ఏ పార్టీలోకి వెళ్తారన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇవన్నీ అలా ఉంచితే ఇంతకు ముందులా రఘునందన్‌రావు మళ్లీ ఎప్పుడు యాక్టివ్ అవుతారు? ఒక్కసారిగా తెరచాటు రాజకీయానికే పరిమితం అవడం వెనుక ఆయన వ్యూహం ఏంటో అర్థం కాక రాజకీయ వర్గాలు తికమక పడుతున్నాయి. ఏదైనా వకీల్‌సాబ్ నోరు విప్పితేనే ఈ ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడేది.

Also Read: కాంగ్రెస్ కు కౌంటర్ గా కిషన్ రెడ్డి వ్యూహాలు.. ఈ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా?