PM Narendra Modi : మోదీ పక్కనే ఈటల రాజేందర్, వెనుక బండి సంజయ్.. ఎందుకిలా? బీజేపీ సభలో ఆసక్తికర సన్నివేశం
PM Narendra Modi : బీజేపీ అధికారంలోకి వస్తే... ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది.

Eatala Rajender And Bandi Sanjay
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జోరు పెంచింది. ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఏకంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. స్వయంగా ఆయనే తెలంగాణకు వచ్చారు. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు.
కాగా, ప్రధాని మోదీ సభలో పలు ఆసక్తికర దృశ్యాలు కనిపించాయి. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ప్రధాని మోదీ పవన్ కు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సభా వేదికపై పవన్ ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మధ్యమధ్యలో పవన్ తో ముచ్చటించారు. పలు అంశాలపై వేదికపైనే చర్చించారు. పవన్ ను ఎంతో అపాయ్యంగా పలకరించారు మోదీ. సొంత పార్టీ నేతలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తారో.. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత పవన్ కు మోదీ ఇచ్చారనే అభిప్రాయం బీజేపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.
Also Read : బీజేపీ సభలో ఇంట్రస్టింగ్ సీన్.. పక్కపక్కనే ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్.. పవన్‌తో ఏం మాట్లాడారు?
ఇక, గ్రౌండ్ లోకి ప్రధాని మోదీ ఎంతో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎంట్రీ మామూలుగా లేదనే చెప్పాలి. జీపులో మోదీ తరలిరాగా.. కార్యకర్తలు, అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. దారి పొడవునా పూలు చల్లారు. ఇక, జీపులో ప్రధాని వెంట ఎవరెవరు ఉన్నారు అనేది ఆసక్తికర అంశంగా మారింది. ప్రధానితో పాటు ముగ్గురు బీజేపీ నాయకులు జీపులో ఉన్నారు. ప్రధానికి ఓవైపు కిషన్ రెడ్డి ఉంటే మరోవైపున ఈటల రాజేందర్ ఉన్నారు. ప్రధానికి వెనకాల బండి సంజయ్ ఉన్నారు.
కాగా, ప్రధాని పక్కనే ఈటల రాజేందర్ ఉంటే.. ప్రధాని వెనకాల బండి సంజయ్ ఉండటం ఆసక్తికర అంశంగా మారింది. బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈటల రాజేందర్ రాకతో బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయిందనే ప్రచారం ఉంది. బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు బీజేపీ పెద్దలు. అంతేకాదు పార్టీలో తన వర్గానికంటే ఎక్కువగా ఈటల వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్నది బండి సంజయ్ ఆరోపణ. ఈ క్రమంలో జీపులో తన పక్కనే ఉండే అవకాశం ఈటలకు ప్రధాని మోదీ ఇవ్వడం గమనార్హం.
Also Read : హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకు రాలేదు? అసలేం జరిగింది?
ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే… ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అటు ఈటల రాజేందర్ కు ఉంది, ఇటు బండి సంజయ్ కూ ఉంది. ఇద్దరూ బీసీ సామాజికవర్గం నేతలే. అలాంటి ఇద్దరూ ప్రధాని మోదీతో పాటు జీపులో కనిపించడం ఆసక్తికర పరిణామంగా చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైతే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ఈ సభ ద్వారా ప్రధాని మోదీ స్పష్టమైన సంకేతం ఇచ్చారని, తనతో పాటు జీపులో ఈటల, బండి సంజయ్ లను తీసుకెళ్లడానికి ఇదే నిదర్శనం అని బీజేపీ నేతలు చెబుతున్నారు.