పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో తనిఖీల వెనుక పెద్ద కథే?

కాంగ్రెస్‌లోనే పొంగులేటి ఎదుగుదలను ఓర్వలేని వారు ఈడీకి ఉప్పందించారా?

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో తనిఖీల వెనుక పెద్ద కథే?

Updated On : September 28, 2024 / 8:53 PM IST

Ponguleti Srinivasa Reddy: ఈడీ రైడ్స్‌ తెలంగాణ పాలిటిక్స్‌ను మరోమారు వేడిక్కించాయి. మంత్రి పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలపై ఆకస్మాత్తుగా ఈడీ ఎందుకు దాడి చేయాల్సివచ్చిందనేదే ఇప్పుడు అందరి మెదడులను తొలిచేస్తున్న ప్రశ్న…. ఇందులో రాజకీయం ఏమైనా ఉందా? అని అంతా ఆరా తీస్తున్నారు. పొంగులేటి ఎదుగుదల గిట్టని వారే చేశారా? ఈడీకి ఉసిగొల్పిన పెద్దలు కేంద్రంలో వారా? రాష్ట్రంలోనే సొంత పార్టీ నేతల పాత్ర ఉందా? అసలు ఆకస్మాత్తుగా ఈడీ ఎందుకు వచ్చింది? పొంగులేటినే ఎందుకు టచ్‌ చేసింది…? ఈడీ రైడ్స్‌పై పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తున్న గాసిప్స్‌ ఏంటి?

పార్లమెంట్‌ ఎన్నికల ముందు విపక్ష నేతలను హడలెత్తించిన కేంద్ర దర్యాప్తు సంస్థలు మళ్లీ కొరడా ఝుళిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో తనిఖీలతో తమ రాడార్‌ నుంచి నేతలు తప్పించుకోలేరని సంకేతాలు పంపింది ఈడీ. మంత్రి కుమారుడు కొనుగోలు చేసిన ఖరీదైన వాచీలే ఈ దాడులకు ప్రధాన కారణమని బయటకు చెబుతున్నా.. ఈడీ తనిఖీల వెనుక రహస్య అజెండా ఉందనే అనుమానాలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక నేత డీకే శివకుమార్‌లా… రాష్ట్రం నుంచి పొంగులేటి కాంగ్రెస్‌ పార్టీకి ఆదాయ వనరులు సమకూరుస్తున్నారని కేంద్ర పెద్దలకు తెలియడంతోనే ఝలక్‌ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

ప్రతిపక్షాలను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్త సంస్థలను ప్రయోగిస్తుందని ఎన్నికల ముందు నుంచి విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా, కేంద్రం మాత్రం ఆ రెండు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిందనే చెబుతారు. ఇదే సమయంలో విపక్షానికి చెందిన నేతల ఇల్లు, కార్యాలయాలపైనే ఎక్కువగా దాడులు చేయడంతో విపక్షాల ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.

టార్గెట్‌ చేసి ఈడీని ఉసిగొల్పారా?
ఐతే ఇదంతా ఎన్నికల ముందు జరిగిన ఎపిసోడ్‌… కానీ ఇప్పుడు ఎన్నికలు పూర్తయి దాదాపు నాలుగు నెలలు తర్వాత పొంగులేటి, ఆయన బంధువల ఇళ్లల్లో తనిఖీలు జరగడం చర్చకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పుతున్న పొంగులేటిని కావాలనే టార్గెట్‌ చేసి ఈడీని ఉసిగొల్పారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్‌ పెద్దలు.

వృత్తిరీత్యా కాంట్రాక్టర్‌ అయిన పొంగులేటి రాజకీయాల్లోకి వచ్చాక.. తన సంస్థల బాధ్యతల నుంచి తప్పుకున్నారని చెబుతున్నారు. కానీ, ఆయన కాంట్రాక్టు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ పనులు దక్కుతున్నాయని ప్రచారం ఉంది. అదేసమయంలో రాష్ట్రంలో కీలకమైన రెవెన్యూ శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి…. కాంగ్రెస్‌ పార్టీకి అదాయ వనరులు సమకూర్చుతున్నట్లు కేంద్ర పెద్దలకు సమాచారం ఉందంటున్నారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తరహాలో తెలంగాణ డీకేలా పొంగులేటి వ్యవహరిస్తున్నారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారంటున్నారు. ఇక త్వరలో జరిగే హరియాణా, కశ్మీర్‌ ఎన్నికలతోపాటు ఆ తర్వాత వచ్చే మహారాష్ట్ర, జార్ఖండ్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌కు డబ్బు సమకూర్చే పనిని కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలకు అప్పగించారని టాక్‌ నడుస్తోంది. కర్ణాటకలో డీకే, తెలంగాణలో పొంగులేటి ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారనే సమాచారంతో ఆయనకు చెక్‌ చెప్పాలని కేంద్ర సంస్థలను రంగంలోకి దింపారంటున్నారు.

ఇదే ఫార్ములాను తెలంగాణలో..
ఇటీవల కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్‌… ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను కలవడం సంచలనం సృష్టించింది. ఈ పరిణామం తర్వాత డీకే స్వరంలో తేడా వచ్చిందంటున్నారు. ఇదే ఫార్ములాను తెలంగాణలో ప్రయోగించాలని బీజేపీ పెద్దలు భావించడంతోనే ఈడీ రంగంలోకి దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పొంగులేటిని బీజేపీ పెద్దలు టార్గెట్‌ చేశారా? అనే అనుమానాలు ఎక్కువవుతున్నాయి.

మరోవైపు కాంగ్రెస్‌లోనే పొంగులేటి ఎదుగుదలను ఓర్వలేని వారు ఈడీకి ఉప్పందించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌లోకి వచ్చిన పొంగులేటి… అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. కీలకమైన శాఖల బాధ్యతలతోపాటు హైదరాబాద్‌ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌కు ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు పొంగులేటి. ఇక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం తర్వాత ప్రభుత్వ వ్యవహారాలతోపాటు తన పరిధిలోని పార్టీ కార్యకలాపాలపైనా పొంగులేటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను గమనించి భవిష్యత్‌లో తమకు పొంగులేటితో ముప్పు ఉంటుందని భావించిన కాంగ్రెస్‌ నాయకులెవరైనా… ఈడీకి సహకరించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈడీ తనిఖీల వెనుక రాజకీయ హస్తం ఉందనే గట్టిగా వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌తో కాంగ్రెస్‌లోనూ.. ప్రభుత్వంలోనూ పొంగులేటి స్థాయి బయటపడిందని అంటున్నారు. మొత్తానికి ఈడీ రైడ్స్‌ పొంగులేటి ఎలివేషన్‌ పెంచేసిందంటున్నారు.

కూటమిలో ఫైట్‌.. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసా?