కూటమిలో ఫైట్.. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసా?
తనకు అన్యాయం జరిగిందనే కారణంతో బాబ్జీ ఎన్నికల ముందు పార్టీ మారేందుకు ప్రయత్నించగా..

Pendurthi Assembly constituency: ఆ ముగ్గురిదీ ఒకే నియోజకవర్గం… రాజకీయంగా ఒకప్పుడు బద్ధ శత్రువులు.. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. అనుకోకుండా ముగ్గురూ ఇప్పుడు కూటమిలో భాగస్వాములు. ఇద్దరు నేతలు టీడీపీలో ఉండగా, మిగిలిన ఆయన జనసేన. ఈ ముగ్గురిలో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇంకొకాయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు. అందరూ కీలక స్థానాల్లో ఉన్నవారే.. కానీ, ఒకే నియోజకవర్గం కోసం కీచులాడుకోవడంతోనే వస్తుంది తంటా..?
ఈ తగవు తీర్చాల్సిన పెద్దలు అగ్నికి ఆజ్యం పోస్తున్నారట.. దీంతో మంట రోజురోజుకు తీవ్రమవుతోందంటున్నారు. ప్రభుత్వం కొలువుదీరిన వారం పది రోజులకు మొదలైన పంచాయితీ ఇప్పటికీ తీరలేదు. ఇప్పట్లో తేరుకునే పరిస్థితీ కనిపించడం లేదు…? ఒక్కటిగా మెలగాల్సినవారు ఎందుకిలా గొడవ పడుతున్నారు. ఈ ట్రైయాంగిల్ ఫైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం…
విశాఖ నగరంలోని కీలక నియోజకవర్గం పెందుర్తి. ఈ స్థానం నుంచి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కూటమి పెట్టుకున్న నిబంధనల ప్రకారం పెందుర్తిలో జనసేన ఎమ్మెల్యే రమేశ్‌బాబు మాటే చెల్లుబాటు కావాలి.. కానీ, నియోజకవర్గంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తే… ఎమ్మెల్యే మాటకు అసలు ఏ మాత్రం విలువ ఉండటం లేదని టాక్. తన మాట చెల్లుబాటు కానప్పుడు తనకీ పదవి ఎందుకని బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు ఎమ్మెల్యే పంచకర్ల.
ఇద్దరు గన్‌మన్లను వెనక్కి పంపేశారట..
తనకు ఎదురవుతున్న అవమానాలకు నిరసనగా…. ప్రభుత్వం సమకూర్చిన ఇద్దరు గన్‌మన్లను వెనక్కి పంపేశారట… కానీ, ఆయన అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు ఇంతవరకు జరగలేదని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్… ఎమ్మెల్యేకు తెలియకుండానే పెందుర్తి నియోజకవర్గంలో పనులు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్ని వేళ్లూ టీడీపీకి చెందిన ఇద్దరు నేతలను చూపుతున్నాయి. ఆ ఇద్దరిలో ఒకరి వెనుక ఎంపీ భరత్ ఉండటంతో పెందుర్తి ఫైట్ రక్తి కట్టిస్తుంది.
విశాఖ నగరంలోని పెందుర్తి నియోజకవర్గంలో రాజకీయం ఎప్పుడూ వాడివేడిగా ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌ను సీనియర్ నేత బండారు సత్యానారాయణ మూర్తితోపాటు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ ఆశించారు. ఐతే ఈ సీటును పొత్తుల్లో జనసేనకు కేటాయించడంతో ఆ పార్టీకి చెందిన పంచకర్ల రమేశ్‌బాబు టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా గణ విజయం సాధించారు. అయితే ఎన్నికల ముందు సీటు విషయమే పెద్ద రగడే జరగగా… టీడీపీ అధిష్టానం పంచాయితీ నిర్వహించి సీనియర్ నేత బండారుకు పక్కనే ఉన్న మాడుగుల నియోజకవర్గం టికెట్ కేటాయించారు.
ఇక మిగిలిన మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పగించారు. అయితే తనకు అన్యాయం జరిగిందనే కారణంతో బాబ్జీ ఎన్నికల ముందు పార్టీ మారేందుకు ప్రయత్నించగా, విశాఖ ఎంపీ భరత్ కల్పించుకుని బాబ్జీకి భరోసా ఇచ్చారంటున్నారు. దీంతో ఇప్పుడు ఎంపీ భరత్‌ను అడ్డుపెట్టుకుని పెందుర్తిలో బాబ్జీ పెద్దరికం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
వాస్తవానికి పెందుర్తి సీటు ఆశించినా.. బాబ్జీకి విశాఖ దక్షిణ ఇన్‌చార్జిగా ఆ నియోజకవర్గానికి పరిమితం కావాలని సూచించింది టీడీపీ హైకమాండ్. ఐతే ఈ సీటు కూడా జనసేనకు కేటాయించడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు బాబ్జీకి అవకాశం దక్కలేదు. కానీ, ఎంపీ భరత్ అండదండలతో తన సొంత నియోజకవర్గం పెందుర్తిలో తలదూర్చుతున్నారట బాబ్జీ. ఇదే సమయంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు కూడా తన పరపతి చాటుకోడానికి పెందుర్తిలోనే రాజకీయం చేస్తున్నారంటున్నారు. బండారు కూడా గతంలో పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేయడంతో ఇక్కడ తన ప్రభావం తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.
ప్రస్తుతం కామ్‌గా రమేశ్‌బాబు
ఇలా టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు తన నియోజకవర్గంపై పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యే రమేశ్‌బాబు. ఐతే పొత్తు ధర్మంలో బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదంటున్నారు. ఇదే సమయంలో తనకు జరుగుతున్న అన్యాయంపై జనసేన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లారంటున్నారు.
ఐతే కొన్నాళ్లు వేచిచూడాలని హైకమాండ్ ఆదేశించడంతో ప్రస్తుతం కామ్‌గా ఉన్నారు ఎమ్మెల్యే రమేశ్‌బాబు. కానీ, రగులుతున్న అగ్ని పర్వతంలా ఎప్పుడైనా బరస్ట్ అయ్యే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోలీసుల బదిలీలతో ఏదో జరిగిపోయిందని అనుకుంటే.. తాజాగా మండలస్థాయి అధికారుల బదిలీల్లోనూ తన మాట చెల్లుబాటు అవ్వలేదని ఆగ్రహంగా ఉన్నారట పంచకర్ల.
మొత్తానికి ముగ్గురు నేతల తీరుతో పెందుర్తి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పావులు కదుపుతూ నియోజకవర్గంలో ఆధిపత్యానికి ప్రయత్నిస్తుండటమే హీట్ పుట్టిస్తోంది. అయితే నేతల మూడు స్తంభాలాటతో క్యాడర్‌లో అసంతృప్తి కనిపిస్తోంది. కలిసికట్టుగా పనిచేయాల్సిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే ఒకరిని ఒకరు దెబ్బతీసుకునేలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారంటున్నారు. ఇటీవల ఓ నేత వేధింపులతో తాము ఆత్మహత్య చేసుకుంటామని కొందరు కార్యకర్తలు బెదిరించడం ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. మరి ఈ సమస్యకు ముగింపు ఉంటుందా? ఉండదా? అనేదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Hydra demolitions: హైడ్రా చుట్టూనే పావులు కదుపుతున్న పార్టీలు