హైదరాబాద్‌లో అమ్మాయిల పేరుతో సైబర్‌ నేరగాళ్ల వల.. పాపం వృద్ధుడు.. ఈ వయసులో ఆశపడి రూ.38.73 లక్షలు సమర్పించుకుని..

తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేసినందుకు కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు.

హైదరాబాద్‌లో అమ్మాయిల పేరుతో సైబర్‌ నేరగాళ్ల వల.. పాపం వృద్ధుడు.. ఈ వయసులో ఆశపడి రూ.38.73 లక్షలు సమర్పించుకుని..

Representative image

Updated On : June 18, 2025 / 4:31 PM IST

హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి(70)ని హనీ ట్రాప్ చేసి దశల వారీగా రూ.38.73 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. మొదటి నుంచి చివరి వరకు ఆ వృద్ధుడిని అమ్మాయిల పేరుతో నమ్మించి, మోసం చేశారు. ముగ్గురు మహిళలు, ఓ కేబుల్‌ ఆపరేటర్‌ పేరిట వృద్ధుడి నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు లాగారు.

ఫేస్‌బుక్‌లో ఆ వృద్ధుడికి మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని, తన తల్లి టైలర్ అని పరిచయం చేసుకుంటూ ప్రేమగా మాట్లాడింది ఆ మహిళ. తనతో చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని ఆ వృద్ధుడికి ఓ కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చింది. ఆమె ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబర్‌ మాట్లాడి ఆ వృద్ధుడు రూ.10 వేలు పంపాడు.

అనంతరం మహిళ నుంచి ఫేస్‌ బుక్‌లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్‌తో బాధితుడు చాటింగ్ చేశాడు. సదరు మహిళ అనారోగ్యానికి గురైందని, ఆస్పత్రిలో ఉందని చెప్పడంతో ఆమె వైద్య ఖర్చుల కోసం ఆ వృద్ధుడు రూ.10 లక్షలు పంపాడు. అక్కడితో ఆగకుండా క్రెడిట్ కార్డు నుంచి మరో రూ.2.65 లక్షలు ఇచ్చాడు. ఆ తర్వాతి కొన్ని రోజులకి ఆ మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు.

Also Read: రూ.23 వేలలోపే ఈ 2 స్మార్ట్‌ఫోన్లు.. ఏది కొంటే బెటర్? వారెవ్వా.. ఫీచర్లు ఏంటి భయ్యా ఇంత బాగున్నాయ్‌..

ఆమె ఫోన్‌ నంబరు కూడా లేదని చెప్పాడు. ఆ మహిళ తల్లి, సోదరి మాట్లాడతారని కేబుల్ ఆపరేటర్ అన్నాడు. దీంతో కొన్ని రోజులుగా ఆ మహిళ తల్లి, సోదరితో ఆ వృద్ధుడు సన్నిహిత రీతిలో చాటింగ్ చేశాడు. దీంతో తన తల్లి, మైనర్ చెల్లితో చాటింగ్ చేసినందుకు కేసు పెడతానని కేబుల్ ఆపరేటర్ బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఓ పోలీస్ కానిస్టేబుల్‌తో మాట్లాడి ఈ మ్యాటర్ సెటిల్ చేసుకోవాలంటూ ఆ వృద్ధుడికి మెసేజ్ వచ్చింది.

మైనర్ బాలిక చదువుతో పాటు తల్లి డ్వాక్రా రుణం చెల్లింపు కోసం ఆ వృద్ధుడు రూ.12.5లక్షలు చెల్లించాడు. అంతేకాదు, సెటిల్ చేసిన కానిస్టేబుల్‌తో పాటు మరో ఎస్సైకి రూ.లక్ష ఇచ్చాడు. కొన్ని రోజులకు కొత్త ఎస్సై వచ్చాడని, కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయి మరో రూ.7 లక్షలు పంపాడు ఆ బాధిత వృద్ధుడు. మొత్తం రూ.38.73 లక్షలు కలిపి వదిలాక ఆ వృద్ధుడికి అసలు నిజం తెలిసింది. తనను సైబర్‌ నేరగాళ్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.