కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..కేబినెట్ భేటీపై ఉత్కంఠ

  • Published By: madhu ,Published On : April 10, 2020 / 08:23 AM IST
కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..కేబినెట్ భేటీపై ఉత్కంఠ

Updated On : April 10, 2020 / 8:23 AM IST

కరోనా మహమ్మారీ కారణంగా భారతదేశంలో విధించిన లాక్ డౌన్ ఫోర్ డేస్ తో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొనబోతోంది ? లాక్ డౌన్ కొనసాగిస్తారా ? లేక పాక్షికంగా సడలిస్తారా ? కొన్ని ఆంక్షల నడుమ లాక్ డౌన్ విధిస్తారా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు రానున్న రోజుల్లో దొరకనుంది. ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే..ఇక్కడ కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పడుతోంది.

ఈ తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏప్రిల్ 11వ తేదీ శనివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరుగబోతోంది. దీంతో అందరి దృష్టి ఈ సమావేశంపై నెలకొంది. ముందుగానే చెప్పినట్టు లాక్ డౌన్ కొనసాగిస్తారా ? ఏలాంటి నిర్ణయం తీసుకొంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 11వ తేదీ శనివారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.

లాక్ డౌన్, కేసుల పరిస్థితి, ఇతరత్రా వాటిపై అడిగి తెలుసుకోనున్నారు. ఇదే సమయంలో తెలంగాణ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇటీవలే జరిగిన ప్రెస్ మీట్ లో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అభిప్రాయం చెప్పాలని కోరితే..మరో రెండు..మూడు వారాలు లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి సూచిస్తానని చెప్పారు కేసీఆర్. దీంతో కేంద్రం నిర్ణయం ఎలా ఉన్నా..లాక్ డౌన్ ఏప్రిల్ 30 వరకు ఉంటుందని అనుకుంటున్నారు జనాలు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఈ విధంగానే నిర్ణయం తీసుకొనబోతున్నారని టాక్. ఇక కేబినెట్ లో లాక్ డౌన్ అంశంతో పాటు..రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అకాల వర్షాలకు పంటలకు జరిగిన నష్టం తదితర కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుందని తెలుస్తోంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో కేసులు 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం కాస్త తగ్గాయి. గురువారం కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది. గురువారం కరోనాతో ఒకరు చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో మృతుల సంఖ్య 12కు చేరింది. ప్రస్తుతం 414 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరంతా గాంధీ ఆస్పత్రితోపాటు చెస్ట్‌, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న మొత్తం 665 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18మందికి పాజిటివ్‌ వచ్చింది.(ఇకపై ఆ విమానాల్లో ఫుడ్ సర్వీస్ ఉండదు)

ఇదిలా ఉంటే…తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలుచోట్ల కురిసిన వర్షాలకు… మొక్కజొన్న, అరటి, వరి, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో రైతులకు పంటనష్టం ఏర్పడింది. ఉమ్మడి వరంగల్‌, నల్లగొండ, రంగారెడ్డి, మెదక్‌ జిల్లాలోనూ అకాల వర్షాలతో వేల ఎకరాల్లో రైతులకు అపారనష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, చెరకు, జామతోపాటు మిర్చికి తీవ్ర నష్టం జరిగింది. నష్టపోయిన రైతులు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మరి కేబినెట్ లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాలంటే…కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.