ఆ ప్రాంతంలోని బీఆర్ఎస్‌లో గ్రూప్ వార్.. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఆ నేత
అయితే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ను పార్టీ అధిష్టానం ఏ విధంగా చక్కదిద్దుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఇద్దరూ మాజీ ఎమ్మెల్యేలే. అంతేకాదు…వారిద్దరు సొంతపార్టీ నేతలే. కానీ ఎన్నడూ కలవరు..మాట్లాడుకోరు. సొంతపార్టీలో ఉంటూ ఇద్దరూ కలిసి అధికార పార్టీపై పోరాడాల్సింది పోయి…ఆధిపత్యపోరు కోసం కయ్యానికి కాలుదువ్వుతున్నారట. జిల్లా అధ్యక్షుడికి సహకరించకుండా…మాజీ ఎమ్మెల్యే దూరంగా ఉండడం ఇప్పుడు పెద్ద చర్చకే దారి తీస్తుంది. అయితే ఆ మాజీ ఎమ్మెల్యే వ్యహరిస్తున్న తీరు ఇప్పుడు ఆ జిల్లా రాజకీయాల్లోనే కాదు..పార్టీలోను చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ జిల్లా అధ్యక్షుడికి-మాజీ ఎమ్మెల్యేకి మధ్య జరుగుతున్న గ్రూప్ వారేంటి? వాచ్ దిస్ స్టోరీ.
పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా అధ్యక్షుడు చందర్ ఇద్దరూ సఖ్యతగా ఉన్నప్పటికి..మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాత్రం వీళ్లతో కలిసి రావడం లేదట. జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమాలకు సైతం అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారట. తన నియోజకవర్గంలో మరొకరి పెత్తనాన్ని మనోహర్ రెడ్డి అస్సలు సహించడంలేదని టాక్. దీంతో జిల్లా కేంద్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం ఎవరి పరిధిలో వారు నిర్వహించుకుంటున్నారు.
ఏదైనా కార్యక్రమాన్ని నిర్వహంచాల్సి వస్తే జిల్లా కేంద్రం పెద్దపల్లిలో కాకుండా రామగుండం, మంథనిలో నిర్వహిస్తున్నారట గలాబీ నేతలు. మనోహర్ రెడ్డి ఆదేశిస్తే తప్ప ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాలకు హజరు కావడంలేదట. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండం నుండి చందర్ తన శ్రేణులను తీసుకొస్తే..మనోహర్ రెడ్డి అనుచరులు రచ్చకు దిగుతున్నారట. దీంతో జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించే సమాశాలు కాస్తా రసాభాసగా మారుతున్నాయట. ఇటీవల ఎమ్మెల్సీ కవిత జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో వర్గపోరు బహిర్గతంది.
పాదయాత్రకు సంఘీభావం తెలపలేదట
జిల్లా అధ్యక్షుడి హోదాలో కోరుకంటి చందర్ గోదావరి తల్లి కన్నీటి గోస పేరిట రామగుండం నుంచి కొండపోచమ్మ సాగర్ వరకు పాదయాత్ర చేసి కేసీఆర్ ను కలిశారు. పాదయాత్రలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పాల్గొన్నప్పటికి..మనోహర్ రెడ్డి మాత్రం ఎక్కడా కన్పించకపోవడం చర్చనీయాంశమైంది. కనీసం పెద్దపల్లి మీదుగా సాగుతున్న పాదయాత్రకు సంఘీభావం తెలపలేదట.
జిల్లా అధ్యక్షుడిగా ఉన్న చందర్ కు మనోహర్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించడం లేదనేది ఆ పార్టీలో అంతా ఓపెన్ గానే చెప్పుకుంటున్నారు. అందుకే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కోరుకంటి చందర్..అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నా..పార్టీ బలోపేతం కోసం ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా కాస్తా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇలా జిల్లా అధ్యక్షుడిని ముందుకు నడవ నీయకుండా రకరకాల డిమాండ్లతో మనోహర్ రెడ్డి అడ్డు పడుతుండడంతో ఏం చేయాలో అర్ధంకాక కోరుకంటి తల పట్టుకుంటున్నారట. అందుకే తన నియోజకవర్గం వరకే కోరుకంటి పరిమితం అవుతున్నారంటూ నేతలు చెప్తున్నారు.
ఓ పక్క నేతలంతా ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పార్టీ అధిష్టానం చెప్తుంటే. పెద్దపల్లిలో మాత్రం నేతల మధ్య సఖ్యత లోపించి పార్టీ కార్యక్రమాలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయి. అధికార పార్టీని ఢీకొని మరోసారి అధికారంలోకి రావాలంటే..కలిసి కట్టుగా నడవాల్సిన నాయకులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటే ఎలా అంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో కూడా మాజీల హోదాలోనే రాజకీయాలు సాగించాల్సి ఉంటుందంటూ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ఇంటర్నల్ వార్ ను పార్టీ అధిష్టానం ఏ విధంగా చక్కదిద్దుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రాబోయే కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇద్దరూ కలిసి ముందుకు నడిచి పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ సత్తా ఏంటో చూపించాలని పార్టీ నేతలు కూడా కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లోనైనా ఇద్దరూ కలిసి ముందుకు నడుస్తారా లేక ఇలాగే అధిపత్యం కోసం పోట్లాడుకుంటారా అనేది చూడాలి.