Fake Video Call: ఎంతకు తెగించార్రా.. ఏకంగా సీఎం చంద్రబాబు పేరుతో.. వీడియో కాల్ చేసి.. 10వేలు డిమాండ్..

దేవినేని ఉమ పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానన్నాడు.

Fake Video Call: ఎంతకు తెగించార్రా.. ఏకంగా సీఎం చంద్రబాబు పేరుతో.. వీడియో కాల్ చేసి.. 10వేలు డిమాండ్..

Updated On : October 10, 2025 / 4:35 PM IST

Fake Video Call: కేటుగాళ్లు బరితెగించారు. వారి మోసాలకు అంతు లేకుండా పోతోంది. టెక్నాలజీని ఓ రేంజ్ లో దుర్వినియోగం చేస్తున్నారు. అమాయకులను మోసం చేసి డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని వినియోగించి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే వాడేశారు కేటగాళ్లు.

నిజమే అనుకుని 35వేలు పంపారు..

ఏఐని ఉపయోగించి సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను దుండగుడు మోసగించాడు. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కొందరు టీడీపీ నాయకులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తాను దేవినేని ఉమ పీఏనని పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు.. సర్ వీడియో కాల్ చేస్తారని వారితో చెప్పాడు. కాసేపటికే దేవినేని ఉమలా కాల్ వచ్చింది. తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయండి అంటూ 3 ఫోన్ నెంబర్లు పెట్టి.. ఫోన్ పే లో నగదు పంపాలని సూచించాడు. ఇది నిజమే అని నమ్మిన వారు 35వేల పంపారు.

బీఫామ్ ఇప్పిస్తానని మాయమాటలు..

ఈ నెల 7న దేవినేని ఉమ పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానన్నాడు. మీతో సీఎం చంద్రబాబు మాట్లాడతారు అని చెప్పారు. కాసేపటికే వీడియో కాల్ వచ్చింది. అందులో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడారు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకెళ్లి పార్టీ బీఫామ్ ఇప్పిస్తానని చెప్పాడు. ఇక విజయవాడ వచ్చిన తర్వాత ఓ హోటల్ లో దిగమని సలహా ఇచ్చాడు.

ఆ హోటల్ వారికి కూడా ఫోన్ చేసి తమ నాయకులు వస్తున్నారని, వారి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పాడు. సత్తుపల్లి నుంచి 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ వచ్చి హోటల్ లో దిగారు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు 8మందికి అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10వేలు ఇవ్వాలని అనడంతో వారికి అనుమానం వచ్చింది. ఈలోగా హోటల్ సిబ్బంది భోజనాల బిల్లు కట్టాలని పట్టుబట్టడంతో వారు గొడవపడ్డారు.

రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమతో ఫోన్ లో మాట్లాడారు. అంతే దిమ్మతిరిగిపోయే నిజం వెలుగుచూసింది. అసలు తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని దేవినేని ఉమ చెప్పారు. అంతేకాదు ఏలూరు జిల్లా వాసి భార్గవ్ ఇలా మోసం చేస్తున్నట్లు తనకు తెలిసిందన్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని చెప్పి నాయకులు వెనుదిరిగారు.

Also Read: మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుందా?