Farmer Pour Diesel : తహసీల్దార్​ పై డీజిల్​ పోసిన రైతు, తృటిలో తప్పిన ప్రమాదం

తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది.

Farmer Pour Diesel : తహసీల్దార్​ పై డీజిల్​ పోసిన రైతు, తృటిలో తప్పిన ప్రమాదం

Farmer Pour Diesel

Updated On : June 29, 2021 / 6:15 PM IST

Farmer Pour Diesel : తహసీల్దార్ పై ఓ రైతు డీజిల్ పోయడం కలకలం రేపింది. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో ఈ ఘటన జరిగింది. నిన్న తాళ్లపల్లి తండాలో మాలోత్ బాలు అనే రైతు పొలం దగ్గర కరెంట్ షాక్ తో చనిపోయాడు. అయితే, శివ్వంపేట తహసీల్దార్ భాను ప్రకాశ్.. బాలుకు సకాలంలో పట్టాదార్ పాసు పుస్తకాలను ఇవ్వలేదని, దీంతో బాలుకు రైతు బీమా రాదని స్థానిక రైతులు ఆరోపించారు.

వారంతా కలిసి బాలు మృతదేహంతో శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. మృతదేహంతో ఆఫీసు ముందు ఆందోళన చేశారు. కొందరు రైతులు తమ వెంట డీజిల్ బాటిళ్లనూ తీసుకొచ్చారు. ఇంత ఆందోళన చేస్తున్నా తహసీల్దార్ పట్టించుకోవట్లేదని ఆక్రోశంతో ఓ రైతు తనపై డీజిల్‌ పోసుకున్నాడు.

అంతేకాదు.. బాటిల్ లో మిగిలిన డీజిల్ ను ఏకంగా తహసీల్దార్‌పైనా పోశాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. పక్కనే ఉన్న మిగతా రైతులు అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి అపాయం కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనతో తహసీల్దార్ ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వచ్చి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

కాగా, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఓ రైతు నేరుగా ఆఫీసులోకి వెళ్లి ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో తీవ్రమైన కాలిన గాయాలతో ఆమె మరణించారు. ఆమెను కాపాడబోయిన డ్రైవర్ కూడా ఆ తర్వాత చనిపోయాడు. ఈ నేపథ్యంలోనే తాజా ఘటన కలకలం రేపింది.