వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. కలెక్టర్, అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి
విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు.

Vikarabad district
Vikarabad district: విరాకాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక రైతులు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల వాహనాలపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆందోళన కారులను అడ్డుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫార్మా సంస్థ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణకోసం దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం కొద్దికాలంగా సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పాటును రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read: ఏం గుండెరా ఆమెది..! పక్కనే విషపూరితమైన పామున్నా ఎంత ధైర్యంగా నిల్చుందో చూడండి..
ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకోసం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని దుద్యాల శివారులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కడా) ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, అదనపు కలెక్టర్ లింగనాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తదితరులు వెళ్లారు. దుద్యాల శివారులో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేస్తే.. రైతులు మాత్రం లగచర్లలోనే ఉండిపోయారు. దీంతో కలెక్టర్, అధికారులు రైతులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. కలెక్టర్, అధికారుల వాహనాలు గ్రామం వద్దకు చేరుకోగానే రైతులు ఒక్కసారిగా రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ రాళ్లదాడిలో మూడు వాహనాలు ద్వంసం అయ్యాయి.
ఈ క్రమంలో కలెక్టర్, అధికారులు రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా కొందరు స్థానికులు అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఓ అధికారిని కర్రలతో కొట్టారు. కలెక్టర్ పైనా ఓ మహిళ చేయి చేసుకోవటంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై రైతులను అదుపుచేసే ప్రయత్నం చేశారు. గ్రామంకు భారీగా పోలీసు బలగాలు చేరుకొని రైతులను అడ్డుకున్నారు.