Cheemalapadu Fire Incident : ముగ్గురు మృతి, తెగిపడిన చేతులు కాళ్లు.. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఘోరం
Cheemalapadu Fire Incident : గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులా పేలిపోయింది. పేలుడు తీవ్రతకు పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.

Cheemalapadu Fire Incident
Cheemalapadu Fire Incident : ఖమ్మం జిల్లా చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆత్మీయ సమ్మేళనం రక్తసిక్తంగా మారింది. ఆత్మీయ సమ్మేళనంలో కాల్చిన బాణాసంచా అగ్నిప్రమాదానికి కారణమైంది. ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. 8మంది గాయపడ్డారు.
బాణాసంచా కాల్చగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న పూరి గుడిసె పై పడ్డాయి. గుడిసెకు నిప్పు అంటుకోవడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గుడిసె మంటల్లో కాలి బూడిదైంది. అదే సమయంలో గుడిసెలో ఉన్న వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో బాంబులా పేలిపోయింది. గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఒకరు స్పాట్ లోనే చనిపోయారు.(Cheemalapadu Fire Incident)
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక పేలుడు తీవ్రతకు పలువురి కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. తెగిపడిన శరీర భాగాలతో, గాయపడ్డ వారి హాహాకారాలతో ప్రమాదం జరిగిన ప్రాంతం భయానకంగా ఉంది. క్షతగాత్రుల్లో వారిలో పోలీసులు, జర్నలిస్టులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. అగ్నిప్రమాదంతో అక్కడున్న వారు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు.
వైరా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ వచ్చారు. వారి రాకతో బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చాయి. అదే ఘోర ప్రమాదానికి కారణమైంది.
పోలీసులు.. భారీ బందోబస్తు నడుమ మృతదేహాలను వారి స్వగ్రామం చీమలపాడు తరలించారు. అయితే, గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే వరకు మృతదేహాలను అంబులెన్స్ నుంచి దింపబోమని ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.(Cheemalapadu Fire Incident)
”ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే మా గ్రామంలో అవాంఛనీయ సంఘటన జరిగి ముగ్గురు చనిపోయారు, పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబసభ్యులకు తెలియకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం చేసేశారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రభుత్వం తరపున ఒక అధికారి కానీ, న్యాయం చేస్తామని మృతుల కుటుంబాలకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే మృతదేహాలను ఖననం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. అలాగే 3 ఎకరాల భూమి కూడా ఇవ్వాలని” గ్రామస్తులు డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలు నిరు పేదలు అని, రెక్కాడితే కానీ డొక్క ఆడని పరిస్థితి ఉందని, వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.