Ramesh Rathod : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి ఊట్నూర్ లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ...

Ramesh Rathod : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

Ramesh Rathod Passed Away : ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి ఊట్నూర్ లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యంకోసం ఆయన్ను హైదరాబాద్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గంమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ ఒకసారి జడ్పీ చైర్మన్ గా, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఇటీవల అదిలాబాద్ బీజేపీ టికెట్ ఆశించినప్పటికీ రమేష్ రాథోడ్ కు టికెట్ దక్కలేదు. ఇదిలాఉంటే ఇవాళ తెల్లవారు జామున 3గంటలకు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ రాజకీయాల్లో డీఎస్ మృతి విషాదాన్ని నింపింది. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ మృతివార్త రాజకీయ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Also Read : Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం తాడిహత్నూర్ సర్పంచ్ గా రమేష్ రాథోడ్ తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1999లో టీడీపీ తరపున ఖానాపూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో టీడీపీ నుంచి ఎంపీగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత కొద్దికాలంకు కాంగ్రెస్ పార్టీలో చేరి 2019లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత బీజేపీలోకి వెళ్లిన రమేష్ రాథోడ్.. గత ఎన్నికల సమయంలో ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించగా అవకాశం దక్కలేదు. రమేష్ రాథోడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ఊట్నూర్ కు తరలించారు.

Also Read : అధికారిక లాంఛ‌నాల‌తో రేపు డీఎస్ అంత్య‌క్రియ‌లు.. రాజకీయ ప్రముఖులు సంతాపం

రమేష్ రాథోడ్ మృతి పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అదిలాబాద్ ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా రమేష్ రాథోడ్ అందించిన సేవలు మరువలేనివి అన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి రమేష్ రాథోడ్ ఎంతో కృషి చేశారు. రమేష్ రాథోడ్ చనిపోయారంటే నమ్మలేకపోతున్నా. రమేష్ రాథోడ్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని బండి సంజయ్ తెలిపారు. అదేవిధంగా రమేష్ రాథోడ్ అకాల మృతిపట్ల బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి జోగురామన్న, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.