Nirmal district: డ్రోన్లతో అడవిని జల్లెడ పట్టిన పోలీసులు.. చివరికి వారి జాడను కనిపెట్టేశారు.. గ్రామస్తులు ఏం చేశారంటే..?
పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో ...

Nirmal district
Nirmal district: పోలీసులు ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో రెండుమూడు గంటలపాటు డ్రోన్లతో జల్లెడ పట్టారు. చివరికి వారి జాడను కనిపెట్టారు. సురక్షితంగా వారిని ఇంటికి తీసుకొచ్చారు. దీంతో గ్రామస్థులు ఎస్పీ, ఏఎస్పీ సహా పోలీస్ బృందాలను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఇంతకీ అసలేం జరిగిందంటే..?
నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కప్పన్ పల్లి గ్రామ పరిధిలోని నలుగురు మహిళలు తునికాకు సేకరణకు గురువారం అడవిలోకి వెళ్లారు. సాయంత్రం వేళ అడవిలో తప్పిపోయారు. ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అడవిలోనే ఉండిపోయారు. అడవిలోకి వెళ్లిన మహిళలు రాకపోవటంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం వరకు కూడా మహిళలు ఇంటికి చేరుకోకపోవటంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ రాజేష్ మీనా స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయాన్నే మూడు ప్రత్యేక బృందాలతో అటవీ ప్రాంతానికి వెళ్లారు. అధునాతన డ్రోన్ల సహాయంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. రెండుమూడు గంటల తరువాత డ్రోన్ల సహాయంతో మహిళలు ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. ఆ తరువాత పోలీస్ బృందాలు వారి వద్దకు చేరుకొని వారిని సురక్షితంగా గ్రామంలోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామస్తులు ఎస్పీ, ఏఎస్పీతో సహా పోలీస్ బృందాలను పూలమాలలతో ఘనంగా సన్మానించారు.