Hyderabad : నాలాలో కొట్టుకుపోయిన బాలుడు, హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. షాకింగ్ వీడియో

మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం కారణంగానే బాలుడు అందులో పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. Hyderabad - Boy Washed Away

Hyderabad : నాలాలో కొట్టుకుపోయిన బాలుడు, హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. షాకింగ్ వీడియో

Hyderabad - Boy Washed Away

Updated On : September 5, 2023 / 6:46 PM IST

Hyderabad – Boy Washed Away : హైదరాబాద్ ప్రగతినగర్ లోని ఎన్ఆర్ఐ కాలేజీలో విషాదం చోటు చేసుకుంది. నాలుగేళ్ల నితిన్ అనే బాలుడు నాలాలో కొట్టుకుపోయాడు. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయాడు. నాలాలో గల్లంతైన బాలుడి కోసం రాజీవ్ స్వగృహ వద్ద అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసులు గాలిస్తున్నారు.

హైదరాబాద్ లో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్ సిటీలో నాలాలు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రగతినగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నితిన్ అనే నాలుగేళ్ల బాలుడు రోడ్డు మీదున్న నీటి గుంతలో పడిపోయాడు. అలాగే మ్యాన్ హోల్ లోకి జారిపోయాడు. అక్కడి నుంచి నీటిలో సాయినగర్ చెరువులోకి కొట్టుకుపోయాడు. బాలుడు నీటిలోకి పడిపోవడం అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

Also Read..Telangana Govt : భారీ వర్షాలతో నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు

మ్యాన్ హోల్స్ తెరిచి ఉండటం కారణంగానే బాలుడు అందులో పడిపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఇందులో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంగా చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాలని, మ్యాన్ హోల్స్ ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరిచి ఉంటే వెంటనే మూసివేసే విధంగ జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రగతినగర్ ఘటన.. జీహెచ్ఎంసీ అధికారుల వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనం అని జనం మండిపడుతున్నారు.

హైదరాబాద్ నగరంలో గతంలోనూ ఇలా పలువురు చిన్నారులను మ్యాన్ హోల్స్ మింగేశాయి. నాలాలో పడిపోయి మరణించారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరంలో మ్యాన్స్ హోల్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఇన్ని ఘటనలు జరిగినా.. అధికారులు ఇంకా మేల్కోకపోవడం బాధాకరం అంటున్నారు స్థానికులు. ఇంకా ఎన్ని ప్రాణాలు పోతే అధికారుల్లో మార్పు వస్తుందోనని మండిపడుతున్నారు.

Also Read..Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్

నాలుగేళ్ల బాలుడు నాలాలో కొట్టుకుపోయిన ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది. శోకసంద్రంలో మునిగిపోయారు. మరోవైపు ఈ ప్రమాదం స్థానికుల్లో భయాందోళన నింపింది. వర్షం పడుతున్న సమయంలో రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ మింగుతుందోనని, నాలాలో పడిపోతామోనని.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని నగరవాసులు వాపోతున్నారు.