Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ బిగ్ షాక్ ఇచ్చింది. నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించింది.

Hyderabad: నాగోల్ మెట్రో స్టేషన్‌లో ఫ్రీ పార్కింగ్ ఎత్తివేత.. ప్రయాణికుల ఆందోళన

free parking removed in Nagole metro station causes commuter protest

Nagole metro paid parking: హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల నినాదాలతో నాగోల్ మెట్రో స్టేషన్ బుధవారం మార్మోగిపోయింది. నాగోల్‌లో ఇప్పటివరకు ఉన్న ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని తొలగించి, డబ్బులు వసూలు చేస్తుండడంతో మెట్రో ప్రయాణికులు ఫైర్ అయ్యారు. పెయిడ్ పార్కింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నాగోల్ మెట్రో స్టేషన్‌లో నిరసనకు దిగారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

మెట్రో రైలు టిక్కెట్ రేటుతో సమానంగా పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్యాసింజర్స్ మండిపడుతున్నారు. మెట్రో స్టేషన్లలో టాయిలెట్స్‌కు డబ్బులు వసూలు చేస్తున్న అధికారులు ఇప్పుడు ఉచిత పార్కింగ్‌ కూడా ఎత్తివేయడంపై ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమకు ఫ్రీ పార్కింగ్ ఇవ్వాల్సిందేనని మెట్రో సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఇష్టం వచ్చినట్లుగా తమ నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల్లో పార్కింగ్‌కు ఫీజు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. ఫ్రీ పార్కింగ్ కొనసాగించేలా చూడాలంటూ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థను కోరారు.

నాగోల్ మెట్రో స్టేషన్‌ పార్కింగ్‌లో టూ వీలర్స్ 2 గంటలకు 10 రూపాయలు.. ఎనిమిది గంటల వరకు 25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 12 గంటలకు 40 రూపాయలు ఆ తరువాత ప్రతి గంటకు 5 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కార్లకు 2 గంటలకు 30 రూపాయలు, 8 గంటలకు 75 రూపాయలు, 12 గంటలకు 120 రూపాయలు.. ఆ తర్వాత ప్రతి గంటకు 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పార్కింగ్ ఫీజును పార్క్ హైదరాబాద్ యాప్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో లేదని ప్రయాణికులు చెబుతున్నారు. కాగా, ఇప్పటివరకు మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్లలో మాత్రమే ఫ్రీ పార్కింగ్ సదుపాయం ఉంది.