తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయా, వెనక్కిపోతున్నాయా? అసలు ఏది నిజం..

తెలంగాణ బ్రాండ్‌ను చెడగొడుతున్నారని... కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం.

తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయా, వెనక్కిపోతున్నాయా? అసలు ఏది నిజం..

Gossip Garage : తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయంటూ కాంగ్రెస్….. సర్కార్ విధానంతో పెట్టుబడులు వెనక్కిపోతున్నాయంటూ బీఆర్ఎస్….. రెండు పార్టీల వాదనల్లో వాస్తవం ఏది? అసలు ఈ మాటల యుద్ధం వెనుక మర్మమేంటి… అధికార, విపక్షాల మధ్య ఇలాంటి డైలాగ్ వార్ రోటీన్ అయినా… తెరపైకి వస్తున్న కొత్త అంశాలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతున్నాయి. అధికార, విపక్షం మధ్య హీట్ పుట్టిస్తున్న బ్రాండ్ తెలంగాణ ఫైట్ మతలబేంటి?

సీఎం సోదరుల కంపెనీలకు లబ్ధి చేయడానికేనని ఆరోపణలు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిధుల వేటకు అమెరికా, కొరియా వెళ్లగా… తెలంగాణలో అదే దుమారంగా మారుతోంది. సీఎం సోదరుల కంపెనీలకు లబ్ధి చేయడానికే రేవంత్‌రెడ్డి టూర్‌కి వెళ్లారని… సీఎం విదేశీ పర్యటనతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు కాకపుట్టిస్తున్నాయి. ఒకవైపు సీఎం కొత్త పరిశ్రమలు తెస్తానంటుంటే… ఉన్న పరిశ్రమలు ఎందుకు వెళ్లిపోతున్నాయంటూ ఆరోపణలు గుప్పిస్తోంది గులాబీదళం.

ఆ కంపెనీలు ఎందుకు తరలిపోయాయి?
సీఎం విదేశీ పర్యటన అలా ఉంటే…మరోవైపు రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడాన్ని కూడా వివాదంలోకి లాగే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. అదే విధంగా సీఎం మరో సోదరుడు జగదీశ్‌ రెడ్డికి చెందిన స్వచ్ బయో కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడాన్ని తప్పుపడుతోంది బీఆర్ఎస్. కేవలం 15 రోజుల క్రితమే స్వచ్ బయో కంపెనీ ఏర్పాటు చేయగా, వెయ్యి కోట్లతో పరిశ్రమ స్థాపనకు ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని నిలదీస్తోంది బీఆర్ఎస్.

మరోవైపు ప్రభుత్వం ఇచ్చిన హామీలకు కట్టబడి ఉండకపోతే…. అమర్ రాజా ప్లాంట్ పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్దమౌతోందని సర్కార్ పై దాడి చేస్తోంది బీఆర్ఎస్. సుమారు 9 వేల కోట్ల రూపాయలతో లిథియం బ్యాటరీ ప్లాంట్‌ను తెలంగాణలో ఏర్పాటుకు తాము ప్రయత్నిస్తే… రేవంత్ సర్కార్ ఉదాసీనత కారణంగా తరలిపోయే పరిస్థితి ఏర్పడిందన్నది బీఆర్ ఎస్ వాదన. ఇదే సమయంలో కేన్స్‌ టెక్నాలజీ గుజరాత్‌కు, కార్నింగ్స్‌ సంస్థ తమ ప్లాంట్‌ను చెన్నైకి తరలించిన అంశంపైనా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది.

తెలంగాణ బ్రాండ్‌కు నష్టం జరుగుతోందని ప్రచారం..
సీఎం విదేశాల్లో ఉండగా, తెలంగాణ బ్రాండ్‌కు నష్టం జరుగుతోందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తున్నప్పటికీ… సీఎం సోదరుడి కంపెనీతో ఒప్పందంతో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందంటున్నారు. సీఎం సోదరుల కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టకూడదనే రూల్ ఏమైనా ఉందా? అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నా…. పదిహేను రోజుల క్రితం రిజిస్టర్ అయిన కంపెనీతో పెట్టుబడులపై ఒప్పందం చేసుకోవడమే సందేహాలకు తావిస్తోందంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఆ పెట్టుబడులు అంతా బోగస్ అని బీఆర్ఎస్ ప్రచారం..
సీఎం రేవంత్‌రెడ్డితోపాటు, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు విదేశీ పర్యటనకు వెళ్లగా, ఆ పెట్టుబడులు అంతా బోగస్ అని బీఆర్ఎస్ ప్రచారం చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని పలు విదేశీ కంపెనీలతో మాట్లాడి.. ఆయా కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. వరంగల్లోని కాకతీయ మెగా టెక్ట్స్‌ టైల్‌ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు దక్షిణ కొరియాకు చెందిన పారిశ్రామికవేత్తలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

అదే విధంగా దిగ్గజ ఆటోమోటివ్‌ కంపెనీ హ్యుందాయ్.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని, మెగా టెస్టింగ్‌ సెంటర్ ఏర్పాటు చేయనుందని ప్రభుత్వం చెబుతోంది. ఇలా చాలా కంపెనీలను తెలంగాణకు తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఐతే తెలంగాణ బ్రాండ్‌ను చెడగొడుతున్నారని… కొన్ని కంపెనీలు రాష్ట్రం విడిచి వెళ్లిపోవడాన్ని ఉదహరిస్తూ కలకలం రేపుతోంది విపక్షం. బీఆర్ఎస్ విమర్శలపై సీఎం రేవంత్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఇంట్రస్టెంగ్ గా మారింది.

Also Read : ఎంత పని చేశావమ్మా..! ఐఏఎస్ అధికారి అత్యుత్సాహంతో చిక్కుల్లో రేవంత్ సర్కార్..! అసలేం జరిగిందంటే..