గచ్చిబౌలిలో తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఆ భవనం.. కూల్చివేత పనులు ముమ్మరం..
ఒరిగిన భవనం చుట్టూ ఉన్న నివాస భనవాల్లో ఉంటున్న వారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.

Gachibowli Building Leaning Incident : గచ్చిబౌలి సిద్ధిఖీ నగర్ లో పక్కకు ఒరిగిన భవనం కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. హైడ్రాలిక్ యంత్రం మొరాయింపుతో కాసేపు కూల్చివేత పనులకు అంతరాయం కలిగింది. యంత్రాన్ని సరిచేసిన అధికారులు కూల్చివేత పనులను తిరిగి కొనసాగిస్తున్నారు. రాత్రిలోగా కూల్చివేత పూర్తి చేయాలనే లక్ష్యంతో సిబ్బంది పని చేస్తున్నారు.
గచ్చిబౌలి సిద్ధిఖీనగర్ లో ఒరిగిన నాలుగు అంతస్తుల భవనం కూల్చివేత పనులు కంటిన్యూ అవుతున్నాయి. హైడ్రాలిక్ యంత్రం సాయంతో పైఅంతస్తు నుంచి అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఒరిగిన భవనం చుట్టూ ఉన్న నివాస భనవాల్లో ఉంటున్న వారిని అధికారులు ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. ఉదయమే హైడ్రాలిక యంత్రాన్ని తీసుకొచ్చి కూల్చివేత ప్రారంభించారు.
సిద్ధిఖీనగర్ లో తక్కువ స్థలంలో (50 గజాలు) నిర్మించిన 4 అంతస్తుల భవనం.. మంగళవారం రాత్రి ఒక పక్కకు ఒరిగింది. ఈ ఘటన.. అందులో నివాసం ఉంటున్న వారితో పాటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మూడు రోజుల క్రితం ఆ భవనం వెనుక కొత్త భవనం నిర్మాణ పనులు మొదలయ్యాయి. పిల్లర్లు వేసేందుకు బాగా లోతుగా తవ్వారు. ఆ ఎఫెక్ట్ 4 అంతస్తుల భవనంపై పడింది. మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఒక్కసారిగా ఆ భవనం గుంతల వైపునకు ఒరిగిపోయింది. అందులో నివాసం ఉంటున్న దాదాపు 30 మంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.
ఈ క్రమంలోనే మూడో అంతస్తులో ఉన్న ఇక్బాల్ అనే వ్యక్తి భయంతో పైనుంచి కిందకు దూకేశాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పక్కనే ఉండే స్థలంలో భవన నిర్మాణం కోసం గుంతలు తవ్వడంతో ఇలా జరిగిందని ఒరిగిన భవనం యజమాని చెప్పారు. రెండేళ్ల క్రితం ఇంటిని నిర్మించామన్నారు. తన సర్వస్వం తాకట్టు పెట్టి ఇంటిని నిర్మించానని, దీని కోసం పొలం కూడా ఆమ్మేశానని, ఇప్పుడు భవనాన్ని కూల్చేయడంతో తన కుటుంబం రోడ్డున పడిందని ఇంటి యజమాని కన్నీటిపర్యంతం అయ్యాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని, నష్ట పరిహారం చెల్లించాలని ఇంటి యజమాని వేడుకున్నాడు.
Also Read : ఆ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు