నేడు బాధ్యతలు స్వీకరించనున్న హైదరాబాద్ మేయర్

నేడు బాధ్యతలు స్వీకరించనున్న హైదరాబాద్ మేయర్

Updated On : February 22, 2021 / 9:05 AM IST

mayor of Hyderabad will take charge today : గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో ఉదయం 9.30 గంటలకు ప్రత్యేక పూజలు చేసి.., అనంతరం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సిబ్బంది జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ఏడో అంతస్తులో చాంబర్‌ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ హాజరుకానున్నారని సమాచారం.

ఈనెల 11న జరిగిన మేయర్ ఎన్నికల్లో గ్రేటర్​ పీఠాన్ని ఇద్దరు మహిళలు దక్కించుకున్నారు. ఎంఐఎం మద్దతుతో కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్‌గా, మోతె శ్రీలత ఉప మేయర్‌గా ఎన్నికయ్యారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని… అన్ని పార్టీల సభ్యులను కలుపుకుని నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళతానని విజయలక్ష్మి తెలిపారు.

బంజారాహిల్స్ నుంచి విజ‌య‌ల‌క్ష్మి కార్పొరేటర్‌గా ఎన్నికవ్వగా… డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన మోతె శ్రీలత తార్నాక డివిజన్‌ నుంచి గెలుపొందారు. మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు.

ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రిసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు.