Godavari Flood Water : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. ముంపు ప్రాంతవాసులు పునరావాస కేంద్రాలకు తరలింపు
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Godavari Flood Water
Bhadrachalam – Godavari : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నీటి మట్టం పెరుగడంతో ఆ ప్రాంతంలోని ప్రజలకు దడ పుట్టిస్తోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటి మట్టం 56 అడుగులు దాటింది.
గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. దాదాపు 16 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నీటి మట్టం పెరుగడంతో భద్రాచలంతోపాటు లోతట్టు గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ముంపు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
ఇప్పటివరకు 49 పునరావాస కేంద్రాలకు దాదాపు 5 వేల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగి పోయింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాచలం నుంచి సమీప మండలాలైన దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మరియు
ముంపు మండలాలైన కోనవరం, బీఆర్ పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి నీటి మట్టం 56 అడుగుల నుంచి 58 అడుగులకు చేరే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ప్రియాంక పేర్కొన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.