బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారికి హైకమాండ్ కఠిన పరీక్ష..! ఏంటా పరీక్ష..?

గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది.

బీజేపీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న వారికి హైకమాండ్ కఠిన పరీక్ష..! ఏంటా పరీక్ష..?

Gossip Garage : తెలంగాణ బీజేపీ సారథిపై ఎంపికపై హైకమాండ్‌ ఓ చిత్రమైన పోటీ పెట్టిందట… అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతల సామర్థ్యానికి పరీక్షగా చెబుతున్న ఈ పోటీ ఇప్పుడు కమలం పార్టీలో ఆసక్తికరంగా మారింది. అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలనే ప్లాన్‌తో నేతలు పోటాపోటీగా ఆ పరీక్షలో నెగ్గేందుకు ప్రయత్నిస్తున్నారంటున్నారు. కమలం పార్టీలో హాట్‌టాపిక్‌గా మారిన పోటీ ఏంటి?

కార్యకర్తల్లో బలం ఉన్న నేతకే పట్టం..
తెలంగాణపై భారీగా ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ…. కొత్త అధ్యక్షుడిగా సరైన నేతను ఎంపిక చేయాలని చాలా కాలంగా కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్న బీజేపీ పెద్దలు… కార్యకర్తల్లో బలం ఉన్న నేతకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగా పార్టీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న నేతలు అందరికీ పార్టీ సభ్యత్వ నమోదు పరీక్ష పెట్టినట్లు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణలో బలపడుతూ వస్తున్న బీజేపీ… వచ్చే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కార్యకర్తల బలం ఎక్కువగా ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం గత ఎన్నికల్లో పోలైన 70 లక్షల ఓట్లను పార్టీ సభ్యత్వంగా నమోదు చేయించాలని ఆశిస్తోందంటున్నారు. ఈ టార్గెట్‌ను చేరుకోడానికి పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు.

అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న ఆ నలుగురికీ పరీక్ష..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్లమెంట్‌ సభ్యులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, ధర్మపురి అర్వింద్‌తోపాటు మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఆశలు పెట్టుకున్నారు. ఈ ముగ్గురు ఎవరికి వారే తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్‌ నేత ఈటల రాజేందర్‌ చాలాకాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల… బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే గురిపెట్టారు. పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమే ఇచ్చింది. కానీ, కాషాయ సిద్ధాంతాలను అనుసరించి ఇప్పటివరకు ఈటలకు అధ్యక్ష పదవిపై ఇవ్వకుండా నెట్టుకొచ్చింది. ఇక ఆయన పోటీగా మరో ఇద్దరు ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తుండటంతో పార్టీ ఈ నలుగురికి పరీక్ష పెట్టిందంటున్నారు.

యజ్ఞంలా పార్టీ సభ్యత్వ నమోదు..
రాష్ట్రంలో 70 లక్షల సభ్యత్వాలను చేరుకోవాలంటే ప్రతి బూత్‌లో కనీసం 200 మంది కార్యకర్తలను సంపాదించాలని భావిస్తోంది కమలం పార్టీ. దీంతో పార్టీ అగ్ర నేతలంతా రంగంలోకి దిగి పార్టీ సభ్యత్వ నమోదును ఓ యజ్ఞంలా చేస్తున్నారంటున్నారు. ఎంపీ ఈటలతోపాటు రఘునందన్‌రావు, అర్వింద్‌, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావుతో పాటు మరికొందరు నేతలు ఎవరికివారుగా సభ్యత్వ నమోదును సవాల్‌గా తీసుకుని పనిచేస్తున్నారని చెబుతున్నారు. తమ నియోజకవర్గాలతోపాటు తమ అనుచరుల ద్వారా ఎక్కువ సభ్యత్వం చేయించి… పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. సభ్యత్వ నమోదు పూర్తయ్యాక పార్టీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం బీజేపీ ఆనవాయితీ. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులను నియమిస్తారు. ఇప్పుడు కూడా ఎక్కువ సభ్యత్వాలను నమోదు చేయించి జాతీయ పార్టీ నేతలను ఆకట్టుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారని చెబుతున్నారు.

Also Read : ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు? మంత్రివర్గ విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు..

ఈ నెల 9న ప్రారంభమైన సభ్యత్వ నమోదు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోందంటున్నారు. అధిష్టానం ప్రత్యేక టార్గెట్లు పెట్టడంతో ఎవరు ఎక్కువ సభ్యత్వాలు నమోదు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి కాబోయే బీజేపీ అధ్యక్షుడికి ముందుగానే కఠిన పరీక్ష పెట్టిందంటున్నారు. ప్రతి బూత్‌ స్థాయిలో 200 సభ్యత్వాలు నమోదు చేయడం కుదిరేపనేనా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఐతే పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండటంతోపాటు క్రమంగా బలోపేతమవుతున్నామనే భావనతో నేతలు దూసుకుపోతున్నారు. మొత్తానికి ఈ పరీక్షలో ఎవరు విజయం సాధిస్తారనేది ఆసక్తి రేపుతోంది.