Gudem Mahipal Reddy: కారు యూటర్న్..! ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో బీఆర్ఎస్ ఆలోచన మారిందా.. రీఎంట్రీకి ఓకే చెప్పినట్లేనా..
10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంతో..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది గులాబీ పార్టీ.
- జంపింగ్ లీడర్ల విషయంలో బీఆర్ఎస్ ఆలోచన మారిందా.?
- గూడెం మహిపాల్‌రెడ్డి రీఎంట్రీకి గులాబీ పార్టీ ఓకే చెప్పినట్లేనా.?
- కాంగ్రెస్‌లోకి వెళ్లి..తిరిగి కారు పార్టీకి అనుకూలంగా వాయిస్..
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ నుంచి గూడెం సస్పెండ్
- గూడెంను మినహాయించి 9మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ కేసు
Gudem Mahipal Reddy: కష్టకాలంలో పార్టీని వదిలివెళ్లారు. క్షమించే ముచ్చటే లేదు. మళ్లీ వస్తామన్నా తీసుకునే ఆలోచనే లేదని..జంపింగ్ లీడర్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఓ లైన్‌ను ఫిక్స్ చేసుకుంది. కానీ ఆ ఒక్క ఎమ్మెల్యే విషయంలో మాత్రం కారు పార్టీ తన అభిప్రాయాన్ని మార్చుకుంటుందా అన్న చర్చ జరుగుతోంది. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక లెక్క..బీఆర్ఎస్కు గూడెం మహిపాల్ రెడ్డి మరో లెక్కనా? గూడెంను బీఆర్ఎస్ క్షమించేసిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని ఖరాఖండిగా చెప్పిన గులాబీ పార్టీ గూడెం రీఎంట్రీ విషయంలో పాజిటివ్‌గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. 2023లో బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోయే సరికి ప్రతిపక్షంలో వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మైనింగ్ కేసులో ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లి వచ్చారు. దీంతో ఆరు నెలల్లోనే కారు స్టీరింగ్‌ను వదిలి కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో బాగానే ఉన్నా.. తర్వాత అక్కడ ఇమడలేకపోయారు. బీఆర్ఎస్ హయాంలో మహిపాల్ రెడ్డి తమపై కక్షగట్టి కేసులు పెట్టించారని..పటాన్చెరు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి రాగం వినిపించారు. పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన మహిపాల్ రెడ్డిని పార్టీలో ఎలా చేర్చుకుంటారంటూ లోకల్ లీడర్లు ఆందోళనలు కూడా చేశారు.
బుల్లెట్ దిగిందా లేదా అంటూ డైలాగులు..
కట్ చేస్తే మున్సిపల్ ఎన్నికల టైమ్‌లో యూటర్న్ తీసుకున్నారు గూడెం మహిపాల్‌రెడ్డి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని క్యాడర్‌కు, తన అనుచరులకు పిలుపునిచ్చి..కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో తన సతీమణి, సోదరుడు మధుసూదన్‌రెడ్డి, కుమారుడు విక్రమ్ బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలోకి దిగగా వారికి మద్దతుగా ప్రచారం చేశారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని 5 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంలో మహిపాల్ రెడ్డి చక్రం తిప్పారు. దీంతో పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం బలం తెలిసేలా చేశారు. ఇదే సమయంలో బుల్లెట్ దిగిందా లేదా అంటూ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో గూడెం మహిపాల్ రెడ్డి బిజీ అయ్యారు.
బీఆర్ఎస్ సభ్యులతో కలిసి సభలో నిరసన..
10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇవ్వడంతో..ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మరోసారి హైకోర్టు తలుపు తట్టింది. ఇక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చింది గులాబీ పార్టీ. మొత్తం 10 మంది పార్టీ మారితే.. తొమ్మిది మంది ఎమ్మెల్యేలపై మాత్రమే కోర్టులో పిటిషన్ వేసింది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఫిరాయింపు ఎమ్మెల్యేల జాబితా నుంచి తొలగించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేసినందుకు..మహిపాల్‌రెడ్డిపై చర్యలకు బీఆర్ఎస్ వెనకడుగు వేస్తుందన్న చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా..మొదట పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వైపు మహిపాల్ రెడ్డి కూర్చుకున్నారు. హైకోర్టులో తనపై బీఆర్ఎస్ పిటిషన్ వేయకపోవడంతో..బీఆర్ఎస్ సభ్యులతో గూడెం జత కట్టారు. అంతటితో ఆగకుండా..మంత్రి పొంగులేటికి వ్యతిరేకంగా సభలో బీఆర్ఎస్ సభ్యులతో కలసి నిరసన తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ బీఆర్ఎస్ సభ్యులతో పాటు గూడెం మహిపాల్ రెడ్డిని కూడా సస్పెండ్ చేశారు.
మాజీమంత్రి హరీశ్‌రావు.. అసెంబ్లీ సాక్షిగా గూడెం మహిపాల్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా అభివర్ణించారు. ఇదిలా ఉంటే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను తిరిగి పార్టీలో చేర్చుకునేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేపదే చెప్తూ వచ్చారు. కానీ లేటెస్ట్గా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయట. మిగిలిన 9మంది ఎమ్మెల్యేల విషయంలో ఒక తీరుగా.. గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో మరొక తీరుగా బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గూడెం మహిపాల్ రెడ్డి విషయంలో కేటీఆర్ పాజిటివ్‌గా ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. గూడెం మహిపాల్ రెడ్డికి..హరీశ్‌రావు అండదండలు పుష్కలంగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లో చేరకపోవచ్చని..ఎన్నికలకు ముందు యాక్టీవ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
Also Read: అటు రాజన్న, ఇటు రాములమ్మ ఉగ్రరూపం..! అపోజిషన్‌కి మించి సొంత పార్టీ సర్కార్‌పైనే అటాక్.. ఎందుకు..
