Padi Kaushik Reddy: టార్గెట్ పాడి కౌశిక్ రెడ్డి..! వేటు ఖాయమా? కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది.
- అధికార కాంగ్రెస్‌కు కౌశిక్‌రెడ్డి టార్గెట్ అయ్యారా.?
- కౌశిక్‌రెడ్డి దుందుడుకు చర్యలు చిక్కులు తెచ్చి పెడుతున్నాయా?
- కౌశిక్‌రెడ్డి దూకుడుకు బ్రేకులు వేసేందుకు అధికార పార్టీ ఎత్తులు
- కడియం ఎపిసోడ్‌ను అస్త్రంగా మార్చుకున్న కాంగ్రెస్
- ఎథిక్స్ కమిటీకి పాడికౌశిక్‌రెడ్డి వ్యవహారం
- వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర కేసులో సీఐడీ నోటీసులు
Padi Kaushik Reddy: అధికార కాంగ్రెస్ పార్టీ ఆ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిందా? ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని డిసైడ్ అయ్యిందా? అందుకే అసెంబ్లీలో అంత సీన్ నడిచిందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దుందుడుకు వ్యవహారానికి బ్రేకులు వేయాలని భావిస్తున్న కాంగ్రెస్ …అందుకు రంగం సిద్ధం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో కేటీఆర్, హరీశ్‌రావు తర్వాత అంతటి దూకుడును ప్రదర్శిస్తున్న కౌశిక్ రెడ్డిపై వేటు వేయడం ద్వారా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓ వార్నింగ్ ఇవ్వాలని హస్తం పార్టీ భావిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్.
తెలంగాణ పాలిటిక్స్‌లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్రంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధంలో కౌశిక్ రెడ్డి సెంటర్ పాయింట్‌గా మారారన్న చర్చ జరుగుతోంది. ముందు నుంచి దూకుడు స్వభావం ఉన్న కౌశిక్ రెడ్డి తీరు అధికార కాంగ్రెస్‌కు మాత్రమే కాదు ..కొన్ని సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందన్న చర్చ నడుస్తోంది. కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడతాయో లేక ఆయనే వివాదాలను కొని తెచ్చుకుంటారో తెలియదు కానీ..కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ రచ్చ కామన్ అయిపోయింది.
ఎమ్మెల్యేలతో బాహాబాహీలు, దాడులు..
ఆ మధ్య జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ని టార్గెట్ చేస్తూ నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పు అంటూ కౌశిక్ రెడ్డి బాహాబాహీకి దిగడం అప్పట్లో వివాదంగా మారింది. తనపైన కౌశిక్ రెడ్డి దాడి చేశాడంటూ ఎమ్మెల్యే సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు అరెస్టు దాకా వెళ్లింది. ఆ తర్వాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన అరెకపూడి గాంధీ ఇంటికి వెళ్లడం.. ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దీనికి ప్రతిగా గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి నివాసంపై దాడి చేయడం సంచలనం సృష్టించాయి.
అంతకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చీర, గాజులు చూపిస్తూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. లేటెస్ట్గా వీణవంక మండలంలోని సమ్మక్క జాతరకు కుటుంబసమేతంగా వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదం సృష్టించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మతం పేరుతో దూషించాడంటూ పెను దుమారం రేగింది. అదే రోజు బలవంతంగా కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం, రోజంతా హైడ్రామా కొనసాగింది. ఆవేశంలో మాట్లాడాను, మతం పేరుతో పోలీసు అధికారిని దూషించలేదంటూ క్షమాపణలు కోరుతూ మరుసటి రోజు వీడియో విడుదల చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగినట్లు అయింది. అయితే ఆ తర్వాత మళ్లీ కరీంనగర్ సీపీ సెంట్రిక్‌గా తీవ్ర ఆరోపణలు చేసి రచ్చ చేశారు.
కౌశిక్ రెడ్డిపై సీరియస్ చర్యలు..
ఇక ఇప్పుడు ఆ కేసులో కౌశిక్‌రెడ్డికి సీఐడీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా పలు అంశాల్లో అధికార పార్టీకి సవాల్‌గా మారిన కౌశిక్‌రెడ్డి..అసెంబ్లీ వేదికగా అధికార పార్టీకి అడ్డంగా దొరికిపోయారన్న టాక్ నడుస్తోంది. అసెంబ్లీలో కడియం శ్రీహరిని ఉద్దేశించి ఏవో హావభావాలు ప్రదర్శిస్తూ కెమెరాలకు చిక్కిపోయారు. సీనియర్ అని గౌరవం లేకుండా, దళిత ఎమ్మెల్యే అయిన కడియం పట్ల కౌశిక్ అలా వ్యవహరిస్తారా అంటూ సీఎంతో సహా కాంగ్రెస్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి తీరుపై ప్రభుత్వం సీరియస్ చర్యలకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే కౌశిక్‌పై చర్యల కోసం ఎధిక్స్కమిటీకి రెఫర్చేసినట్లు చర్చ నడుస్తోంది
ఇప్పటికే హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, పార్టీని డ్యామేజ్ చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల బీఆర్ఎస్ నేతలు రహస్యంగా భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వారంతా కౌశిక్‌రెడ్డి వైఖరి నచ్చక బీఆర్ఎస్కు మూకుమ్మడి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వచ్చిన వార్తలతో కారు పార్టీ హైకమాండ్ అలర్ట్ అయింది. అంతలోనే అసెంబ్లీ ఎపిసోడ్ పిడుగులా వచ్చి పడింది. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డిని రాజకీయంగా ఒంటరి చేయాలని, ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేయాలని అధికార పార్టీ భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనపై నమోదవుతున్న కేసులు, పోలీసుల ఆంక్షలు ఇందులో భాగమేనని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
ఈసారి అసెంబ్లీలో కడియంపై సైగలు చేసి అడ్డంగా దొరికేశాడంటున్న అధికార పార్టీ, భవిష్యత్‌లో మరెవరూ ఇలా మాట్లాడకుండా చేస్తామంటూ చెప్పి మరీ వేటు వేసేందుకు సిద్ధమవుతోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌశిక్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాడిన పదజాలం విన్నవారికి ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. త్వరలో కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వంపై వేటు లేదా కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు చెప్పకనే చెప్పేశారు సీఎం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇవ్వాలన్న అధికార పార్టీ వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.
Also Read: ఏపీ Vs తెలంగాణ.. మరోసారి శ్రీశైలం డ్యామ్ నీళ్ల రగడ.. ఎన్నాళ్లీ వివాదం? ముగింపు ఎప్పుడు?
