రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.

రియల్ ఎస్టేట్ ఆదాయంపై హైడ్రా ఎఫెక్ట్..! అయినా తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి..

Updated On : September 21, 2024 / 11:54 PM IST

Gossip Garage : హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణదారులను హడలెత్తిస్తున్న హైడ్రాపై సీఎం రేవంత్‌ మరింత దూకుడు పెంచారు. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు రకరకాల వాదనలు వినిపించినా… సీఎం మాత్రం హైడ్రాపై తగ్గేదేలే అని స్పష్టం చేశారట.. హైడ్రా పనితీరుతో ప్రభుత్వానికి మంచిపేరుతో పాటు చెడ్డపేరు కూడా వస్తోందన్న భయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినా.. భవిష్యత్‌ తరాల కోసం హైడ్రాకు భరోసాగా నిలవాల్సిన అవసరాన్ని తేల్చిచెప్పారట సీఎం. దీంతో హైడ్రా మరింత పదునెక్కి ఆక్రమణదారుల కోరలు పీకేయడం ఖాయమన్న టాక్‌ వినిపిస్తోంది.

చెరువుల ఆక్రమణదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా..
హైడ్రా… ఇప్పుడు తెలంగాణతోపాటు దేశంలో ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బడాబాబులు మొదలు సామాన్యుల వరకు చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటిని నేలమట్టం చేస్తోంది హైడ్రా.

ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది హైడ్రా. ఈ పరిస్థితుల్లో హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టడంతోపాటు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈ క్రమంలోనే శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించి హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.

హైడ్రాతో ప్రభుత్వ ఆదాయం తగ్గినట్లు క్యాబినెట్ లో ప్రస్తావన..
ఐతే క్యాబినెట్ భేటీలో హైడ్రాపై చర్చ సందర్భంగా మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. హైడ్రాపై ప్రజల్లో ఓవైపు ప్రశంసలు వస్తుండగా.. మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైడ్రా పనితీరుపై సామాన్యుల్లో ఆందోళనలను ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట.

హైడ్రా ఏర్పాటు తర్వాత.. రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోందని, హైడ్రా ఎఫెక్ట్ తో గ్రేటర్ లో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింటుందేమోననే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

రూ.400 కోట్ల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని సమాచారం..
హైడ్రా దూకుడు ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపిస్తోందని మంత్రివర్గం సమావేశంలో ఓ సీనియర్ మంత్రి గుర్తు చేశారని తెలుస్తోంది. హైడ్రా ఎఫెక్టుతో ఆగస్టులో సుమారు 400 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట. హైడ్రా పనితీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట మరో సీనియర్ మంత్రి.

ఇలాంటి సమయంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఒకరిద్దరు మంత్రులు క్యాబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. హైడ్రా మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా, అది ప్రభుత్వ భూములను రక్షిస్తున్నా.. అదే సమయంలో ఎదురవుతున్న ప్రతికూలతలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది.

భవిష్యత్తు తరాలకు మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి భావన..
హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఆ సంస్థకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పించడంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన చెరువులను, కుంటలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఓ మంచి పని చేసే సమయంలో కొంత నష్టం తప్పదని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : కాంగ్రెస్‍లో హాట్ టాపిక్‌గా మారిన కొత్త రూల్..! ఇంతకీ పీసీసీ చీఫ్ ప్లాన్ ఏంటి?

హైడ్రా ముఖ్య ఉద్దేశం, భవిష్యత్తు తరాలకు జరిగే మంచి గురించి ప్రతి సందర్భంలోను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం. మొత్తానికి హైడ్రాపై రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గినా.. ముఖ్యమంత్రి మాత్రం భవిష్యత్ తరాల బాగు కోసం ఏ త్యాగమైనా చేయాల్సిందేనని తేల్చి చెప్పారట. దీంతో మంత్రులు కూడా ఇంక చేసేదేమీ లేక హైడ్రాకు జైకొట్టారని టాక్.