ఎంపీ ఈటల రాజేందర్‌పై మరోసారి భూకబ్జా విమర్శలు.. నాలుగేళ్ల కిందటి కహాని ఇప్పుడెందుకు తెరమీదకు వచ్చినట్లు?
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట.

ఈటల రాజేందర్.. తెలంగాణ పాలిటిక్స్‌లో కొన్నాళ్లుగా లైమ్‌లైట్‌లో ఉంటూ వస్తున్న పేరు. లేటెస్ట్‌గా ఆయన బీజేపీ అధ్యక్ష రేసులో ముందున్నారన్న ప్రచారం జరుగుతోంది. సేమ్‌టైమ్ అటు కాంగ్రెస్ సర్కార్ విధానాలపై దూకుడుగా స్పందిస్తున్నారు ఈటల రాజేందర్. సరిగ్గా ఇదే టైమ్‌లో బ్లాస్టింగ్ న్యూస్ చెప్పేశారు మంత్రి కొండా సురేఖ. ఈటల భూకబ్జాల వ్యవహారంపై తొందరలోనే విచారణ ప్రారంభిస్తామంటూ తేల్చిచెప్పారామె.
బీఆర్ఎస్ హయాంలో దేవాదాయ శాఖ భూములు కబ్జాకు గురి అయ్యాయని.. అందులో గత ప్రభుత్వంలో ఉన్న నేతలు ఎక్కువ మంది ఉన్నట్లు తమకు సమాచారం ఉందంటున్నారు కొండా సురేఖ. ఈ క్రమంలోనే మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై త్వరలో విచారణ జరగబోతుందంటూ కుండబద్దలు కొట్టేశారామె. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడే ఈటల రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి.
ఆయన ఎమ్మెల్యే పదవికి, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది కూడా భూకబ్జా ఆరోపణల నేపథ్యంలోనే. ఆ పరిణామాల తర్వాతే ఆయన బీజేపీలో చేరారు. ఇప్పుడు మరోసారి ఈటలపై భూఆక్రమణ ఆరోపణలు ఎక్కుపెడుతోంది కాంగ్రెస్ సర్కార్.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పై భూఆక్రమణలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలంలో ఉన్న దేవరయాంజల్ గ్రామంలో సీతరామ స్వామి ఆలయానికి చెందిన భూములను ఈటల ఆక్రమించారని అలిగేషన్స్ వచ్చాయి. గత బీఆర్ఎస్ సర్కార్ ఓ కమిటీని వేసి విచారణకు కూడా ఆదేశించింది.
అప్పట్లోనే ఈటల క్లారిటీ
ఆ తర్వాత వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో..క బ్జా ఆరోపణలు సైడ్ అయిపోయాయి. తాను వేరే వ్యక్తుల నుంచి కొనుక్కున్నానని… తానెలాంటి కబ్జాలకు పాల్పడలేని అప్పట్లోనే ఈటల క్లారిటీ ఇచ్చేశారు. అయినా ఇప్పుడు మరోసారి దేవాదాయ భూముల కబ్జాపై విచారణ అంటూ మంత్రి సురేఖ ఇచ్చిన స్టేట్‌మెంట్ చర్చనీయాంశంగా మారింది.
అయితే మంత్రి సురేఖ స్టేట్‌మెంట్‌పై ఈటల రాజేందర్ ఇప్పటివరకు ఎక్కడా స్పందించలేదు. ఆయన అనుచరులు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా కావాలని చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే ఎంపీగా గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ విధానాలపై దూకుడుగా వెళ్తున్నారు ఈటల రాజేందర్. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు.
హైడ్రా విషయంలో మిగతా ప్రతిపక్ష నేతలకంటే ముందే ఈటల రియాక్ట్ అయ్యారు. పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పథకాల అమలుతీరుపై కూడా విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. లేటెస్ట్‌గా కులగణన జరిగిన తీరును కూడా ఈటల తప్పుబట్టారు. ప్రజలు కేసీఆర్ పాలనను అసహ్యించుకోవడానికి 9 ఏళ్లు పడితే, రేవంత్ పాలనను 9 నెలలకే అసహ్యించుకుంటున్నారని కూడా అటాక్ చేశారు.
అందుకే భూకబ్జా ఆరోపణలు మళ్లీ తెరమీదకు?
మోదీ బీసీ కాదంటూ సీఎం రేవంత్ చేసిన కామెంట్స్‌పై కూడా సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు ఈటల. ఇలా ప్రతి ఇష్యూలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తీరు మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు. తనదైన స్టైల్‌లో ఈటల..రేవంత్ సర్కార్‌ను విమర్శిస్తుండటం వల్లే..భూకబ్జా ఆరోపణలను మళ్లీ తెరమీదకు తెస్తున్నారంటున్నారు ఆయన అనుచరులు.
తమ నాయకుడి రేవంత్ ప్రభుత్వ విధానాలపై బలంగా వాయిస్ వినిపిస్తున్నందు వల్లే..భూఆక్రమణల చర్చను కొత్తగా తెరపైకి తెస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ బెదిరింపులకు భయపడేదే లేదంటూ తేల్చిచెప్తున్నారు.
అయితే ఈటల దేవాదాయ భూములను కబ్జా చేసినట్లు రేవంత్ సర్కార్ నిర్ధారణకు వచ్చిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. కొండా సురేఖ స్టేట్‌మెంట్ ఆశామాషీగా తీసుకోవడానికి లేదని..పూర్తి ఇన్‌పుట్స్ పరిశీలించాకే ఆమె ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని అంటున్నారు హస్తం లీడర్లు. ఈటల రాజేందర్‌కు సంబంధించిన భూఆక్రమణలపై ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని అధికారులు సేకరించినట్లు చెబుతున్నారు.
దేవాదాయ భూముల ఆక్రమణలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన రేవంత్ సర్కార్ అందుకు సంబంధించి కీలక రిపోర్టును తెప్పించుకుందట. దేవాదాయ భూముల ఆక్రమణలపై పూర్తిస్థాయి విచారణ కోసం.. వచ్చే నెలలో ఉన్నతస్థాయి కమిటీని నియమించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోందట. ఈ విచారణ జరిగితే దేవాదాయ భూకబ్జాలకు సంబంధించి ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నదే ఉత్కంఠ రేపుతోంది.