Mohammad Azharuddin: 6 నెలల ముచ్చటేనా? అజారుద్దీన్‌ను కలవరపెడుతున్న హరికృష్ణ ఎపిసోడ్..!
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్‌కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
Mohammad Azharuddin (Image Source Via Facebook)
- అజారుద్దీన్ మంత్రి పదవికి గండం?
- 6 నెలల్లోగా ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఊస్ట్
- నాడు రాజకీయాలకే దూరమైన హరికృష్ణ
Mohammad Azharuddin: అనూహ్యంగా మంత్రి అయ్యారు. జూబ్లీహిల్స్ బైఎలక్షన్ వేళ..ముస్లిం ఈక్వేషన్ ఆయనకు అమాత్య యోగాన్ని తెచ్చి పెట్టింది. నిజానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గ్రేటర్ కోటాలో మంత్రి కావాలనుకున్నారు అజారుద్దీన్. అయితే ఎంఐఎం అబ్జక్షన్స్‌తో అజార్‌ను జూబ్లీహిల్స్ సీటు రేస్ నుంచి తప్పించారు కాంగ్రెస్ పెద్దలు. సరిగ్గా ఉపఎన్నిక జరుగుతున్న టైమ్‌లోనే ఆయన్ను హడావుడిగా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. అయితే ఏ సభకు ఎన్నిక కాకుండానే మంత్రి అయిన..అజార్ ఆరు నెలల్లోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది.
అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీగా చేసే ఆలోచనలోనే మంత్రివర్గంలోకి తీసుకుంది ప్రభుత్వం. కానీ గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ వీడటం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ లను గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకం చెల్లదని వారి పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఏప్రిల్ 30లోపు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలి..
గత ఆగస్ట్ 30న జరిగిన క్యాబినెట్ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై చర్చించిన మంత్రిమండలి ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్‌ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్‌కు ఫైల్ పంపింది. అయితే కోదండరాం, అమీర్ అలీఖాన్ నియామకంపై వేసిన కేసులో తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయలేదు. అయితే గత అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ఏప్రిల్ 30లోపు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది.
సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు వెయిటింగ్ తప్పదా?
తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది నవంబర్‌లో మూడు ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. కానీ అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే అప్పటివరకు ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత రాజీనామాను స్పీకర్ ఆమోదించినా అది నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసేవరకు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదంటున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి..సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు అజారుద్దీన్, కోదండరాం ఎదురు చూడటం తప్ప మరో మార్గం లేదని లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
ఏప్రిల్ 30 వరకు అజారుద్దీన్ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. లేకపోతే ఆయన మంత్రి పదవి ఊస్ట్ అయ్యే అవకాశముంది. దీంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై కాంగ్రెస్ నేతలు లీగల్ ఎక్స్‌పర్ట్స్‌తో చర్చిస్తున్నారట. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో అప్పీల్ చేసైనా సరే ఎమ్మెల్సీల నియామకంపై సందిగ్ధతకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. లేకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలల ముచ్చటగానే మిగిలిపోనుంది.
హరికృష్ణ రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది..
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. అప్పట్లో హరికృష్ణ కూడా ఏ సభలో సభ్యుడు కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది. మళ్లీ చట్టసభలో ఎన్నడూ అడుగుపెట్టలేకపోయారు. ఇప్పుడు అజారుద్దీన్‌కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
ఒకవేళ ఏప్రిల్ 30లోపు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వకపోతే..అజారుద్దీన్‌తో రాజీనామా చేయించి మళ్లీ క్యాబినెట్‌లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎలాగూ క్యాబినెట్ ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఉండటంతో..అజార్‌ను రిజైన్ చేయించి..మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటే..ఇంకో ఆరు నెలల టైమ్ ఉంటుందని భావిస్తున్నారట. అప్పటిలోగా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడమో లేక..నవంబర్‌లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక బెర్త్ కట్టబెట్టమో రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ ఉంటుందనేది హస్తం పార్టీ పెద్దల ఆలోచన అంటున్నారు. ఏదైనా అజారుద్దీన్‌కు..హస్తం పార్టీకి పెద్ద కష్టమే వచ్చిందన్న చర్చ అయితే జరుగుతోంది.
Also Read: అసెంబ్లీకి కేసీఆర్..? రేవంత్ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేలా గులాబీ బాస్ ప్లాన్..
