Gossip Garage : సొంత పార్టీ ప్రభుత్వంపై సెటైర్లు, ప్రజలు కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారంటూ ప్రశంసలు.. ఏంటీ రాజగోపాల్ రెడ్డి సరికొత్త రాగం?

అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.

Gossip Garage : సొంత పార్టీ ప్రభుత్వంపై సెటైర్లు, ప్రజలు కేసీఆర్‌ను మెచ్చుకుంటున్నారంటూ ప్రశంసలు.. ఏంటీ రాజగోపాల్ రెడ్డి సరికొత్త రాగం?

Updated On : January 29, 2025 / 1:22 AM IST

Gossip Garage : ఉన్నట్లుండి ఆయన మరో బాంబ్‌ పేల్చారు. ఆ మధ్య ఉత్తమ్‌ సీఎం అన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ పథకాల అమలు తీరునే తప్పుబడుతున్నారు. ఆయన మాటల వెనుక మర్మం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌లో ఉండి బీజేపీని పొగిడారు. ఇప్పుడు హస్తం గూటికి చేరి ఎమ్మెల్యేగా ఉండి..గులాబీ బాస్‌ కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని కుండబద్దలు కొట్టేశారు. ఇంతకీ ఆ నేత మళ్లీ ఎందుకు టోన్‌ మార్చినట్లు? బుగ్గకారు యోగం దక్కడం లేదన్న ఫ్రస్ట్రేషన్‌లోనే ఆయన అలా కామెంట్స్‌ చేస్తున్నారా?

ప్రతిపక్ష పార్టీ రాగం పాడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే..
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఆయనేం మాట్లాడినా ఆయన మాటలకు అర్థాలే వేరు అన్నట్లుగా ఉంటుంది సీన్. అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ రాగం పాడుతున్నారు. పైగా సొంత ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడే మంచిగుండే అని ప్రజలు అంటున్నారని మెచ్చుకుంటున్నారు.

ఆ ప్రస్టేషన్‌లోనే అలా మాట్లాడి ఉంటారని గుసగుసలు..
ప్రభుత్వ పథకాలకు పెట్టిన రూల్స్‌పై ఓపెన్‌గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సదరు ఎమ్మెల్యే అసమ్మతి రాగం వెనుక ఆంతర్యం ఏంటన్నదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంత్రివర్గంలో చోటు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ ఎమ్మెల్యే..ఎంతకీ క్యాబినెట్ ఎక్స్‌ప్యాన్షన్‌ కాకపోవడంతో ప్రస్టేషన్‌లోనే అలా మాట్లాడి ఉంటారులే అని కాంగ్రెస్‌ నేతలు గుసగుసలు పెట్టుకుంటున్నారు.

సంచలన వ్యాఖ్యలు, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ పొలిటికల్ అట్రాక్షన్‌గా నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా అధికారిక కార్యక్రమంలో, అందులోనూ ప్రజల సమక్షంలో బహిరంగంగానే సొంత ప్రభుత్వంపై సున్నతంగా విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలు ప్రారంభించిన నేపథ్యంలో తన నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం మసీదు గూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.

Also Read : పెద్ద ఎత్తున ఆ డ్రింక్స్ ను రీకాల్ చేసిన కోకాకోలా.. అందులో ఏముందో తెలిస్తే షాకే..!

కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేదంటున్నారని సంచలన కామెంట్స్‌..
తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క పథకానికి కూడా సరిగ్గా న్యాయం చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అందుకే గ్రామాల్లో ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వమే బాగుండేదంటున్నారని సంచలన కామెంట్స్‌ చేశారు. గ్రామ సభల్లో కూడా జనాలు అధికారులను నిలదీశారని రాజగోపాల్ రెడ్డి..గుర్తు చేయడం మరింత చర్చనీయాంశమవుతోంది.

రైతు బంధును 15వేలకు పెంచి ఇస్తామని..కూడా కొంత డుమ్కీ కొట్టామంటూ మరో సెటైర్ వేశారు రాజగోపాల్ రెడ్డి. దానికి కారణం మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులంటూ కవరింగ్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి, వాటికి పెట్టిన రూల్స్ గురించి కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడారు.

రైతు కూలీలకు 12 వేలు ఇచ్చే స్కీమ్‌ కు రూల్స్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. చాలా మంది తమకు రుణమాఫీ కాలేదని, రైతు బంధు రాలేదని.. ప్రభుత్వాన్ని తిడుతున్నారని చెప్పారు. రుణమాఫీ చేసిన తర్వాత కూడా కేసీఆర్ పాలనే బాగుండే అని మెచ్చుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వ పథకాలపై సెటైర్లు వేయడం..కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటున్నారని చెప్పడం పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. కావాలనే అలా మాట్లాడారా? లేదంటే ఫ్లోలో మాట్లాడారో కానీ.. ప్రభుత్వ పథకాల పేర్లు కూడా అధికారులను అడిగి పలకటం, వివరాలు కూడా పదే పదే అడగటం, ప్రభుత్వ పెట్టిన నిబంధనలను వ్యతిరేకించటం ఆసక్తికరంగా మారింది.

ప్రస్టేషన్‌లో ఉండి అలా మాట్లాడుతున్నారన్న టాక్..
మంత్రివర్గంలో చోటు కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ అధిష్టానం ఆ ఊసే ఎత్తకపోవడంతో ప్రస్టేషన్‌లో ఉండి అలా మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు అవుతుందో..అయినా తనకు స్థానం దక్కుతుందో లేదోనన్న ఆందోళనలో ఉన్నారట ఆయన. అందుకే ప్రభుత్వంపై సెటైర్లు వేస్తూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పరోక్షంగా మెచ్చుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వాస్తు ప్రకారం మళ్లీ నిర్మాణం..
కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో బెర్త్ కోసం ఎదురుచూస్తున్న కోమటిరెట్టి రాజగోపాల్ రెడ్డి..మునుగోడులోని క్యాంపు కార్యాలయంలో వాస్తు మార్పులు కూడా చేపట్టారట. వాస్తు దోషం వల్లే తనకు రాజకీయంగా కలిసి రావడం లేదని భావిస్తున్న ఆయన..పండితుల సూచనలతో క్యాంపు ఆఫీస్‌లోని కొంత భాగాన్ని కూల్చేసి.. తన జాతకం, వాస్తు ప్రకారం మళ్లీ నిర్మిస్తున్నారని తెలుస్తోంది.

ఇలా అన్ని విధాగులుగా ప్రయత్నిస్తున్నా.. మంత్రివర్గ విస్తరణ జరక్కపోవడం, జరిగినా తనకు అవకాశం వస్తుందో లేదోనన్న ఆందోళనలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పాలనను మెచ్చుకుంటూ, సొంత ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఆ మధ్య మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. ఏకంగా కాబోయే ముఖ్యమంత్రి ఉత్తమ్‌ అంటూ వ్యాఖ్యలు చేసి చర్చకు తెరలేపారు. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే తనకు బెర్త్‌ దక్కకుండా ఉత్తమ్‌ అడ్డు రాకుండా ఉండాలనే వ్యూహంతోనే ఆయన అలా మాట్లాడారన్న అభిప్రాయాలు ఉన్నాయి.

Also Read : పులి యూరిన్ అమ్ముతున్న జూ.. బాటిల్ రూ.596 అట.. ఆ రోగం తగ్గుతుందని ప్రచారం చేసి..

ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రాజగోపాల్‌రెడ్డి… మంత్రి వర్గంలో బెర్త్‌ హామీతోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నట్లు ప్రచారం ఉంది. అయితే తొలి విడత మంత్రివర్గంలోనే రాజగోపాల్‌రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. అన్నదమ్ములిద్దరినీ ఒకేసారి క్యాబినెట్లోకి తీసుకుంటే విమర్శలు వస్తాయని రాజగోపాల్‌ను వెయిటింగ్‌లో పెట్టినట్లు చెబుతున్నారు.

అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసేలా విమర్శలు..
మలివిడత విస్తరణలో రాజగోపాల్‌రెడ్డి కి తప్పకుండా అవకాశమిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పుడేమో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతుండటం..పార్టీలు మారిన రాజగోపాల్‌ రెడ్డికి పదవి ఎలా ఇస్తారని.. ఒకే ఇంట్లో ఇద్దరికి ఎలా అవకాశం కల్పిస్తారన్న ప్రశ్నలు తలెత్తడంతోనే రాజగోపాల్‌రెడ్డి టోన్‌ మార్చినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కార్నర్‌ చేసేలా మాట్లాడుతున్నారన్న చర్చ జరుగుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో రాజగోపాల్‌రెడ్డి రాగం ఇంకా ఎన్ని రకాలుగా వినిపించబోతుందో.