Telangana Congress: నేతలు లైన్ దాటుతున్నా, టంగ్ స్లిప్ అవుతున్నా యాక్షన్ ఏది? తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఎక్కడ?
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది.

Telangana Congress: పైకి సినిమా డైలాగులు. గీత దాటితే వేటే. హద్దు మీరితే అంతే సంగతులు. ఇవి కాంగ్రెస్ అగ్రనేతల వార్నింగ్‌లు. అయినా ఏ నేత తగ్గడం లేదు. రోజుకో ఎమ్మెల్యే.. వారం రోజులకో మంత్రి..ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు సీఎంనే నేరుగా టార్గెట్ చేస్తున్నారు. అయినా క్రమశిక్షణ కమిటీ మాకేం తెల్వదు.. మమ్మల్నేం అడగొద్దు అన్నట్లుగా నడుచుకుంటోంది. సమాచారం లేదంటోంది. కాంగ్రెస్‌లో కల్లోలం ఆగదా? ఈ గందరగోళానికి చెక్ పెట్టేదెవరు? క్రమశిక్షణ కమిటీ ఏం చేస్తున్నట్లు?
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతా గజిబిజి గందరగోళం. అధికారంలోకి వచ్చిన మొదట్లో అంతా కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించినా..ఇప్పుడు మంత్రుల మధ్య విభేదాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి రాగాలు.. సీనియర్ నేతల కస్సుబస్సులు..సీరియల్ ఎపిసోడ్ లా మారిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రులు ప్రభాకర్ Vs అడ్లూరి లక్ష్మణ్ vs వివేక్ ఎపిసోడ్ పార్టీలో హీట్ పుట్టించింది. అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి పొన్నం చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పెట్టి..సారీ చెప్పించి ఆ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టారు పీసీసీ చీఫ్.
ఆ రచ్చ అలా ముగిసిందనుకునేలోపే కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేడారం టెండర్ల వార్ తెరపైకి వచ్చింది. ఇక కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ తొలగింపు వ్యవహారం పెద్ద దుమారం లేపింది. కొండా సురేఖ కూతురు సుస్మిత పటేల్..ఏకంగా సీఎం రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి..రచ్చరంబోలా చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జోక్యం చేసుకుని..సీఎంతో కొండా దంపతుల భేటీ జరిగేలా చూశారు.
మంత్రుల వ్యవహారం దారికొస్తున్న వేళ..జగిత్యాలలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యవహారం చిచ్చు రాజేసింది. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల జగడం రెగ్యులర్ న్యూస్ అయిపోయింది. ఎమ్మెల్యే సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ..ఎప్పటికప్పుడు తన అసంతృప్తి గళం వినిపిస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లేటెస్ట్ గా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. ఏకంగా కౌలుదారులంటూ వలస ఎమ్మెల్యేలు, నేతలను ఉద్దేశించి జీవన్ రెడ్డి చేసిన కామెంట్లు రచ్చగా మారాయి.
కనీసం వివరణ కోరే సాహసం కూడా చేయడం లేదు..!
ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని ఏకిపారేస్తున్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అసంతృప్త గళం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నా..పీసీసీ క్రమశిక్షణ కమిటీ మాత్రం సరిపోదా వివాదం అన్నట్లుగా సైలెన్స్ మోడ్లోనే ఉంటుందట. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఎంపీ మల్లు రవి.. నేతలను పిలిచి మాట్లాడటమో..కనీసం వివరణ కోరే సాహసం కూడా చేయడం లేదట. సీనియర్ నేత చిన్నారెడ్డి పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా ఉన్నప్పుడు ఒకరిద్దరు నేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు.
మల్లు రవి వచ్చాక క్రమశిక్షణ కమిటీనే కన్ఫ్యూజన్ లో పడిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. కరవమంటే కప్పకు కోపం..విడువమంటే పాముకు కోపం అన్నట్లుగా ఎవరిపై యాక్షన్ తీసుకుంటే ఎవరికి కోపం వస్తుందోనన్న డైలమాలో మల్లురవి ఉన్నారట. గొడవ పడుతున్న నేతలంతా మంత్రులు, ఎమ్మెల్యేలే. వీళ్లలో కొందరు సీఎం వర్గం..మరికొందరు సీనియర్ మంత్రుల వర్గంగా ఉండిపోవడంతో..ఎవరిని ఏమన్నా తేనేతుట్టెను కదిలించినట్లే అవుతుందని గమ్మున ఉండిపోతున్నారట మల్లురవి.
కొండా సురేఖ, ఓరుగల్లు ఎమ్మెల్యేల పంచాయితీలో నోటీసులు..విచారణ..యాక్షన్..అంటూ కొన్ని రోజులు సాగదీశారు. ఫైనల్ గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పు..ఎవరిది ఒప్పు అని తేల్చారో క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది. జగిత్యాల, పటాన్ చెరు పంచాయితీలో ఏం తేల్చకపోవడంతో..అక్కడ వర్గపోరు రగులుతూనే ఉంది. ఇలా మల్లురవి క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ అయినప్పటి నుంచి ఎన్నో కంప్లైంట్స్ గాంధీ భవన్ మెట్లెక్కాయి. ఇప్పటివరకు ఏ ఇష్యూలో ఎవరి మీద చర్యలు తీసకున్నది లేదు.
కాంట్రవర్సీలు కాక రేపుతున్నా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నా..చర్యలేవి?
కాంట్రవర్సీలు కాకరేపుతున్నా.. పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నా..చర్యలేవి అంటూ అందరి వేళ్లు క్రమశిక్షణ కమిటీ వైపే చూపిస్తున్నాయి. ఆ మాటకొస్తే క్రమశిక్షణ కమిటీ ఛైర్మనే క్రమశిక్షణ పాటించడం లేదని ఆ మధ్య విమర్శలు వచ్చాయి. అసలే స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఆ తర్వాత గ్రేటర్ ఎన్నికలు రాబోతున్నాయి. ఇక ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరుగుతోందని కాంగ్రెస్ నేతలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా క్రమశిక్షణ కమిటీ మౌనం వీడుతుందా? లేక ఇలాగే పట్టనట్లు వ్యవహరిస్తుందా అనేది చూడాలి.
Also Read: జూబ్లీహిల్స్ తర్వాత గ్రేటర్‌లో మరో ఉపఎన్నిక ఖాయమా? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి?