కొత్త అధ్యక్షుడిపై ఎటూ తేల్చుకోలేకపోతున్న బీజేపీ అధిష్టానం..! కారణం ఏంటి..
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం... ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Gossip Garage : తెలంగాణ బీజేపీ సారథిపై అధిష్టానం కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదా? పార్టీనే నమ్ముకున్న వారికి అధ్యక్ష స్థానం వరిస్తుందా? పార్టీ నమ్ముకున్న వారికి అందలం ఎక్కిస్తుందా? సీనియర్ల మద్దతు ఎవరికి? కొత్తగా వచ్చిన నేతల ఆశలు ఏంటి? పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త సారథిని నియమిస్తామని చెప్పిన అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందా? అసలు తెలంగాణ కమలం పార్టీలో ఏం జరుగుతోంది?
పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకే అవకాశమివ్వాలని సీనియర్ల సూచన..
ఆల్టర్‌నేట్ సర్కార్ అంటూ తెలంగాణపై భారీగా ఆశలు పెట్టుకున్న కమలం పార్టీ…. కొత్త అధ్యక్షుడిని నియమించే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోందా? అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్థానంలో కొత్త నేతను నియమించే విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వలస నేతలను ఎలా సర్దుబాటు చేయాలో తేల్చుకోలే కొత్త సారథి నియామకం ఆలస్యమవుతోందంటున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకే అవకాశమివ్వాలని సీనియర్ నేతలు సూచిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో ఒరిజనల్ బీజేపీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గంగిడి మనోహర్ రెడ్డిల్లో ఒకరికి అధ్యక్ష పదవి వరించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే గురి..
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిపై పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సీనియర్ నేత ఈటల రాజేందర్ చాలా కాలంగా అధ్యక్ష పదవి ఇస్తారని ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్‌కు తానే ప్రత్యామ్నాయ నేతగా ఎదగాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన ఈటల… బీజేపీ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి అధ్యక్ష పదవిపైనే గురిపెట్టారు. పార్టీ కూడా ఆయనకు ఆ స్థాయి గౌరవమే ఇచ్చింది. కానీ, కాషాయ సిద్ధాంతాలను అనుసరించి ఇప్పటివరకు ఈటలకు అధ్యక్ష పదవిపై ఇవ్వకుండా నెట్టుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి అధ్యక్షుడు బండి సంజయ్ పదవీ కాలం ముగిసిన వెంటనే… తనకు ఇవ్వాలని ఈటల పార్టీ హైకమాండ్‌ను కోరినట్లు ప్రచారం జరిగింది. ఈ పదవి విషయమై పార్టీలో రెండు వర్గాలు ఏర్పడినట్లు అప్పట్లో చెప్పుకున్నారు. చివరికి ఈ విభేదాల వల్లే కొందరు నేతలు పార్టీని వీడారంటున్నారు.
తెలంగాణ బీజేపీకి ఈటలే సుప్రీం అన్న ప్రచారం!
ఈ వర్గ విభేదాల వల్లే అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి అధ్యక్ష పదవి అప్పగించింది పార్టీ. ఎన్నికలయ్యాక కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని చెప్పింది హైకమాండ్. ఇక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో నియామక ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. మరోవైపు అధ్యక్ష పదవి దక్కని ఈటల.. బీసీ సీఎం నినాదాన్ని అందిపుచ్చుకుని… రెండుచోట్ల పోటీ చేశారు. ఓ వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయడం బీజేపీ సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధం. ప్రధాని మోదీ వంటి నేతలకు మాత్రమే ఇలాంటి మినహాయింపు ఉంటుంది. ఈటల విషయంలో ఈ మినహాయింపు ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీకి ఈటలే సుప్రీం అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఐతే అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిన ఈటల… ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి గెలిచి పరువు దక్కించుకున్నారు. ఇక ఇప్పుడు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేస్తున్నానని చెప్పుకుంటున్న ఈటల… తన అసలు లక్ష్యమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై గురిపెట్టారని చెబుతున్నారు.
ఇద్దరూ ఎంపీలు, సీనియర్లే కావడం… ఇద్దరూ పార్టీలోకి వలస వచ్చిన వారే కావడంతో రాష్ట్ర బీజేపీ సీనియర్లు ఆ ఇద్దరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరూ సమర్థులే అయినప్పటికీ.. పార్టీ సిద్ధాంతాల ప్రకారం తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అవకాశమివ్వాలని… ఆర్‌ఎస్‌ఎస్, హిందుత్వ అజెండాకు అనుగుణంగా పని చేసే వారికి ప్రాధాన్యమివ్వాలని సీనియర్లు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.
రేసులోకి బండి సంజయ్ అనుచరుడు..
దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు అనుచరుడైన సీనియర్ నేత గంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు రేసులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి అభ్యర్థిత్వంపై సీనియర్లు సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. మనోహర్‌రెడ్డికి మద్దతుగా బండి, రామచందర్‌రావు పేరును మరో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీనియర్ నేత లక్ష్మణ్ బలపరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మనోహర్‌రెడ్డి, రామచందర్‌రావుల్లో ఎవరికి పదవి ఇచ్చినా… పార్టీలో తమ ఆధిపత్యం ఉంటుందని కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీలో తొలి నుంచి ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలివ్వడం ద్వారా… వలస నేతలకు చెక్ చెప్పొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలనే ఈటల ఆశలు ఇప్పట్లో ఫలించే అవకాశాలు కనిపించడం లేదని బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఆ ఇద్దరిలో ఒకరికి సారధ్య బాధ్యతలు..?
ప్రస్తుత అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రి కావడంతో బిజీ అయిపోయారని, దీంతో పార్టీ వ్యవహారాలకు సమయం కేటాయించలేకపోతున్నారని తెలుస్తోంది. ఇక జాతీయ పార్టీ అధ్యక్ష పదవినీ భర్తీ చేయాల్సి వున్నందున త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా మనోహర్‌రెడ్డి, రామచందర్‌రావుల్లో ఒకరు రాష్ట్ర అధ్యక్షుడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read : సమన్వయం లేదు, సఖ్యత లేదు.. ఎవరికి వారే యమునా తీరే..! కమలదళంలో ఎందుకీ గందరగోళం?