Gossip Garage: క్యాబినెట్‌లో బెర్త్‌ ఎవరికి? ఎర్త్ ఎవరికి? ఆ నలుగురు మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు..

రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్‌ నేతలకే అర్థం కావటం లేదట.

Gossip Garage: క్యాబినెట్‌లో బెర్త్‌ ఎవరికి? ఎర్త్ ఎవరికి? ఆ నలుగురు మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు..

Updated On : May 30, 2025 / 11:04 PM IST

Gossip Garage: క్యాబినెట్ విస్తరణ వేళ. అంతలోనే చిన్న ట్విస్ట్. ఆ తర్వాత ఏదో ఒక అప్డేట్. రేపోమాపో ప్రకటన అంటూ లీకులు. మంత్రి పదవుల భర్తీ వేళ తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ తెరమీదకు వస్తోంది. ఒకవైపు పార్టీ కీల‌క క‌మిటీల‌ను భ‌ర్తీ చేస్తూ.. మ‌రోవైపు క్యాబినెట్‌ బెర్తుల భర్తీపై రంగం సిద్ధం చేస్తోందట‌ అధిష్టానం. క్యాబినెట్‌లో బెర్త్‌ ఎవరికి? ఎర్త్ ఎవరికి? ఆ మంత్రులకు పీఏసీలో చోటు ఎందుకు దక్కలేదు? కీల‌క‌మైన వాటి విష‌యంలో పార్టీ అధిష్టానం ఆలోచ‌న ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్‌లో పదవుల భర్తీ డైలీ ఎపిసోడ్‌ అయిపోయింది. రోజుకో ట్విస్ట్..క్లైమాక్స్‌లో ఇంటర్వెల్‌ రేంజ్‌లో ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూనే ఉంది. అయితే ఈసారి అన్నింటినీ క్లియ‌ర్ చేస్తూ పార్టీ అధిష్టానం ముందుకెళ్తోందట. జూన్ మొద‌టి వారంలో క్యాబినెట్ విస్తరణ చేయాల‌ని ఫిక్స్ అయిన‌ట్లు పార్టీ వ‌ర్గాల టాక్. అందుకు అనుగుణంగా పార్టీ క‌మిటీల‌ను కూడా ఒక్కొక్కటిగా భ‌ర్తీ చేస్తోంది. పార్టీ అతి కీల‌కమైన పీఏసీతో పాటు అడ్వైజ‌రీ, క్రమ‌శిక్షణ క‌మిటీ, డీలిమిటేష‌న్ క‌మిటీ, సంవిధాన క‌మిటీల‌ను నియ‌మిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగ‌తా వాటికి లైన్ క్లియ‌ర్ అయ్యింద‌నే చ‌ర్చ పార్టీలో జోరుగా న‌డుస్తోంది.

ఆ న‌లుగురు మంత్రుల పేర్లు లేక‌పోవ‌డంపై చర్చ..
క‌మిటీల నియామకంతో క్యాబినెట్ కూర్పుపై ఇన్ డైరెక్ట్‌గా ఇండికేష‌న్ ఇచ్చిన‌ట్లేన‌నే చ‌ర్చ పార్టీలో జ‌రుగుతోంది. పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక క‌మిటీ అయిన పీఏసీలోకి న‌లుగురు మంత్రులు మిన‌హా అంద‌రికి అవ‌కాశం క‌ల్పించారు. పీఏసీలో క్యాబినెట్ మంత్రులంద‌రూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటార‌ని మెన్షన్ చేసినా.. నేరుగా ఆ న‌లుగురు మంత్రుల పేర్లు లేక‌పోవ‌డం చ‌ర్చకు దారితీస్తోంది.

Also Read: కవిత లెటర్‌‌తో బీఆర్ఎస్‌లో దుమారం.. అయినా కేసీఆర్ మౌనం.. సార్ సైలెన్స్ వ్యూహాత్మకమా?

క్యాబినెట్ నుంచి కొండా సురేఖ అవుట్?
ప్రధానంగా పీఏసీలో కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూప‌ల్లి కృష్ణారావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిల‌కు ఛాన్స్ ద‌క్కలేదు. వీరిలో కొండా సురేఖ‌కు క్యాబినెట్ నుంచి కచ్చితంగా ఉద్వాస‌న ప‌లుకుతార‌నే చ‌ర్చ బ‌లంగా న‌డుస్తోంది. అందుకే ఆమె ప్లేస్‌లో పీఏసీ క‌మిటీలోకి అదే సామాజిక‌వ‌ర్గం మున్నూరు కాపుకు చెందిన ఆది శ్రీనివాస్‌కు క‌మిటీలో చోటు ద‌క్కిందంటున్నారు. దీని ద్వారా మంత్రివ‌ర్గంలో కూడా ఆది శ్రీనివాస్‌కు ప‌క్కా ఛాన్స్ ఉంటుంద‌నే టాక్ న‌డుస్తోంది.

ఇక మిగ‌తా మంత్రులు తుమ్మల నాగేశ్వ‌ర్‌రావు, జూప‌ల్లి కృష్ణారావు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డిల‌కు ఎందుకు ఛాన్స్ రాలేద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. పీఏసీ కమిటీలో ఛాన్స్ ద‌క్కని మిగ‌తా ముగ్గురు మంత్రుల‌కు చెందిన సేమ్ సామాజిక వ‌ర్గం నుంచి ఇత‌ర నేత‌ల‌కు అవ‌కాశం క‌ల్పించడంలో వ్యూహం ఏమై ఉంటుందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

మంత్రి జూప‌ల్లి సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప్రేమ్‌సాగ‌ర్ రావుకు, కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన సుద‌ర్శన్‌రెడ్డికి, తుమ్మల నాగేశ్వరరావు సామాజిక వ‌ర్గానికి చెందిన జెట్టి కుసుమ్ కుమార్‌కు ఛాన్స్ ద‌క్కింది. ఇలా వీరికి ఛాన్స్ ఇవ్వడంలో మ‌త‌ల‌బు ఏంట‌నేది హాట్ టాపిక్‌గా మారింది. ప్రేమ్‌సాగ‌ర్ రావు, సుద‌ర్శన్‌రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జెట్టి కుసుమ్ మాత్రం ఏ స‌భ‌లో కూడా ప్రాతినిధ్యం లేదు. అయితే మంత్రి తుమ్మల పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనరు కాబట్టి ఆ ప్లేస్‌లో సీనియ‌ర్ నేత జెట్టికి అవ‌కాశం ఇచ్చార‌నే టాక్ ఉంది.

 

రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో నియమించడంపై చర్చ..
పీఏసీలో మంత్రులకు చోటు కల్పించకపోవడం ఒక చర్చ అయితే.. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారిని పార్టీ పదవుల్లో నియమించడంపై చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఫైనాన్స్ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ మెంబర్‌గా ఉన్న రాములు నాయక్‌కు పీఏసీలో చోటు కల్పించడం చర్చకు దారి తీసింది. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలను పార్టీ కమిటీల్లోకి తీసుకోవడం ఏంటన్నది కాంగ్రెస్‌ నేతలకే అర్థం కావటం లేదట. అయితే పీఏసీ కమిటీ లిస్ట్‌లో ఎవరికి చోటు కల్పించారో.. ఎవరు ఎంపిక చేశారో కూడా పీసీసీ చీఫ్‌తో సహా ఎవరికి తెలియదట. అధిష్టానం డైరెక్టుగా లిస్ట్ ఇచ్చినట్లు గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల విష‌యంలో కూడా కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లుగా సంప‌త్ కుమార్‌, బ‌ల‌రాం నాయ‌క్‌, రోహిణ్‌ రెడ్డి, ఫ‌హీం ఖురేషిల పేర్లు దాదాపు ఖ‌రారైన‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క‌మిటీ విష‌యంలో స్పష్టత రాగానే వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ, వైస్ ప్రెసిడెంట్ల పోస్టులను భ‌ర్తీ చేస్తార‌ట‌. ఒక్క పీఏసీ క‌మిటీ నియామకం ర‌క‌ర‌కాల చ‌ర్చల‌కు దారి తీస్తోంది. క్యాబినెట్ కూర్పు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ల నియామ‌కానికి అదొక ఇండికేష‌న్ అంటున్నాయి హస్తం పార్టీ వ‌ర్గాలు. క్యాబినెట్ కూర్పు జూన్ మొద‌టి వారంలో ఉండ‌నున్న నేప‌థ్యంలో ..ఛాన్స్ దక్కే ల‌క్కీ ప‌ర్సన్ పేర్ల విష‌యంలో ఒక‌టి, రెండు రోజుల్లో మ‌రింత స్పష్టత రానుంది.