బీజేపీలో చేరేందుకు భయపడిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..! ఎందుకో తెలుసా..

అందుకే వలసలతో కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే... బీజేపీ ప్రేక్షక పాత్రలో రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు.

బీజేపీలో చేరేందుకు భయపడిపోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..! ఎందుకో తెలుసా..

Gossip Garage : మీరెవరైనా సరే… మేము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు అంటే మీరు నమ్మాల్సిందే.. అలా కాదంటే మీరు మా లైన్ లో లేనట్టే.. మాతో కలవాలంటే మేము చెప్పినట్లు చేయాల్సిందే… కాదు.. కూడదు అనుకుంటే.. మీ దారి మీదే మా దారి మాదే… మా రూటే సెపరేట్… ఇది తెలంగాణ బీజేపీ నేతల వైఖరి… ప్రత్యర్థి పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పేరిట హల్‌చల్ చేస్తుంటే…

ఆల్టర్నేట్ సర్కార్ అంటూ కలలు కంటున్న కమలం పార్టీ నేతలు… పార్టీ తలుపు తట్టిన ఎమ్మెల్యేలను తిప్పి పంపిచేస్తున్నారంట…? ఎందుకిలా… 8 మంది ఎమ్మెల్యేలు 88 మంది అవ్వాలని కలలు కనడం ఓకే… అవి నెరవేరాలంటే కొత్తగా నేతలు చేరాలి కదా..? మరి పార్టీలోకి వస్తామంటున్న ఎమ్మెల్యేలను బీజేపీ ఎందుకు వద్దనుకుంటోంది? బీజేపీ డోర్ దగ్గరి దాకా వచ్చిన ఎమ్మెల్యేలు పీచే ముడ్ అని ఎందుకు వెనక్కి పోతున్నారు?

ఆ కండీషన్స్ చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు..
తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాటే… ఎన్నికలు ఉన్నప్పుడే కాదు… ఎల్లప్పుడూ రాజకీయ వ్యూహప్రతివ్యూహాలతో నేతలు దూడుకు చూపుతుంటారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రచారాల్లో హోరెత్తిన తెలంగాణ రాజకీయం… ఓట్ల పండగ ముగిసిన తర్వాత మరింత జోరందుకుంది. బీఆర్ఎస్ఎల్పీని ఖాళీ చేయించడమే టార్గెట్‌గా ఆపరేషన్ ఆకర్ష్‌ను పదునెక్కిస్తోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వల వేస్తూ హస్తం గూటికి చేర్చుకుంటోంది. ఇలా ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేతిని అందుకోగా, మరికొందరు లైన్ లో ఉన్నారంటున్నారు. ఇదే క్రమంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నా, ఆ పార్టీ పెడుతున్న కండీషన్స్‌తో వామ్మో… మీతో కష్టమే అని వెనక్కి వెళ్లిపోతున్నారట…

ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని మెలిక..
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోని బీఆర్ఎస్… తన ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోతోంది. పార్టీ పరిస్థితిపై ఆందోళనతో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు… రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనూ టచ్‌లోకి వెళ్లారు. స్థానికంగా ఉన్న పరిస్థితులు, వారి అవసరాలు దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీని ఎంచుకుని… ఆ పార్టీలోకి వెళ్లేందుకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఐతే ఇలా పార్టీ మారాలని భావిస్తున్న ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ నుంచి రెడ్ కార్పెట్ స్వాగతం లభిస్తుండగా… బీజేపీ మాత్రం ఎమ్మెల్యేలను వెయిటింగ్ లిస్టులో పెడుతోంది. ఇంకా చెప్పాలంటే తమ పార్టీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రావాలని మెలిక పెడుతోంది.

మనసు మార్చుకున్న మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డి..!
గత ప్రభుత్వంలో ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలో చేర్చుకున్న విషయాన్ని గుర్తుచేస్తోంది. రాజకీయాల కోసం పార్టీ సిద్ధాంతాలతో రాజీపడలేమని చెబుతోన్న బీజేపీ పెద్దలు… ఎమ్మెల్యేలు ఆసక్తి చూపుతున్నా, కమలం తీర్థం ఇచ్చేందుకు అంగీకరించడం లేదట. దీంతో బీజేపీతో టచ్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మహిపాల్ రెడ్డి, మల్లారెడ్డితో పాటు మరికొందరు మనసు మార్చుకుంటున్నారట.

మళ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావన..
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ… నేతల వలసల విషయంలో అనుసరిస్తున్న విధానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు జరిగి కేవలం ఏడు నెలలే అయింది. పార్టీలో చేరేందుకు వస్తున్న ఎమ్మెల్యేలు నాలుగున్నరేళ్ల పదవీకాలాన్ని త్యాగం చేసి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఒకవేళ రాజీనామా చేసినా మళ్లీ ఎన్నికల్లో గెలవడం కష్టమనే భావనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. మల్లారెడ్డి వంటి వారు రాజీనామా చేసేందుకు ఇష్టపడినా, ఆయనపై ఉన్న వివాదాల కారణంగా బీజేపీ వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు.

సిద్ధాంతాలే గుదిబండగా మారాయా?
మొత్తానికి తెలంగాణలో వికసించాలని ప్లాన్ చేస్తున్న కమలం పార్టీకి… సిద్ధాంతాలే గుదిబండగా మారాయంటున్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం రాజీనామా చేయాలనే కండీషన్‌ను అటకెక్కిస్తే… మున్ముందు తీవ్ర విమర్శలు పాలు కావాల్సి వస్తుందనే ఆలోచనతో వెనక్కి తగ్గడం లేదు బీజేపీ నేతలు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఇదే ఉద్దేశంతో బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేయాల్సిందేనని మరోసారి తేల్చిచెప్పడం ద్వారా తమ సిద్ధాంతాలతో రాజీపడబోమని సంకేతాలిచ్చారు. దీంతో బీజేపీ తలుపు తడదామని ఆలోచనలో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు… అనువు గాని చోట అధికులం అనకూడదనే విధంగా బీజేపీకి ఆదిలోనే బైబై చెప్పేస్తున్నారట…

అందుకే వలసలతో కాంగ్రెస్ హడావుడి చేస్తుంటే… బీజేపీ ప్రేక్షక పాత్రలో రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు. ఏదైనా గతంలో తెలంగాణ పొలిటికల్ పిక్చర్ లో హడావుడి చేసిన బీజేపీ… ఇప్పుడు సైలెంట్‌గా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కాషాయ పార్టీ కార్యకర్తలు.

Also Read : మళ్లీ టీడీపీ గూటికి? అసలు మల్లారెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఎందుకు చంద్రబాబు వైపు చూస్తున్నారు?