భయమా, అనుమానమా.. చంద్రబాబు, రేవంత్ భేటీపై కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఎందుకు?

ఊహించని విధంగా కాంగ్రెస్‌ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం... బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

భయమా, అనుమానమా.. చంద్రబాబు, రేవంత్ భేటీపై కాంగ్రెస్ నేతలకు అభ్యంతరం ఎందుకు?

Gossip Garage : భయమా.. అనుమానమా? ముందు జాగ్రత్తా… మరేదైనా వ్యూహమా? తెలుగు రాష్ట్రాల సీఎంలు భాయీ.. భాయీ.. అంటుంటే… కాంగ్రెస్‌ నేతలకు అభ్యంతరం ఎందుకు? బాబుతో జాగ్రత్త అంటూ కాంగ్రెస్‌ శ్రేణులను అప్రమత్తం చేయడం దేనికి సంకేతం? కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి… టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీపై కాంగ్రెస్‌ నాయకులకు గుస్సా ఎందుకు? అధికారిక భేటీ సంతృప్తినివ్వలేదా? తెలంగాణలో టీడీపీని విస్తరిస్తామని చంద్రబాబు చెప్పడం నచ్చలేదా? తెలంగాణ కాంగ్రెస్‌లో రాద్ధాంతం దేనికి…?

చంద్రబాబు మాటలపై సీరియస్..
విభజన సమస్యల పరిష్కారం పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి భేటీ…. కాంగ్రెస్‌లో కొత్త చర్చ… రచ్చకు దారితీస్తోంది. రెండు రాష్ట్రాలు సీఎంలతోపాటు మంత్రులు, అధికారులు విభజన సమస్యలపై చర్చించి, సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఎపిసోడ్‌ను రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్వాగతించారు. కానీ, కాంగ్రెస్‌లో కొందరు నేతలకు మాత్రం ఈ పరిణామం రుచించడం లేదు. విభజన సమస్యలు పరిష్కారం ప్రభుత్వ పరిధిలోని అంశమైనా… సీఎంల భేటీ తర్వాత హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ భవన్‌లో చంద్రబాబు మాట్లాడిన మాటలే కాంగ్రెస్‌ నేతలకు అసంతృప్తికి గురిచేస్తున్నాయంటున్నారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడంపై దృష్టి పెడతానని చంద్రబాబు వ్యాఖ్యానించడంపై టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు మద్దతుగా అన్నట్లు మాజీ ఎంపీ విజయశాంతి సైతం ఎక్స్‌ వేదికగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు తెలంగాణలో అడుగు పెడితే మరో ఉద్యమం తప్పదని వార్నింగ్..
ముందస్తు హెచ్చరికలు లేని తుఫాన్‌లా…. ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు ఒకరు తర్వాత ఒకరు చంద్రబాబు పర్యటనను విమర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ను ముందుపెట్టి… బీజేపీ తెలంగాణలో బలోపేతమయ్యేలా ప్లాన్‌ చేస్తోందని జగ్గారెడ్డి విమర్శలు గుప్పించగా, చంద్రబాబు విభజన సమస్యలు పక్కన పెట్టి రాజకీయంగా టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టారని విమర్శలు గుప్పించారు మాజీ ఎంపీ విజయశాంతి. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణలో అడుగు పెడితే.. మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు విజయశాంతి.

ఏపీ సీఎం చంద్రబాబు అధికారిక పర్యటన ఒకవైపు… పార్టీ ఆఫీసులో రాజకీయ కార్యక్రమం మరోవైపు జరగ్గా… కాంగ్రెస్‌ స్పందించిన తీరే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం, మంత్రుల పర్యటనను స్వాగతించిన తెలంగాణ ప్రభుత్వం…. విభజన సమస్యల పరిష్కారానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తుంటే… అధికార పార్టీ నేతలు టీడీపీ అధినేత కార్యక్రమాలను తప్పుపట్టేలా వ్యాఖ్యలు, విమర్శలు చేయడం హీట్‌ పుట్టిస్తోంది. జగ్గారెడ్డి, విజయశాంతి విమర్శలు కాంగ్రెస్‌లోనూ దుమారం రేపుతున్నాయి.

కాంగ్రెస్ కు నష్టమని భయపడుతున్నారా?
ఒకప్పుడు చంద్రబాబు, రేవంత్‌ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా… ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ దేశవ్యాప్తంగా ఆకర్షించింది. కానీ, ఊహించని విధంగా కాంగ్రెస్‌ నేతలే రాజకీయ విమర్శలకు దిగడం… బీజేపీ తెరచాటు రాజకీయానికి మోసపోవద్దని హెచ్చరించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోడానికే ఇలాంటి విమర్శలు చేశారా? లేక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరణ ప్రణాళిక కార్యరూపం దాల్చితే కాంగ్రెస్‌కు నష్టమనే భావనలోనే విమర్శలకు దిగారా? అన్నది ఆసక్తి రేపుతోంది. మొత్తానికి జగ్గారెడ్డి, విజయశాంతి విమర్శలు ఇటు కాంగ్రెస్‌లోనూ అటు టీడీపీలోనూ కలకలం రేపుతున్నాయి.

Also Read : కాంగ్రెస్‌లో చేరాక సౌండే లేదు..! జంపింగ్‌ ఎమ్మెల్యేల మౌనానికి కారణం ఆ భయమేనా?