కాంగ్రెస్‌లో చేరాక సౌండే లేదు..! జంపింగ్‌ ఎమ్మెల్యేల మౌనానికి కారణం ఆ భయమేనా?

ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటడంపై రకరకాల చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌లో చేరాక సౌండే లేదు..! జంపింగ్‌ ఎమ్మెల్యేల మౌనానికి కారణం ఆ భయమేనా?

Updated On : July 9, 2024 / 12:30 AM IST

Gossip Garage : తెలంగాణ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. బీఆర్ఎస్‌ టార్గెట్‌గా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌… ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్పీడ్‌ పెంచింది. లైన్‌లో ఉన్నారంటూ కొందరి పేర్లు వినిపిస్తే… రాత్రికి రాత్రే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇంకొకరు ఉంటున్నారు. ఇలా కండువా మార్చిన నేతలు… నియోజకవర్గాలకు వెళ్లాక… రాముడు మంచి బాలుడు అన్నట్లు కామ్‌గా ఉంటున్నారు. వరుసగా చేరుతున్న ఎమ్మెల్యేలు… కండువా కప్పుకున్న సమయంలో ఏవో నాలుగు మాటలు చెప్పి… ఆ తర్వాత మౌనవ్రతాన్ని ఆశ్రయిస్తున్నారు… అసలు జంపింగ్‌ ఎమ్మెల్యేలు సైలెన్స్‌ ఎందుకు?

మాటల్లేవ్‌ అంటూ మౌనం..
అయిందేదో అయింది… జరిగినదంతా మంచికే అనుకుంటే పోలా… అన్నట్లు తయారైంది తెలంగాణ రాజకీయం. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయి. అధికార కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ స్పీడ్‌ పెంచడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు వరుసగా…. హస్తం గూటికి చేరుతున్నారు. ఇప్పటివరకు దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ చేతిని అందుకోగా, మరికొందరు లైన్‌లో ఉన్నారంటున్నారు. ఇలా ఎమ్మెల్యేల పార్టీ మార్పుతో రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఐతే ఇక్కడే ఓ ఇంట్రస్టింగ్‌ ట్విస్ట్‌ విస్తృత చర్చకు దారితీస్తోంది. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు అంతా… మాటల్లేవ్‌ అంటూ మౌనాన్ని ఆశ్రయిస్తుండటమే ఆసక్తి రేపుతోంది.

పెదవి విప్పకపోవడానికి కారణమేంటి?
జనరల్‌గా రాజకీయం అంటేనే మాటల యుద్ధం… అటు… ఇటు మోహరించిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో తమ మనుగడ చాటుకుంటారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే రాజకీయం కనిపిస్తుంది. కానీ, చిత్రంగా తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు… నియోజకవర్గాల్లో ఎలాంటి సౌండ్‌ చేయడం లేదు. పార్టీ మారిన సందర్భంలో… కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న సమయంలో ఏవో రెండు మాటలు చెప్పి.. ఆ తర్వాత మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవరికీ అంతుపట్టడం లేదు. నిత్యం గలగలా మాట్లాడే తమ నేత అస్సలు పెదవి విప్పకపోవడానికి కారణమేంటి అంటూ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

హైదరబాద్‌ నగరంలోని కీలక నేత సైలెన్స్ ఎందుకు?
బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు చేరారు. ఇంకొందరు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకునేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇలా కాంగ్రెస్‌ చేతిని అందుకున్న ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌… సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఎంపీగా నామినేషన్‌ వేసేవరకు నాగేందర్‌ పోటీ చేస్తారో? లేదో? అనే టెన్షన్‌ ఉండేది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పోటీ చేసిన దానం… ఎన్నికల్లో ఓటమి తర్వాత ఓ విధంగా స్పీడ్‌ తగ్గించినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత తమతో కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పి… ఆ తర్వాత తెరమరుగయ్యారు దానం.. హైదరబాద్‌ నగరంలోని కీలక నేత దానం… పొలిటికల్‌ హడావుడి లేకపోవడంపై చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌లో చేరాక మాట్లాడిందే లేదు..
దానం బాటలోనే కాంగ్రెస్‌ గూటికి చేరిన సీనియర్‌ నేత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఎక్కడా చప్పుడు చేయడం లేదు. వరంగల్‌ కాంగ్రెస్‌ ఎంపీగా తన కుమార్తెను గెలిపించుకున్న కడియం…. పార్లమెంట్‌ ఫలితాల తర్వాత పెద్దగా మాట్లాడింది లేదు. ఒకప్పుడు రాష్ట్రస్థాయిలో వివిధ అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే కడియం… కాంగ్రెస్‌లో చేరిన తర్వాత క్రియాశీలంగా వ్యవహరించడం లేదంటున్నారు. ఇక మరో సీనియర్‌ నేత పోచారం శ్రీనివాసరెడ్డి సైతం… కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు పెదవి విప్పలేదు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధికి పోచారం సహకారం తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించినా… అధికార పార్టీ సభ్యుడిగా ఎక్కడా కనిపించడం లేదు పోచారం.

అదే విధంగా కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, సంజయ్‌కుమార్‌, బండ్ల కృష్ణమోహన్‌, కాలే యాదయ్య ఎక్కడా సౌండ్‌ చేయడం లేదు. ఈ నలుగురిలో తెల్లం వెంకటరావు లోక్‌సభ ఎన్నికలకు ముందే పార్టీ మారారు. ఇక తాజాగా కాంగ్రెస్‌ కండువాలు కప్పుకున్న సంజయ్‌కుమార్‌, కృష్ణమోహన్‌… ఆయా నియోజకవర్గాల్లో వ్యతిరేకతను జయించి హస్తం పంచన చేరినా, తమ రాజకీయ ప్రస్థానంపై ఎక్కడా కామెంట్లు చేయడం లేదు.

రాజకీయ, న్యాయ వివాదాల్లో చిక్కుకుంటామనే భయం?
ఇలా పార్టీ మారిన ఎమ్మెల్యేలు మౌనంగా ఉంటడంపై రకరకాల చర్చ జరుగుతోంది. పార్టీ మారిన తర్వాత తాము బీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేసి లేనిపోని వివాదాల్లో చిక్కుకోవడం ఎందుకనే ఎక్కువమంది భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ చెబుతున్నట్లు బీఆర్‌ఎస్‌ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు చేరేది ఇప్పట్లో జరగకపోతే తాము అనర్హత పిటిషన్లు ఎదుర్కోవాల్సి వుంటుందని.. తద్వారా రాజకీయ, న్యాయ వివాదాల్లో చిక్కుకుంటామనే ఆలోచనే ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

పూర్తిగా కాంగ్రెస్‌ నేతలుగా మారలేకపోతున్నారా?
ఐతే లోక్‌సభ ఎన్నికల ముందు పార్టీ మారిన ముగ్గురిపై ఇప్పటికే బీఆర్‌ఎస్‌ అనర్హత పిటిషన్లు దాఖలు చేసింది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చేరిన నలుగురి విషయమే ఏం చేయాలనేది ఆలోచిస్తోంది గులాబీ హైకమాండ్‌. ఇది ఎలా ఉన్నా, ఏడుగురు జంపింగ్‌ లీడర్లు మౌనం ఎన్నో సందేహాలకు తెరలేపుతోంది. మౌనం అర్థాంగీకారం అంటారు? అంటే కండువాలు మార్చినా… పూర్తిగా కాంగ్రెస్‌ నేతలుగా మారలేకపోతున్నారా? అన్న చర్చే ఎక్కువగా జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్‌లో చేరేందుకు సూచికగా మూడు రంగుల కండువాలు కప్పుకుంటున్న ఎమ్మెల్యేలు.. ఎక్కడా హస్తం గుర్తు లేకుండా చూసుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్‌ తప్ప.. మిగిలిన నేతలు అంతా మూడు రంగుల జెండా మాది అంటున్నారే కానీ, చేతి గుర్తును చూపకపోవడం కూడా ప్రత్యేక చర్చకు తావిస్తోంది.

Also Read : బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు.. అందుకే తెలంగాణలో టీడీపీని..: జగ్గారెడ్డి