Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్? వారి ఓట్లన్నీ బీజేపీకే పడతాయా?

అందుకే ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి హైదరాబాద్‌లో తాము బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తోంది.

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి చంద్రబాబు, పవన్? వారి ఓట్లన్నీ బీజేపీకే పడతాయా?

Updated On : October 30, 2025 / 9:02 PM IST

Jubilee Hills Bypoll 2025: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం స్పీడందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీగా బీజేపీ కూడా క్యాంపెయిన్‌లో జోరు పెంచింది. స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌లో..ఏకంగా బీజేపీ జాతీయ నేతల పేర్లను చేర్చారు కమలనాథులు. అంతేకాదు మరో ఇద్దరు కీలక నేతలు కూడా బీజేపీ తరఫున జూబ్లీహిల్స్ ప్రచార రంగంలోకి దిగబోతున్నారట. బీజేపీ అలయన్స్‌ పార్టీలుగా ఉన్న..ఆ రెండు పార్టీల అధినేతలకు ప్రచారానికి రప్పించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. ఇంతకు ఎవరా ఇద్దరు? ఆ ఇద్దరు నేతలు ప్రచారం చేస్తే జూబ్లీహిల్స్‌లో బీజేపీకి ప్లస్ అవుతుందా?

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం అంతకంతకు హీట్ పెంచుతోంది. రాజకీయ నాయకులే కాదు సామాన్యుల దృష్టి కూడా ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్‌పైనే ఉంది. అన్ని రాజకీయ పార్టీలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ప్రచార స్పీడును పెంచాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సహా బీఆర్ఎస్, బీజేపీ..40 మంది చొప్పున స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేశాయి.

బీజేపీ స్టార్ క్యాంపెయిన్స్‌ లిస్ట్‌లో రాష్ట్ర నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కేంద్రమంత్రులు కూడా ఉన్నారు. అయితే జూబ్లీహిల్స్ బైపోల్‌ ప్రచారానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా రంగంలోకి దింపాలని కమలం పార్టీ భావిస్తోందట. చంద్రబాబు, పవన్‌ ప్రచారం నిర్వహించేలా ఒప్పించాలని హైకమాండ్ పెద్దలకు తెలంగాణ బీజేపీ నేతలు విన్నవించారని సమాచారం. ఒకవేళ చంద్రబాబు, పవన్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొంటే మాత్రం రాజకీయం మంరిత రంజుగా మారడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.

హైదరాబాద్‌లో బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలనే సంకల్పం..

గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మొత్తం 8 నియోజకవర్గాల్లో గెలుపొందిన బీజేపీ.. అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గోషామహల్‌లో మినహా..హైదరాబాద్‌లో ఎక్కడా గెలవలేదు. ముందు నుంచి హైదరాబాద్‌లో పట్టు సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బీజేపీ..ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్‌ ఫలితం వచ్చే ఏడాది జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కమలం పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే ఉప ఎన్నికలో కచ్చితంగా గెలిచి హైదరాబాద్‌లో తాము బలపడుతున్నామనే సంకేతం ఇవ్వాలన్న సంకల్పంతో బీజేపీ ముందుకెళ్తోంది.

జూబ్లీహిల్స్ బీజేపీ స్టార్ క్యాంపెయినర్లలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అర్జున్ రామ్ మేఘావాల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ సహా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం చేయబోతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి రప్పించాలని కమలనాథులు భావిస్తున్నారట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్స్ అధికంగా ఉండటంతో పాటు కమ్మ సామాజికవర్గానికి ఓట్లు కూడా భారీగా ఉన్నాయని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల ఓట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సినీ కార్మికులతో సన్మాన సభ పెట్టించుకుని..వరాల జల్లు కురిపించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోందట. పవన్ కల్యాణ్‌తో జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేయిస్తే కచ్చితంగా సినీ రంగానికి చెందిన వారి ఓట్లు తమవైపు మళ్లుతాయని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటోందట.

అటు సెటిలర్లు.. ఇటు సినీ కార్మికులు..

అటు సెటిలర్ల ఓట్లు..ఇటు సినీ రంగానికి చెందిన వాళ్ల ఓటర్లను ఆకట్టుకునేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను ప్రచారానికి రప్పించాలని తెలంగాణ బీజేపీ నేతలు అధిష్టానం పెద్దలకు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. కనీసం ఒక రోడ్ షో, ఒక బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ పాల్గొంటే తమకు కలిసి వస్తుందని టీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఎలాగూ చంద్రబాబు, పవన్ లు ఎన్డీఏలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి.. వాళ్లను ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని కమలం పార్టీ నేతలు అనుకుంటున్నారట. బీజేపీ అధిష్టానం చంద్రబాబు, పవన్‌ను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వచ్చేలా ఒప్పిస్తుందా? వాళ్లిద్దరు రంగంలోకి దిగితే కమలం పార్టీకి ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి.

Also Read: దుష్ప్రచారం చేస్తున్నారు.. సొంత పార్టీ నేతలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక కామెంట్స్..