Gossip Garage : అసెంబ్లీ సమావేశాల్లోపే కేటీఆర్ అరెస్ట్? ఫార్ములా ఈ కార్ రేస్ కేస్‌లో సంచలనాలు ఉంటాయా..
బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట.

Formula E-Car Race Case
Gossip Garage : మూడు నెలల కింద తెలంగాణ పాలిటిక్స్ లో అదే హాట్ టాపిక్. గత సర్కార్ హయాంలో జరిగిన ఇంటర్నేషనల్ ఈవెంట్ మీద ఏసీబీ విచారణ..కేటీఆర్‌కు నోటీసులు..ఆ తర్వాత అరెస్ట్ అంటూ హంగామా నడిచింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్‌గా మళ్లీ తెరమీదకు వస్తుంది ఫార్ములా ఈ కారు రేస్ కేసు. తనకు మళ్లీ నోటీసులు ఇస్తారని కేటీఆరే అనుమానిస్తున్నారట. ఈ అసెంబ్లీ సెషన్‌లోపే ఫార్ములా ఈ కారు కేస్‌లో సంచలనాలు ఉంటాయా.?
ఫార్ములా ఈ కారు రేస్ కేసు మరోసారి రాజకీయ వేడిని రాజేస్తోంది. గతంలో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించింది. ఆ తర్వాత కోర్టు విచారణలతో ఇన్నాళ్లు పెద్దగా ఎక్కడా ప్రస్తావనకు రావడం లేదు ఫార్ములా ఈ కారు రేస్ కేసు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్‌తో ఈ కేసుపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్న అరెస్ట్ ప్రచారం..
ఈ అసెంబ్లీ బడ్జెట్ సెషన్‌లోపే తనకు నోటీసులిచ్చేందుకు ఏసీబీ సిద్దమవుతోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈసారి విచారణతో పాటు కేటీఆర్ అరెస్ట్ కూడా ఉంటుందన్న ప్రచారం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందట. గులాబీ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్దమవుతున్న వేళ..ఈ కార్ రేస్ కేసు ఏ మలుపు తీసుకుంటుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.
Also Read : ఇల్లేమో దూరం.. అసలే చీకటి.. చేతిలో దీపం కూడా లేదు.. కానీ.. అంటూ మరోసారి ఆ డైలాగ్ చెప్పిన పవన్ కల్యాణ్
ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో పెద్దఎత్తున అవినీతి జరిగిందని, నిబంధనలకు విరుద్దంగా కోట్ల రూపాయలను విదేశాలకు తరలించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిటెండ్ కేటీఆర్‌తో పాటు పలువురు అధికారులపై ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేటీఆర్ పేరును ఎఫ్ఐఆర్‌లో నమోదు చేయడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని కేటీఆర్ పిటీషన్‌పై వేయగా..విచారణకు హాజరు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో ఏసీబీ విచారణకు హారయ్యారు కేటీఆర్. ఇదే సమయంలో ఈడీ కూడా ఈ కార్ రేసుపై కేసు నమోదు చేయగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు కూడా హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కేటీఆర్. ఆ తర్వాత వ్యవహారం అంతా సైలెంట్ అయిపోయింది.
ఇప్పుడు మరోసారి తనకు ఏసీబీ, ఈడీ నోటీసులు ఇచ్చేందుకు రెడీ అవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోపే తనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారని కేటీఆర్ భావిస్తున్నారట. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏమీ ఉండదని, అందుకే ప్రజల దృష్టిని డైవర్ట్ చేసేందుకు మరోసారి ఈ కార్ రేస్ కేసును తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ చెబుతున్నారట. అంతేకాదు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన అంటున్నారట. ఇలా కేటీఆరే ఇప్పుడు ఈ కార్ రేస్ అంశాన్ని లేవనెత్తి..తనకు మళ్లీ నోటీసులు ఇస్తారని చెప్పడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న చర్చ జరుగుతోంది.
ఈనెల 16 నుంచి 27 మధ్యలో ఎప్పుడైనా తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుందని కేటీఆర్ డేట్స్‌తో సహా చెప్పడంతో అరెస్ట్‌పై ఆయనకు పక్కా సమాచారం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసు దర్యాప్తు ఫైనల్ స్టేజ్‌కు చేరుకుందట. అందుకే తనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇవ్వబోతున్నట్లు కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సారి కేవలం నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడంతో సరిపెట్టకుండా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ అనుమానించడం బీఆర్ఎస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోందట.
Also Read : వైసీపీ నేతలను దగ్గరికి కూడా రానివ్వొద్దు, వారితో సంబంధాలు పెట్టుకోవద్దు- టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
కేటీఆర్ అరెస్ట్ అయితే వాట్ నెక్ట్స్?
బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంటన్న దానిపై గులాబీ పార్టీలో చర్చ జరుగుతోందట. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ కేటీఆర్ అరెస్ట్ అయితే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు టాక్. కేటీఆర్ చెప్పినట్లు ఏసీబీ నోటీసులు ఇస్తుందా? వ్యవహారం అరెస్ట్ వరకు వెళ్తుందా అనేది చూడాలి మరి.