Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ రెండు చారిత్రాత్మక బిల్లులు..

తెలంగాణ ప్రభుత్వం రెండు చారిత్రాత్మక బిల్లులను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. ఇవాళ రెండు చారిత్రాత్మక బిల్లులు..

Telangana Assembly Session

Updated On : March 17, 2025 / 9:23 AM IST

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ (సోమవారం) సభ ముందుకు రెండు చారిత్రాత్మక బిల్లులు రానున్నాయి. బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది. వీటికి ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం తెలపడంతో బిల్లులకు ప్రభుత్వం శాసనసభ ఆమోదం తీసుకోనుంది.

 

ఎస్సీ వర్గీకరణ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనుండగా.. బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుతోపాటు బీసీలకు ప్రత్యేకంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రతిపాదించనున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుకోసం ప్రభుత్వం సామాజిక, ఆర్థిక కుల సర్వే నిర్వహించింది. ఈ నివేదిక ప్రకారం.. బీసీలతోపాటు కులాలవారీగా జనాభా లెక్కలు వెల్లడయ్యాయి.

 

బీసీల జనాభా ప్రకారం సామాజిక న్యాయం కల్పించేందుకు వారి రిజర్వేషన్లు 42శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 25శాతం, ముస్లింలకు బీసీ-ఈ కింద నాలుగు శాతం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలతో మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ హాల్ లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.