తెలంగాణలో మరో ఎన్నికల దంగల్.. గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.

Graduate Mlc Bypoll : లోక్ సభ ఎన్నికలు అయిపోయాయి. తెలంగాణలో పార్టీలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. 3 ఉమ్మడి జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ జరుగుతోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకున్నాయి. సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కంచుకోటను బద్దలు కొట్టాలని కాంగ్రెస్, గెలిచి సత్తా చాటాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్..
తెలంగాణలో మరో ఎన్నికల దంగల్ హీట్ ఎక్కిస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక అన్ని పార్టీలకు సవాల్ గా మారింది. లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగా ఎమ్మెల్సీ బైపోల్ కు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. మరోవైపు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.
గులాబీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు స్కెచ్..
పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలిచి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థానానికి ఉపఎన్నిక వచ్చింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. 2007లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కందులవాయి దిలీప్ కుమార్ ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ తర్వాత 2009లో జరిగిన ఉపఎన్నికలో కూడా ఆయన గెలుపొందారు.
2015, 2021 పట్టభద్రుల ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ తరుపున రెండుసార్లు గెలిచారు. ఇలా వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం గులాబీ పార్టీకి కంచుకోటగా కొనసాగుతోంది. ఇప్పుడా కోటను బద్దలు కొట్టేందుకు ప్రధాన పార్టీలతో సహా స్వతంత్ర అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాలు, బరిలో 52మంది అభ్యర్థులు..
ప్రస్తుతం జిల్లాల వారీగా 12 జిల్లాలు, 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 4లక్షల 61వేల 806 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2లక్షల 877 మంది పురుషులు.. లక్ష 74వేల 794 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసింది ఈసీ. ప్రధాన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని మొత్తం 52మంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పోటీ పడుతున్నారు.
బీజేపీలో పనిచేయడం కలిసి వస్తుందన్న ధీమా..
బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి పోటీ చేస్తుండగా.. ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతుండగానే పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఉపఎన్నికపైన దృష్టి పెట్టారాయన. ఓటరు నమోదు నుంచే పట్టభద్రులతో మమేకం అవుతూ వస్తున్నారు. గతంలో బీజేపీలో పని చేయడం కలిసి వస్తుందన్న ధీమాతో ఉన్నారు రాకేశ్ రెడ్డి.
గెలుపుపై కాంగ్రెస్ కాన్ఫిడెన్స్..
గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్ లో నిలిచిన కోదండరామ్ ఈసారి కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేసే అవకాశం ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న 3 ఉమ్మడి జిల్లాల్లో మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లే ఉన్నారు. బీఆర్ఎస్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపు తమదే అన్న ధీమాలో ఉంది కాంగ్రెస్. ఇక గత ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమేందర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల లాగే మోదీ వేవ్ కలిసి వస్తుందని.. విద్యావంతులు, మేధావులు తమ వైపు ఉంటారని బీజేపీ ఆశిస్తోంది. లోక్ సభ ఎన్నికల వేవ్ ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటిన్యూ చేస్తాం అంటోంది కమలదళం.
కాంగ్రెస్, బీజేపీ ఎత్తుకు పైఎత్తులు…
ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి.. ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల నేతలతో సమీక్షలు నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు బీఆర్ఎస్, గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి.
Also Read : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచే స్థానాలు ఎన్ని? అవి ఏవి?