కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీని నడిపించేది వీళ్లేనా? కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు..?
KTR's Formula E Race Row: కేటీఆర్ అరెస్ట్ అవుతారా.? అయితే పార్టీని నడిపించేంది ఎవరని తెలియాలంటే..

KTR's Formula E Race Row
కేటీఆర్ అరెస్ట్ అయితే.. పార్టీని ఎవరు నడిపిస్తారన్న ప్రశ్న వినిపించిన ప్రతీసారి.. చాలాపేర్లు తెరమీదకు వస్తున్నాయ్. ఐతే అందులో ఎవరికి అవకాశం దక్కుతుందన్నదే ఇప్పుడు కనిపిస్తున్న చర్చ.. గులాబీ శ్రేణులు ఏమనుకుంటున్నాయా.. గులాబీ బాస్ రంగంలోకి దిగుతారా.. వింటేజ్ కేసీఆర్‌ను పరిచయం చేస్తారా.. లేదంటే హరీష్, కవితలో ఒకరు బాధ్యత తీసుకుంటారా.. ఇదే ఇప్పుడు వినిపిస్తున్న చర్చ..
పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నహరీశ్
ఎదురుదెబ్బల నుంచి బలంగా తిరిగివస్తా అంటూ కేటీఆర్ చేసిన ఓ ట్వీట్.. కొత్త చర్చకు కారణం అవుతోంది. అరెస్ట్ ఖాయమని ఆయన డిసైడ్ అయిపోయారని కొందరు అంటుంటే.. రేవంత్ సర్కార్‌కు వార్నింగ్ ఇచ్చారని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయ్. ఆ ట్వీటే ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ గురించి.. ఆ తర్వాత పార్టీ నాయకత్వం గురించి చర్చకు కారణం అవుతోంది. కేటీఆర్ అరెస్ట్ అయినా.. బీఆర్ఎస్‌కు నాయకత్వ సమస్య లేదు అన్నది కొందరి వాదన. నిర్మాణాత్మకమైన కేడర్ లేకపోయినా.. బలమైన నాయకులు ఉండడం పార్టీకి కలిసొచ్చే అంశం.
నాయకత్వ బాధ్యతలు తీసుకునేందుకు హరీష్, కవిత సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్న ఆసక్తి కనిపిస్తోంది. గ్రౌండ్‌లెవల్‌లో పార్టీ కేడర్‌తో హరీష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయ్.. పైగా ఇప్పుడు కవిత కూడా పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు. దీంతో గులాబీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది.
క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే..
ఏసీబీ కేసులో ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే.. ఎప్పుడు బెయిల్ దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వ తీరు చూస్తుంటే.. అంత ఈజీగా బెయిల్ దక్కదన్న అనుమానాలు గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజులు.. పార్టీకి కీలకం అనే చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సిద్ధం అవుతోంది. దీంతో రాబోయే రోజుల్లో మరింత అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది.
కేటీఆర్ అరెస్ట్ అయితే.. ఆ ప్రభావం పార్టీ కేడర్ మీద పడే చాన్స్ ఉంటుంది. వీటిని అధిగమిస్తూ ప్రతిపక్షపార్టీగా.. క్షేత్రస్థాయిలో పట్టు నిలుపుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇప్పుడు పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో.. పార్టీని ఎవరు నడిపిస్తారన్నది గులాబీ నేతలకు గుబులు పుట్టిస్తున్న పరిస్థితి.
తెలంగాణ జాగృతి పేరుతో కార్యక్రమాలు..
ఎమ్మెల్సీ కవిత.. పార్టీ బాధ్యతల్లో మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత.. దాదాపు ఆరు నెలల తర్వాత రిలీజ్ అయ్యారు. విడుదలైనప్పటి నుంచి.. రాజకీయంగా యాక్టివ్ అయేందుకు ఏ అవకాశం దక్కినా.. వదులుకోవడం లేదు. ఓవైపు తెలంగాణ జాగృతి పేరుతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూనే…. కుల సంఘాల నేతలతో సమావేశం అవుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తూ పార్టీ కేడర్‌కు దగ్గరయ్యే కార్యాచరణ అమలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరి ఎండగట్టేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నారు. రెండు, మూడు నెలలుగా రాజకీయాల్లో.. కవిత తన మార్క్ క్రియేట్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా..?
ఇక కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తి కావడంతో.. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. ఇక అటు అరెస్ట్ తప్పదన్న అంచనాలతో.. కేడర్‌ను మానసికంగా సిద్ధం చేసే పనిలో పడ్డారు కేటీఆర్. కక్షతో ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు సిద్ధం అవుతోందని.. నేతలు మానసిక ధైర్యం కోల్పోవద్దని సూచిస్తున్నారు. ఇకపై అధినేత కేసిఆర్.. నేతలకు, కార్యకర్తలకు నేరుగా సూచనలు చేస్తారని.. తనను కలిసి నేతలతో కేటీఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారం.. పార్టీలో ఎన్నో చర్చకు కారణం అవుతోంది. మరి ఏం జరుగుతుంది.. అరెస్ట్ అవుతారా.. అయితే పార్టీని నడిపించేంది ఎవరని తెలియాలంటే.. కాలమే సమాధానం చెప్పాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.