రాష్ట్రంలో ప్రజలు రెండు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు.. ఆ వరదలు ఇవే: హరీశ్ రావు
హుందాగా వ్యవహరిస్తే మర్యాద దక్కుతుందని, లేకుంటే ఎలా వస్తుందని..

తెలంగాణలో ప్రజలు రెండు వరదలతో ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆ రెండు వదరల్లో ఒకటి ప్రకృతి వైపరీత్యమైతే, రెండోది సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్న అబద్ధాల వరద అని ఎద్దేవా చేశారు. తనకు కాకపోయినా తన కుర్చీకి అయినా మర్యాద ఇవ్వాలని సీఎం అన్నారని చెప్పారు.
హుందాగా వ్యవహరిస్తే మర్యాద దక్కుతుందని, లేకుంటే ఎలా వస్తుందని హరీశ్ రావు నిలదీశారు. ఆయన ఏమి మాట్లాడారో అందరూ చూశారని, తాను అలా మాట్లాడడానికి తనకు మర్యాద అడ్డు వస్తుందని అన్నారు. తన ఎత్తు మీద నీకు ఎందుకు ఈర్ష్య అని ప్రశ్నించారు. తన అంత ఎత్తు రేవంత్ రెడ్డి పెరగలేదని బాధ పడుతున్నారా అంటూ చురకలంటించారు. తన అంత ఎత్తు ఆయన ఎదగలేరని, తన హైట్ గురించి మాట్లాడడం వదిలి రైతు గురించి ఆలోచించాలని అన్నారు.
రుణమాఫీ పూర్తి చేశానని సీఎం అంటున్నారని, ఒక్కసారి కొండారెడ్డి పల్లికి పోదామని చెప్పారు. తేదీ, సమయం చెబితే తానే వస్తానని సవాలు విసిరారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే రుణమాఫీ జరగదు కదా అని నిలదీశారు. సురేందర్ రెడ్డి ఆత్మహత్య ప్రభుత్వ హత్య అని అన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరుగలేదని సీఎం రేవంత్ రెడ్డే చెబుతున్నారని తెలిపారు.
సీఎం పదవిలో ఉన్నపుడు జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. ఉచిత కరెంట్ ఉత్త కరెంట్ అయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రుణమాఫీ పూర్తి చేయించాలని, సీఎం కుర్చీ గౌరవం పెంచాలంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలని అన్నారు. అరికపూడి గాంధీ విషయంలో మంత్రులు ఒకటి, సీఎం మరొకటి చెబుతున్నారని హరీశ్ రావు అన్నారు. సీఎం మాటలు చూస్తుంటే తానే దాడి చేయించినట్లు చెప్పకనే చెప్పారని అన్నారు.