HCU Lands : భవిష్యత్తు తరాల కోసం ఆ భూములను వదిలేయండి- సీఎం రేవంత్ కి సమంత, రష్మిక, ఉపాసన, రేణుదేశాయ్ విన్నపం
భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రిక్వెస్ట్ చేశారు.

HCU Lands : తెలంగాణలో దుమారం రేపుతున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై టాలీవుడ్ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. హెచ్ సీయూ భూముల విషయంలో సెలబ్రెటీలు ఏకమవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని విప్పుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం హెచ్ సీయూ భూములను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు.
నటి రేణుదేశాయ్, రష్మీ గౌతమ్, హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన, సమంత, రష్మిక మందన్న, అనసూయ తదితరులు దీనిపై రియాక్ట్ అయ్యారు. భవిష్యత్తు తరాల కోసం ఆ 400 ఎకరాల భూమిని వదిలివేయాలని వారంతా రేవంత్ సర్కార్ కు రిక్వెస్ట్ చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూవివాదంపై హీరోయిన్ రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. రాత్రికి రాత్రే బుల్డోజర్లు, విద్యార్థుల అరెస్టులు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నిజంగా ఏం జరుగుతోంది? అంటూ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ పెట్టారు రష్మిక.
అటు మరో నటి సమంత సైతం ఈ ఇష్యూపై స్పందించారు. బుల్డోజర్లతో 400 ఎకరాల్లో చెట్లను నరకటం బాధగా ఉందన్నారు సమంత. అటవీ ప్రాంతాన్ని నిర్మూలిస్తే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని సమంత ఆవేదన వ్యక్తం చేశారు. జంతువులు, పక్షులను కాపాడాలని సమంత విజ్ఞప్తి చేశారు. కంచ గచ్చిబౌలి భూములను పరిరక్షించాలని సమంత నినదించారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ వేదికగా సామాజిక సమస్యలపై ప్రశ్నించే సంస్థ Change.org పిటిషన్‌కి సైన్ చేయాలని ఆమె కోరారు.
ఇక, హెచ్ సీయూ భూ వివాదంపై సినీ సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా గళం విప్పుతున్నారు. నాగ్ అశ్విన్, అనసూయ, దియా మీర్జా సైతం స్పందించారు. హెచ్ సీయూ భూములను పరిరక్షించాలని రేవంత్ సర్కార్ కు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా వారంతా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
హెచ్‌సీయూలో భూ వివాదంపై నటి రేణు దేశాయ్ ఓ వీడియో విడుదల చేశారు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ భూమిని అలాగే వదిలేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె రిక్వెస్ట్ చేశారు. తనకిప్పుడు 44 ఏళ్లు అని.. రేపో మాపో చనిపోతానని.. కానీ తర్వాతి తరాలకు ఆక్సిజన్, నీరు కోసం ఇలాంటి భూమి అవసరమన్నారు రేణు దేశాయ్.
Also Read : చెట్లను నరకడం ఆపండి..! హెచ్‌సీయూ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..
కచ్చితంగా అభివృద్ధి జరగాల్సిందేనని, అందులో ఎలాంటి సందేహం లేదని, కానీ దాని కోసం మరో చోట భూమిని ఉపయోగించాలని రేవంత్ సర్కార్ ను అభ్యర్థించారు రేణు దేశాయ్. మన పిల్లలకు ఉత్తమ విద్య, మంచి ఆహారం, వారి భవిష్యత్తు కోసం చాలా డబ్బు సంపాదిస్తున్నాం. కానీ వాటన్నింటికంటే ముందు మనకు ఆక్సిజన్, నీరు అవసరమని రేణు దేశాయ్ తేల్చి చెప్పారు.
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఉపాసన. చెట్లను నరికేస్తే అక్కడున్న మూగజీవాలు, పక్షులకు ఎక్కడ పునరావాసం కల్పిస్తారు? నరికివేసిన చెట్లను తిరిగి ఎక్కడ పెంచుతారు? వీటన్నింటికీ సమాధానం చెప్పండి అని కోరారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వివాదం ముదురుతోంది. ఆ భూములను కాపాడాలంటూ హెచ్‌సీయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఆ భూములను పరిరక్షించాలని పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.
హెచ్ సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐటీ పార్క్ నిర్మాణం కోసం వేలం వేయాలని రేవంత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చిచ్చు రాజేసింది. ఈ నిర్ణయాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించడంతో ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది.
400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేయడంతో ఆ అడవిపై ఆధారపడిన మూగజీవులు జీవనాధారం కోల్పోతాయని పర్యావరణ ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు.