HCU Lands Row : చెట్లను నరకడం ఆపండి..! హెచ్‌సీయూ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు..
ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని వాదనలు వినిపించారు.

HCU Lands Row : హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి వరకు పనులు ఆపేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గురువారం వరకు చెట్లను కొట్టేయొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు విచారణను వాయిదా వేసింది హైకోర్టు.
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తీసుకొచ్చిన 54 జీవోను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై కోర్టులో వాదనలు జరిగాయి. 400 ఎకరాల భూమి తమదేనంటూ ప్రభుత్వం చెబుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచంద్ వాదించారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమే అయినా సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఉండాలని న్యాయవాది కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.
Also Read : మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు
కొన్నాళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిరసనలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు, నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. వివాదాస్పద భూముల్లో మూడు చెరువులు, రాక్ స్ట్రక్చర్ ఉన్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్న హెచ్ సీయూ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూ వివాదంపై ఇవాళ తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. రెండు పిటిషన్లపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. మధ్యాహ్నం 2గంటల 30 నిమిషాల ప్రాంతంలో విచారణ ప్రారంభమైంది. కోర్టు సమయం ముగిసే వరకు ఇదే అంశంపై సుదీర్ఘంగా విచారణ జరిగింది. వటా ఫౌండేషన్ తరపున న్యాయవాది నిరంజన్, హెచ్ సీయూ విద్యార్థుల తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ రవిచంద్ వాదనలు వినిపించారు.
అదంతా ఫారెస్ట్ కు సంబంధించిన ల్యాండ్ అని, డీఫారెస్ట్ చేయాలనుకుంటే ఎక్స్ పర్ట్ కమిటీతో పూర్తిగా అధ్యయనం చేయాలన్నారు. అక్కడ చాలా పక్షులు, జంతువులు ఉన్నాయని.. మూడు చెరువులు ఉన్నాయని.. వీటన్నింటిని పరిశీలనలోకి తీసుకోవాలని వాదనలు వినిపించారు. అయితే, నిబంధనలకు విరుద్ధంగా అటవీ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు.