HCU Lands Dispute : మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.

HCU Lands Dispute : మా ప్రభుత్వం వేల కోట్ల విలువైన భూమిని కాపాడింది- హెచ్ సీయూ భూముల వివాదంపై మంత్రులు

Updated On : April 2, 2025 / 5:42 PM IST

HCU Lands Dispute : హెచ్ సీయూ భూముల వివాదంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. భూముల అంశంపై విద్యార్థుల ధర్నాతో హెచ్ సీయూలో రోజంతా హైటెన్షన్ కొనసాగింది. విద్యార్థుల ఆందోళనలకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. వన్య ప్రాణులను చంపి కాంక్రీట్ జంగిల్ లా మారుస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.

తెలంగాణ ప్రజల కళ్లలో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. చదువులు చెప్పే చోట విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. మరోవైపు భూముల వివాదంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రులు ఎదురు దాడికి దిగారు.

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2003లో ఉమ్మడి ఏపీలో ప్రైవేట్ వ్యక్తులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం భూములను అప్పగించిందని, ఆ భూమిపై రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పోరాటం చేసిందని గుర్తు చేశారు మంత్రులు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆ భూమిపై పోరాటం చేయటంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఆ భూమిని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైకోర్టులో న్యాయ పోరాటం చేసి వేల కోట్ల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నామని మంత్రులు తెలిపారు.

Also Read : తెలంగాణ మంత్రుల శాఖలు మారడం ఖాయమా?

కంచ గచ్చిబౌలిలోని వేల కోట్ల విలువైన భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తమ ప్రభుత్వం కాపాడిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 400 ఎకరాల భూమిని చంద్రబాబు ప్రభుత్వం 2004లో ఐఎంజీ భారత్ కు కేటాయిస్తే, 2006లో వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. దీంతో ఐఎంజీ భారత్ కోర్టుకు వెళ్లిందని, అప్పటి నుంచి కేసు కోర్టులోనే ఉందని వివరించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నా పట్టించుకోలేదన్నారు. ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఆ భూమిని తమ చేతుల్లోకి తెచ్చుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని మంత్రి ఆరోపించారు.