హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. మరో మూడ్రోజులు కుమ్ముడే.. ఇవాళ అతిభారీ వర్షం కురిసే చాన్స్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్‌లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి.

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. మరో మూడ్రోజులు కుమ్ముడే.. ఇవాళ అతిభారీ వర్షం కురిసే చాన్స్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..

Hyderabad Rains

Updated On : July 19, 2025 / 7:41 AM IST

Hyderabad Rains: హైదరాబాద్‌లో శుక్రవారం వరుణుడు బీభత్సం సృష్టించాడు. గంటలపాటు కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపించాయి. శుక్రవారం సాయంత్రం మొదలైన వర్షం.. రాత్రి వరకు కొనసాగింది. దీంతో సుమారు వందకుపైగా కాలనీల్లో నాలాలు ఉప్పొంగి ఇళ్లలోకి నీరు చేరింది. వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కుండపోత వర్షం నగరవాసులను అతలాకుతలం చేసింది. సికింద్రాబాద్ పికెట్ లో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాచారంలో 10.13, ముసారాంబాగ్ లో 9.88 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధాన ప్రాంతాల్లోసైతం రోడ్లపై మోకాళ్లలోతున వరద నీరు నిలిచిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 50 చోట్ల ఐదు సెంటీమీటర్లు కంటే ఎక్కువ వర్షం కురిసింది.


భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇదిలాఉంటే.. మరో మూడ్రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల చక్రవాత ఆవర్తనం, దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులు వర్షాలకు అనుకూలంగా మారాయి. దీంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని, శనివారం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. శనివారం ఆరెంజ్ హెచ్చరికను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీచేసింది. భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.


హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీసు, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజల ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి అవసరమైతే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.