Heavy Rains : తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు.

Telangana Rain Forecast
Telangana Heavy Rains : తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో రాగల మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల్లో కొనసాగుతుందని తెలిపింది.
ఇది పశ్చిమ వాయువ్యం దిశగా కదులుతూ రాగల రెండు నుంచి మూడు రోజులు ఉత్తర ఒడిషా, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ, వాయువ్య దిశల నుంచి రాష్ట్రంలోకి వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చిరు జల్లులు పడ్డాయి.
Rudraprayag Bridge collapse : భారీవర్షాలు..కూలిపోయిన రుద్రప్రయాగ్ వంతెన
నిన్న(శనివారం) ఆదిలాబాబ్ నిజామాబాద్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ (ఆదివారం) కూడా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు. కలెక్టరేట్ లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.