Heavy Rains : తెలంగాణలో కుండపోత వర్షాలు..పొంగి ప్రవహిస్తోన్న వాగులు, వంకలు
తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

Telangana
Heavy rains in Telangana : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. మరో మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురువనున్నాయి.
గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి. అత్యధికంగా రాజన్న సిరిసిల్లలో 154.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మెదక్, రంగారెడ్డి జిల్లాలో 145.5, సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాలో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
కరీంనగర్ 109.8 మి.మీ, వికారాబాద్ 109.5 మి.మీ, హైదరాబాద్107.3, మహబూబ్ నగర్ 107 మిల్లీమీటర్ల వర్షపాతం రిజిస్టర్ అయింది. రాగల 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం పడింది. శంకర్ పల్లి మండలంలో అత్యధికంగా 7.57 సెంటీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వనాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల పంట పొలాల్లోకి వరద నీరు చేరింది. చెరువులు మత్తడి దూకుతున్నాయి. వాగులు, వంకలు, చెక్ డ్యామ్ లు పొంగిపొర్లుతున్నాయి.
మొర్రేడు వాగు, గోదుమ వాగు, కిన్నెర సారి వాగులు పొంగిప్రవహిస్తున్నాయి. ఇల్లందు, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు వరి, పత్తి, మిర్చి పంటలకు నష్టం వాటిల్లింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ వర్షం ముంచెత్తింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రబాద్ మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి మహబూబ్ నగర్ లో రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో రాత్రంతా స్థానికులు బిక్కు బిక్కు మంటూ గడిపారు. ఇళ్లలోకి భారీగా వరద నీర చేరడంతో మంచాల పైకెక్కి రాత్రంతా జాగారం చేశారు. ఎనుగొండ, బీకే రెడ్డి కాలనీ, శివశక్తి నగర్ కాలనీ పూర్తిగా జలదిగ్బధంలో చిక్కకున్నాయి.
అచ్చంపేటలో వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. మూడు రోజులుగా కుర్తుస్తున్న వర్షాలకు దుందుబి వాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తోంది. దీంతో వాగులో చేపలు పట్టడానికి ఎవరూ వెళ్లొద్దని పోలీసులు హెచ్చరించారు. ముందస్తు జాగ్రత్తగా భారీ కేడ్లు ఏర్పాటు చేశారు.
మొల్గర నుంచి ఉల్పర మీదుగా కల్వకుర్తికి రాకపోకలు బంద్ చేశారు. ఉప్పునుంతల తహసీల్దార్ కృష్ణయ్య వాగును పరిశీలించారు. వాగు ఉధృతి తగ్గే వరకు రాకపోకలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు.