ఆపరేషన్ మూసీ.. రెండోరోజూ సర్వే, కొత్తపేటలో టెన్షన్ టెన్షన్..

ఇవాళ భారీగా పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేయడానికి అధికారులు వచ్చారు.

ఆపరేషన్ మూసీ.. రెండోరోజూ సర్వే, కొత్తపేటలో టెన్షన్ టెన్షన్..

Updated On : September 27, 2024 / 5:43 PM IST

Operation Musi : హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతంలో రెండోరోజూ అధికారుల సర్వే కొనసాగుతోంది. దీంతో కొత్తపేట సమీపంలోని న్యూ మారుతీ నగర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకుంటున్నారు. తమ ఇళ్లకు మార్కింగ్ చేస్తుండగా అధికారులతో వాగ్వాదానికి దిగారు. మార్కింగ్ చేస్తే ఊరుకునేది లేదన్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

Also Read : ప్రభుత్వంలో టాప్‌ సీక్రెట్‌ వ్యవహారాలు గులాబీ పెద్దలకు లీక్? సీఎం రేవంత్ సీరియస్, ఇంటెలిజెన్స్‌కు కీలక ఆదేశాలు..!

నిన్న కూడా స్థానికులు అడ్డుకోవడంతో అధికారులు మార్కింగ్ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఇవాళ భారీగా పోలీసు బందోబస్తు మధ్య మార్కింగ్ చేయడానికి అధికారులు వచ్చారు. స్థానికులు అధికారులను అడ్డుకోవడంతో అక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

ఉద్రిక్తతలు, ఆందోళనల నడుమ మూసీ పరివాహక ప్రాంతంలో అధికారుల రెండోరోజు సర్వే కొనసాగింది. మూసీ పరివాహక ప్రాంతంలో 25 బృందాలు రంగంలోకి దిగాయి. మార్కింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని చోట్ల మాత్రం స్థానికుల నుంచి అధికారులకు నిరసన గళం వినిపిస్తోంది. నిన్న న్యూ మారుతీ నగర్, గణేశ్ నగర్, వినాయక్ నగర్ ప్రాంతాల్లో మార్కింగ్ చేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను అడ్డుకుని వెనక్కి పంపేశారు. దీంతో రెండోరోజు భారీ పోలీసు బందోబస్తుతో వచ్చారు అధికారులు. రివర్ బెడ్ ఏరియాలో ఉన్న ప్రాంతాలుగా గుర్తించి మార్కింగ్ వేశారు. ఈ ఇళ్లలో నివాసం ఉంటున్న స్థానికులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించేందుకు ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే.

కొన్నేళ్లుగా తాము మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు కట్టుకున్నామని, నివాసం ఉంటున్నామని, ఉన్న ఫళంగా ఇళ్ల నుంచి వెళ్లిపోవాలంటే కొంత ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు. అధికారులు మార్కింగ్ వేసేందుకు రాగా.. స్థానికులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

”18 ఏళ్లుగా ఉంటున్నాం. 20 లక్షలు ఖర్చు పెట్టి కట్టించుకున్నాం. ప్రతి ఏటా ట్యాక్సులు కడుతున్నాం. నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా. ఇది ప్రభుత్వ స్థలం అని ముందే చెప్పొచ్చు కదా. నాకు ఇద్దరు ఆడపిల్లలు. మేము ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి? పిల్లలకు ఎప్పుడు పెళ్లి చేయాలి? మాకు ఏంటీ బాధ? మమ్మల్ని రోడ్డున పడేస్తే మేము ఎలా బతకాలి?” అని స్థానికంగా నివాసం ఉంటున్న ఓ మహిళ కన్నీటిపర్యంతమైంది.

కొన్నేళ్లుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నామని, కాయకష్టం చేసుకుని బతుకుతున్నామని, కష్టపడి సంపాదించిన డబ్బుతో వేరే వారి నుంచి ఇళ్లను కొనుగోలు చేశామని, ఇప్పుడు తమ ఇళ్లను కూలుస్తాం అంటే ఎలా? అని బాధితులు వాపోతున్నారు.