Mulug Constituency: అడవి బిడ్డల ఆసక్తికర పోరు.. ములుగులో ఎవరిదో పైచేయి?

అటు సీతక్క.. ఇటు నాగజ్యోతి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఒకే తెగకు చెందిన వారు కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది.

Mulug Constituency: అడవి బిడ్డల ఆసక్తికర పోరు.. ములుగులో ఎవరిదో పైచేయి?

How Seethakka, Nagajyothi fight for Mulug assembly constituency

Updated On : September 13, 2023 / 5:37 PM IST

Mulug Assembly constituency అడవిలో అసెంబ్లీ పోరాటం.. అజ్ఞాత జీవితాలను వదిలేసి.. నిత్యం జనంతో మమేకం.. ములుగు రాజకీయమే ప్రత్యేకం.. ఆద్యంతం ఆసక్తికరం.. విప్లవ రాజకీయాల నుంచి ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కకు (Danasari Seethakka) విప్లవ రాజకీయాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన అడవి బిడ్డ బడే నాగజ్యోతికి (Bade Nagajyothi) మధ్య ఆధిపత్య పోరాటానికి రానున్న ఎన్నికలు వేదిక కాబోతున్నాయి. కాంగ్రెస్‌లో స్టార్ లీడర్‌గా ఎదిగిన ఎమ్మెల్యే సీతక్కకు చెక్ చెప్పేలా మాస్టర్ ప్లాన్ వేశారు సీఎం కేసీఆర్ (CM KCR) సీతక్కకు ప్రత్యర్థిగా ములుగు జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతిని బరిలోకి దింపుతున్నారు. ఈ ఇద్దరు అడవి బిడ్డల మధ్య రసవత్తర పోటీతో ములుగు రాజకీయం వేడిక్కెంది.. బుల్లెట్ బ్యాక్‌గ్రౌండ్‌తో బ్యాలెట్ వార్‌కు సిద్ధమవుతున్న ఈ ఇద్దరిలో పైచేయి ఎవరిది కాబోతుందో?

ములుగు అసెంబ్లీ నియోజకవర్గానికి ఘన చరిత్ర ఉంది. 1952 నుంచి 2018 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ నాలుగు సార్లు, పీడీఎఫ్ రెండు సార్లు, ఇండిపెండెంట్ ఓ సారి విజయం సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిన ములుగులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడించారు ఎమ్మెల్యే సీతక్క. నక్సలిజాన్ని వదిలి ప్రజా జీవితంలో అడుగుపెట్టిన సీతక్కకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలుగుతున్న సీతక్క.. నియోజకవర్గంలో వ్యక్తిగతంగా మంచి పలుకుబడి సాధించారు.

Danasari Seethakka

Danasari Seethakka

2004లో రాజకీయాల్లోకి వచ్చిన సీతక్క తొలిసారి ఓటమి పాలైనా.. 2009లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సీతక్క.. బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయారు. 2018లో చందూలాల్‌ను ఓడించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు సీతక్క. ఈ ఎన్నికల తర్వాత చందూల్ మరణించడంతో.. సీతక్కకు దీటైన ప్రత్యర్థిని నిలపడం అధికార పార్టీకి సవాల్‌గా మారింది. ఐతే అందరి అంచనాలకు అందని విధంగా సీతక్కకు సమ ఉజ్జీని ఎంపిక చేసి ములుగు రాజకీయాన్ని ఆసక్తికరంగా మార్చేశారు సీఎం కేసీఆర్. ములుగు జడ్పీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతిని బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ప్రకటించడంతో సీతక్కకు గట్టిపోటే ఎదురయ్యే అవకాశం ఉంది. అజ్ఞాత జీవితాన్ని వదిలేసి ప్రజా సేవను ఎంచుకున్న ఎమ్మెల్యే సీతక్క 20 ఏళ్లుగా ములుగు నియోజకవర్గంపై బలమైన ముద్ర వేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సీతక్కదే ఆధిపత్యం. కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తామనే సీట్లలో ములుగు ఒకటిగా మార్చేశారు సీతక్క. ఐతే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సీతక్కకు చెక్ పెట్టాలని ములుగుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్.

Bade Nagajyothi

Bade Nagajyothi

ముల్లును ముల్లుతోనే తీయాలనే స్ట్రాటజీతో నక్సలిజం నేపథ్యం ఉన్న సీతక్కపై అదే నక్సలిజం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న మహిళా నాయకురాలు బడే నాగజ్యోతిని గులాబీ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. సీతక్క సామాజిక వర్గానికి చెందిన నాగజ్యోతికి విప్లవ రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె తల్లిదండ్రులు బడే నాగేశ్వరరావు, విమలక్క ఇద్దరూ మావోయిస్టులుగా పనిచేసిన వారే.. అంతేకాదు మావోయిస్టు బడే నాగేశ్వరరావు.. దళంలో సీతక్క కంటే పెద్ద క్యాడర్‌లో పనిచేసినట్లు చెబుతున్నారు. ఇటు సామాజికవర్గ పరంగా.. అటు నక్సలైట్ ఉద్యమ నేపథ్యంలో ఎటు చూసినా సీతక్కకు సరిజోడిగా బరిలో నిలుస్తున్నారు బడే నాగజ్యోతి.. ప్రస్తుతం ములుగు జడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్న నాగజ్యోతికి ప్రజల్లో కూడా మంచి గుర్తింపే ఉంది.

Also Read: ఎవర్రా బానిసలు? ఆమెను ఒక్క మాట అన్నా పాపం తగులుతుంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిప్పులు

Bade Nagajyothi, Danasari Seethakka

Bade Nagajyothi, Danasari Seethakka

ఇలా అడవి బిడ్డలైన సీతక్క, నాగజ్యోతి మధ్య ఆసక్తికరపోటీకి వేదికవుతోంది ములుగు. విస్తృత సేవా కార్యక్రమాలతో తన విజయం నల్లేరు మీద నడకే అన్న ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే సీతక్క. ఐతే సీతక్కకు పలు సమస్యలు సవాల్ విసురుతున్నాయి. ఆదివాసీ గ్రామాలకు రవాణా సౌకర్యం లేకపోవడం.. తాగు, సాగునీటి కష్టాలు.. కనీస మౌలిక వసతుల కల్పన సీతక్కకు మైనస్‌గా మారుతున్నాయి. ఐతే సీతక్క గెలిచిన రెండు సార్లు ప్రతిపక్షంలోనే ఉండటంతో అభివృద్ధి చేయలేకపోయానని చెబుతున్నారు. మరో చాన్స్ ఇస్తే ములుగు ప్రగతికి బాటలు వేస్తానంటున్నారు సీతక్క.

Also Read: రఘునందన్‌రావు తప్ప.. ఎక్కడా కనిపించని బీజేపీ హేమాహేమీల పేర్లు!

ములుగులో ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్ జెండా ఎగరేయాలన్నది సీఎం కేసీఆర్ పంతం. చందూలాల్ మరణం తర్వాత బీఆర్‌ఎస్‌కు దీటైన నేత లేకపోయారని ఇన్నాళ్లు భావించారు పరిశీలకులు. ఐతే అనూహ్యంగా జడ్పీ చైర్‌పర్సన్ నాగజ్యోతిని తెరపైకి తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన నాగజ్యోతి వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చేశారు. 2019లో స్వగ్రామంలో సర్పంచ్‌గా గెలిచిన నాగజ్యోతి రాజకీయాల్లో ప్రవేశించారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి తాడ్వాయి జడ్‌పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే జడ్పీ పీఠం అప్పగించారు సీఎం కేసీఆర్.. ఇప్పుడు సీతక్క ప్రత్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు నాగజ్యోతి. ఆమె తండ్రి నాగేశ్వరరావు, తల్లి విమలక్క మావోయిస్టు ఉద్యమం ద్వారా గిరిజనుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2018లో జరిగిన ఎన్కౌంటర్‌లో నాగజ్యోతి తల్లిదండ్రులు మరణించారనే సానుభూతి ఉంది. మరోవైపు ఆమె మామ చొక్కారావు అలియస్ దామోదార్ కూడా ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పరిశీలించిన సీఎం కేసీఆర్.. సీతక్కను ఢీకొట్టాలంటే సామాజిక అంశమేకాదు.. విప్లవ నేపథ్యమూ ఉండాలని నాగజ్యోతికి బీఆర్‌ఎస్ టికెట్ కన్ఫార్మ్ చేశారు.

అటు సీతక్క.. ఇటు నాగజ్యోతి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఆదివాసీలు, బంజారాలు ఎక్కువగా ఉండే ములుగు నియోజకవర్గంలో అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఇద్దరూ ఒకే తెగకు చెందిన వారు కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఐతే ములుగులో పాగా వేయాలని బీజేపీ కూడా తెరచాటు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థిపై ఎలాంటి క్లారిటీ లేదు. బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది బీజేపీ నాయకత్వం. బీఆర్ఎస్ అసమ్మతి నేత మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు డాక్టర్ ప్రహ్లాద్‌పై (Ajmeera Prahlad) తాజాగా బీజేపీలో చేరారు. ప్రహ్లాద్ కనుక బీజేపీ నుంచి పోటీ చేస్తే లంబాడీల ఓట్లు కొల్లగొట్టొచ్చని ప్లాన్ చేస్తోంది బీజేపీ. ప్రహ్లాద్ పోటీచేస్తే ములుగులో త్రిముఖపోటీ జరిగే చాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటాపోటీగా రాజకీయం నడుస్తోంది. మాస్‌లీడర్‌ సీతక్క ఇమేజ్‌ను బీఆర్‌ఎస్ చెదరగొట్టగలదా అన్నదే ఇంట్రస్టింగ్‌గా మారింది.