సచివాలయం సాక్షిగా కులాల కుమ్ములాట.. ప్రభుత్వ పరువు తీస్తున్న అధికారులు

Hyderabad Employees: సీఎస్‌ దృష్టికి సమస్య వెళ్లినా ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం చర్చకు దారితీస్తోంది.

సచివాలయం సాక్షిగా కులాల కుమ్ములాట.. ప్రభుత్వ పరువు తీస్తున్న అధికారులు

కులాల కుమ్ములాటలు రాజకీయాల్లోనే కాదు… రాజకీయనేతలతో అంటకాగే కొందరు ఉద్యోగులకు తాకినట్లుంది. 24 గంటలు నాయకులను చూస్తున్న ఉద్యోగులు తామే తక్కువ తిన్నామనుకున్నారేమో… రాష్ట్ర ప్రభుత్వానికి దేవాలయం లాంటి సచివాలయం సాక్షిగా కుల పంచాయితీలకు దిగుతున్నారు. ఒకరినొకరు దూషించుకోవడమే కాకుండా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేసుకుని ప్రభుత్వం పరువూ తీసేస్తున్నారు. తెలంగాణ సచివాలయంలో ఇటీవల రచ్చరచ్చ చేస్తున్న కుల పంచాయితీపై పెద్ద చర్చే జరుగుతోంది.

ఎక్కడో మారుమూల పల్లెల్లో కుల పంచాయితీ జరిగిందంటే… నిరక్షరాస్యతో.. వెనుకుబాటు తనమో… ఇంకేదైనా కారణమో అని సరిపెట్టుకోవచ్చు. తప్పు జరిగిందని సరిదిద్దొచ్చు. ఆ తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ, తప్పులు సరిదిద్దాల్సినవారు… తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉండాల్సినవారు… ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన వారే కుల పంచాయితీలు పెడితే… అదీ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయం కేంద్రంగానే కుల రాజకీయాలు చేస్తే ఇంకేమనాలి?

ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందా? తమ పరువు పోతుందా? ఆలోచించకుండా ఉన్నత చదువులు చదివిన వారు.. ఉన్నతోద్యోగాలు చేస్తున్నవారు కుల పంచాయితీలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. స‌చివాల‌యంలో ఇద్దరు అధికారుల మధ్య క్యాస్ట్ వార్‌ హాట్‌టాపిక్‌గా మారింది.

కీలకమైన శాఖ‌ల్లో..
ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక, అట‌వీ శాఖ‌ల్లో ప‌నిచేస్తున్న కొంద‌రు అధికారులు కుల గ‌జ్జితో ఊగిపోతున్నార‌నే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కువ కులం వారని కొందరు… త‌క్కువ కులం వారని మరికొందరు గిరి గీసుకుని… గీత‌లు పెట్టుకుని పాలనను కుల రొచ్చులో పడేస్తున్నారని అంటున్నారు. కొందరు అధికారులు తమ కులం వారికోసం ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు నడుపుతూ.. ఇతర కులాల వారిపై కామెంట్లు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పై స్థాయిలో త‌క్కువ కులం అధికారి ఉంటే… ఆ అధికారి కింద‌ అగ్రకులాలకు చెందిన అధికారులు అంగీకరించలేని పరిస్థితులు ఉన్నాయంటున్నారు. దీంతో ఉద్యోగులు, అధికారులు పరస్పరం ధూషణలకు దిగుతూ తగువులు పడుతున్నారు. ఈ విషయం సీఎస్‌ శాంతికుమారి దృష్టికి వెళ్లిందంటున్నారు.

ఇటీవల ఆర్థికశాఖ‌లో ఇద్దరు కీలక అధికారుల మ‌ధ్య ఈ క్యాస్ట్ వార్ తారాస్థాయికి చేరిందని టాక్‌ వినిపిస్తోంది. ఇద్దరు ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న వారు… కులం పేరుతో ధూషించుకోని డిపార్టుమెంట్‌ను ప్రతిరోజూ రచ్చబండలా మార్చేశారంటున్నారు. ఈ వ్యవ‌హారంపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యద‌ర్శి రామకృష్ణారావు, సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదులు వెళ్లినా… ఆ ఇద్దరు వెనక్కి తగ్గడంలేదట…. తన పై అధికారి వేధింపులు భరించలేక కిందస్థాయి అధికారి అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. అక్కడా పంచాయితీ తేలకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ గడప తొక్కాల్సివచ్చిందంటున్నారు. దీనిపై సదరు ఉన్నతోద్యోగిపై ఎస్‌సి, ఎస్‌టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు చెబుతున్నారు.

సీఎస్‌ దృష్టికి వెళ్లినా…
ఇలా సచివాలయంలో కులం పేరుతో తిట్టుకుంటూ ప్రభుత్వం పరువు బజారు కీడుస్తున్నా, సీఎస్‌ దృష్టికి సమస్య వెళ్లినా ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. తాము ఎంతలా రెచ్చిపోయినా… అధికారుల సపోర్టు ఉంటుందనే ధీమాతో తిట్టుకుంటున్న అధికారులు చివరికి పరస్పరం దాడులకు కూడా సిద్ధమవుతున్నారు.

అర్ధరాత్రిపూట ఇళ్లపై దాడులకు ప్రయత్నాలు చేస్తూ రౌడీలకు తామేం తీసేపోలేదని రుజువు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర పరిపాలనా దేవాలయంలో తిట్లు, శాపనార్థాలు, దాడులు జరగడం ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోంది. ఐతే ఇంతవరకు ఈ ఎపిసోడ్‌ ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లలేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆర్థిక శాఖ చూస్తున్న డిప్యూటీ సీఎం మల్లు దృష్టలో పెడతారా? లేక సీఎస్‌ స్థాయిలోనే సమస్యకు ముగింపు పలుకుతారో చూడాల్సివుంది.

వరంగల్ మేయర్‌పై కార్పొరేటర్ల గరం గరం.. పదవీ గండం